న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూ–గాంధీల కుటుంబానికి విధేయుడిగా పేరొందిన గురుదాస్ కామత్(63) బుధవారం తీవ్రగుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఏడింటికి తీవ్రగుండెపోటుకు గురైన కామత్‌ను హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలియగానే ముంబై నుంచి కామత్ కొడుకుసహా కుటుం బమంతా ఆస్పత్రికి వచ్చిం ది. బుధవారం సాయంత్రం కామత్ పార్థివదేహాన్ని ముంబైకి తరలించారు. గురువారం ముంబైలో కామత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
న్యాయవాది నుంచి కేంద్ర మంత్రిదాకా..
వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ తొలుత ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ హయాంలో 1976 –80 వరకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా చేశారు. 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ చేశారు. ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఆయన గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్‌లలో పార్టీ సంక్షిష్ట సమయాల్లో, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్‌లలో పార్టీ వ్యవహారాలు చూసు కున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాక గత కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.
ప్రముఖుల నివాళులు
కామత్ మరణం వార్త తెలియగానే యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలో ఆస్పత్రికి వచ్చి కామత్‌కు నివాళులర్పించారు. ‘సీనియర్ నేత కామత్ మరణం పార్టీకి తీరని లోటు. ముంబైలో కాంగ్రెస్ పునర్‌వైభవానికి ఆయన ఎంతగానో కృషి చేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నేత మల్లి కార్జున్ ఖర్గేలు కామత్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గొప్ప పార్లమెం టేరియన్, సమర్థుడైన మంత్రి అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మాస్ లీడర్ అయిన కామత్ ముంబైకర్ల సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాడేవారని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత
Published Thu, Aug 23 2018 3:18 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment