
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట.
’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు.
తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment