Gurudas Kamat
-
సరిగ్గా అదే రోజున, అక్కడే ఆయన అంత్యక్రియలు!
ముంబై : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్(63) అంత్యక్రియలు ముంబైలోని చరాయి శ్మశాన వాటికలో గురువారం ముగిశాయి. అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(ఆగస్టు 23)న గురుదాస్ చరాయి శ్మశాన వాటికను ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. విధి ఎంత విచిత్రమైందో అంటూ ఆయన సన్నిహితులు నివాళులు అర్పించారు. ఆయన హఠాన్మరణం తమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే రోజున.. ‘ఆరోజు నాకు గుర్తుంది. నేను, గురుదాస్‌జీ, మా సహచరుడు హాందోర్ జీ కలిసి.. తొమ్మిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(ఆగస్టు 23)న ఈ శ్మశాన వాటికను ప్రారంభించాము. ఇప్పుడు గురుదాస్ జీ అంత్యక్రియలు ఇక్కడే, ఇలా జరగడం చూస్తుంటే విధి ఎంత విచిత్రమైందో కదా అన్పిస్తోంది. ఈ శ్మశాన వాటికను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తానన్న మాటను నిలబెట్టుకున్న గురుదాస్ ఇక్కడే శాశ్వతంగా నిద్రిస్తారని ఊహించలేదు. నిబద్ధత, నిజాయితీలకు మారుపేరైన గురుదాస్‌జీ లోటును ఎవరూ తీర్చలేరు’ అంటూ ముంబై మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ గురుదాస్ కామత్‌కు నివాళులు అర్పించారు. కాగా న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ బుధవారం తుదిశ్వాస విడిచారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూ–గాంధీల కుటుంబానికి విధేయుడిగా పేరొందిన గురుదాస్ కామత్(63) బుధవారం తీవ్రగుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఏడింటికి తీవ్రగుండెపోటుకు గురైన కామత్‌ను హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలియగానే ముంబై నుంచి కామత్ కొడుకుసహా కుటుం బమంతా ఆస్పత్రికి వచ్చిం ది. బుధవారం సాయంత్రం కామత్ పార్థివదేహాన్ని ముంబైకి తరలించారు. గురువారం ముంబైలో కామత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. న్యాయవాది నుంచి కేంద్ర మంత్రిదాకా.. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ తొలుత ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ హయాంలో 1976 –80 వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా చేశారు. 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ చేశారు. ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఆయన గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్‌లలో పార్టీ సంక్షిష్ట సమయాల్లో, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్‌లలో పార్టీ వ్యవహారాలు చూసు కున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాక గత కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ప్రముఖుల నివాళులు కామత్ మరణం వార్త తెలియగానే యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలో ఆస్పత్రికి వచ్చి కామత్‌కు నివాళులర్పించారు. ‘సీనియర్ నేత కామత్ మరణం పార్టీకి తీరని లోటు. ముంబైలో కాంగ్రెస్ పునర్వైభవానికి ఆయన ఎంతగానో కృషి చేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నేత మల్లి కార్జున్ ఖర్గేలు కామత్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గొప్ప పార్లమెం టేరియన్, సమర్థుడైన మంత్రి అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మాస్ లీడర్ అయిన కామత్ ముంబైకర్ల సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాడేవారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్(63) బుధవారం కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయ విద్యనభ్యసించిన కామత్ 1984లో ముంబై నార్త్ ఈస్ట్ నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఐదు పర్యాయాలు ఎంపీగా.. ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన (1984, 91, 98, 2004, 2009) కామత్.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2009- 11 వరకు ప్రసార, సమాచార శాఖ మంత్రిగా, హోం శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. జూలై 2011లో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా.. రాజస్తాన్, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కాంగ్రెస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2017లో పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాగా గురదాస్ కామత్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గురుదాస్ కామత్ జీ ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పెద్ద దెబ్బ. ముంబైలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కామత్ జీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. The sudden passing away of senior leader Gurudas Kamat ji, is a massive blow to the Congress family. Gurudas ji helped build the Congress party in Mumbai & was greatly respected & admired by all. My condolences to his family in their time of grief. May his soul rest in peace. — Rahul Gandhi (@RahulGandhi) August 22, 2018 -
పదవుల నుంచి తప్పుకున్న గురుదాస్ కామత్
న్యూఢిల్లీ : ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్... పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు ఆయన బుధవారమిక్కడ హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుదాస్ కామత్ మాట్లాడుతూ...గతవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలిపారు. ఇకపై తాను పార్టీలో ఏ విధమైన పదవిలో కొనసాగబోనని తేల్చి చెప్పారు. కాగా తనకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి, కాంగ్రెస్‌కు సేవ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి గురుదాస్ కామత్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా ముంబై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శివసేనతో పొత్తుపై గురుదాస్ కామత్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన రాహుల్‌ను కలిసి పదవీ బాధ్యతలను తప్పించాలని కోరారు. -
కాంగ్రెస్‌లో ఉంటేనే ప్రజాసేవ సాధ్యం!
రాజకీయాల నుంచే వైదొలగుతానంటూ ఇటీవల ప్రకటించిన కేంద్ర మాజీమంత్రి గురుదాస్ కామత్.. మళ్లీ పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. రెండు వారాల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను రాజీనామా చేశానని, వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నట్లు చెప్పానని అన్నారు. ఏ పార్టీ పేరు లేకుండా సమాజ సేవ చేద్దామన్న ఉద్దేశంతో అలా చేశానని తెలిపారు. అయితే, గత 15 రోజులుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తనకు ఫోన్లు చేస్తూ, పునరాలోచించుకోవాలని చెబుతూ వచ్చారని అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా సమావేశం అయిన తర్వాత.. దేశ ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సాధ్యం అవుతుందని తనకు అర్థమైందని కామత్ ఓ ప్రకటనలో తెలిపారు. తర్వలోనే తాను తాను ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానని.. గుజరాత్, రాజస్థాన్, దాద్రా నగర్ హవేలి, డామన్, డయ్యు రాష్ట్రాల ఇన్చార్జిగా ఉంటానని తెలిపారు. శుక్రవారం నుంచి ఆయా రాష్ట్రాల ప్రజలను కలుస్తానన్నారు. -
కాంగ్రెస్ కోటలో పాగా వేసేదెవరో..
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత ఎన్నికలు కూడా పూర్తి కావడంతో రాష్ట్రంలోని ప్రముఖ నాయకులంతా తుది విడత ఎన్నికలపై దృష్టిసారించనున్నారు. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే శివ్డీ నుంచి మలబార్‌హిల్ వరకు ఇది వ్యాపించి ఉంది. ఈ నియోజకవర్గంలో అన్ని రాష్ట్రాలకు చెందినవారితోపాటు తెలుగు ప్రజలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉంది. ఈసారీ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరా ప్రయత్నిస్తుండగా, ఈసారి పాగా వేసేందుకు మహాకూటమికి చెందిన శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్, ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానందగావ్కర్, ఆప్ అభ్యర్థి మీరా సాన్యాల్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖపోటీ నెలకొంది. 1996, 1999 మినహా 1984 నుంచి 2009 వరకు దక్షిణ ముంబై స్థానంలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేస్తూ వస్తోంది. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆప్ తరఫున కేజ్రీవాల్, ఎమ్మెన్నెస్ తరఫున రాజ్ఠాక్రేల ప్రచార ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించనుంది. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో దాదర్ తదితర మరాఠీ ప్రాబల్యమున్న ప్రాంతాన్నికూడా చేర్చారు. దీంతో మహాకూటమి, ఎమ్మెన్నెస్లకి కొంత లాభం చేకూరే అవకాశముంది. 2009 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానందగావ్కర్ ఏకంగా 1. 50 లక్షలకుపైగా ఓట్లు దక్కించుకుని రెండో స్థాన ంలో నిలిచారు. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మీరా సాన్యాల్ ఈసారి ఆప్ టికెట్‌పై బరిలోకి దిగారు. కాగా ఈసారి మోడీ ప్రబావంతోపాటు ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఉందని పేర్కొంటూ విజయం తమదేనని శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిలింద్ దేవరాకు గట్టి పోటీ... ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మిలింద్ దేవరాకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పథకం ప్రకారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రోడ్ షో, పాదయాత్రలతోపాటు వివిధ సంఘాలు నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్, సొసైటీల్లోని ప్రజలతో భేటీ కావడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. భేండీ బజార్లో పునరాభివృద్ధి, ఉపాధి కోసం కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా దక్షిణ ముంబై-నవీముంబైల మధ్య రాబోయే రోజుల్లో జలరవాణా, కొలాబా వరకు మోనో రైలు సేవలు, నావాశేవా-శివ్డీ సీలింక్ ప్రాజెక్టు తదితర హామీలతో ఓటర్ల దృష్టిని తనవైపు మళ్లించుకుంటున్నారు. ముఖ్యంగా మిలింద్ దేవరాకు మల్బార్ హిల్, భేండిబజార్, భైకలా, ముం బాదేవి, కొలాబా తదితర ప్రాంతాల్లో మంచి పట్టుంది. అయితే ఆప్ అభ్యర్థి మీరా సాన్యాల్ పెద్ద ఎత్తున మిలింద్ దేవరా ఓట్లను కొల్లగొట్టే అవకాశమూ లేకపోలేదు. స్థానికంగా పట్టున్న బాలా... మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నాయకుడు బాలా నాందగావ్కర్ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. కార్పొరేటర్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులపై ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజ్‌గావ్-తాడవాడీకి చెందిన ఆయన శివ్డీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దగడూ సక్పాల్‌ను ఓడించి తన సత్తా చాటుకున్నారు. 2009లో మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఏకంగా 1.59 లక్షల ఓట్లతో రెండోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శివ్డీ, వర్లీ, భైకలా తదిత ర ప్రాంతాల్లో గట్టి పట్టు కలిగిన ఆయన ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నమో ప్రభావంపై సావంత్ ధీమా... మహాకూటమికి చెందిన శివసేన అభ్యర్థిగా అరవింద్ సావంత్ బరిలోకి దిగారు. గట్టి పోటీ కనిపిస్తున్నప్పటికీ గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ‘కామ్‌గార్ సంఘటన్’ (కార్మిక సంఘాలు)లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆయనను శివసేన బరిలోకి దింపింది. ఒకవైపు నియోజకవర్గంలో మంచి పట్టున్న మిలింద్ దేవరా ఉండగా మరోవైపు శివసేన ఓట్లను చీల్చనున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాందగావ్కర్ల నుంచి గట్టి పోటీ కన్పిస్తోంది. దీంతో ఓ పథకం ప్రకారం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ప్రభావంతోపాటు కాంగ్రెస్ వ్యతిరేక వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆప్ ఊపే మీరాకు బాసట.... బ్యాంకర్‌గా గుర్తింపు ఉన్న మీరా సాన్యాల్ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) టికెట్‌పై బరిలోకి దిగారు. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమె ఈసారి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తుండడంతో విజ యం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.2009 ఎన్నికల్లో 10,157 ఓట్లుమాత్రమే పొందిన ఆమె.... ఆప్ ప్రభావం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే ఆమె కోసం ప్రచారంచేసిన సంగతితెలిసిందే. ముఖ్యంగా ఆమెకు గుజరాతీ మార్వాడి సమాజం మద్దతు ఉంది. అదేవిధంగా మల్బార్ హిల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పట్టున్న ఆమె ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ మద్దతు
ముంబై: వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు గురుదాస్ కామత్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు కామత్‌లో ఉన్నాయని, ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ సమాజ సేవ చేయగలుగుతారో వారికే ప్రజలు గెలిపించాలని సల్మాన్ గొంతుతో రికార్డు చేసిన సందేశం వాయవ్యవ ముంబైలో హల్చల్ చేస్తోంది. అందులో కామత్‌కు నియోజకవర్గవాసులందరూ మద్దతు పలకాలని సల్మాన్ కోరాడు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి సల్మాన్ చిరకాల మిత్రుడు, నటుడు,నిర్మాత అయిన మహేశ్ మంజ్రేకర్ కూడా ఎంఎన్ఎస్ టికెట్‌పై బరిలో ఉన్నాడు. వీరే కాకుండా గజానన్ కీర్తివార్(శివసేన), రాఖీ సావంత్(నటి,ఆర్ఏపీ), కమల్‌ఖాన్ (ఎస్పీ) కూడా ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థికి సల్మాన్ ఖాన్ మద్దతు!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేతకు మద్దతు తెలిపారు. వాయవ్య ముంబై స్తానం నుంచి బరిలోకి దిగిన గురుదాస్ కామత్ కు ఓటెయ్యాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. కామత్ లో ఉండే నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ, సేవాగుణం లాంటి అంశాలు తనకు నచ్చాయని.. అందుకే ఆయనకు ఓటేయాలని చెబుతున్నానని సల్మాన్ తెలిపారు. రాజకీయాల్లో మంచి వ్యక్తిగా పేరున్న గురుదాస్ కామత్ కు ఓటర్లు బాసటగా నిలిచి గెలిపించాలని సల్మాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. తన కోసం కాకుండా ప్రజల కోసం శ్రమించే కామత్ అండగా నిలువాలని వీడియో సందేశంలో వెల్లడించారు. వాయవ్య ముంబై అభివృద్ధికి కామత్ చేసిన కృషి అద్బుతమని సల్మాన్ తన సందేశంలో వెల్లడించారు. అయితే సల్మాన్ కు అత్యంత సన్నిహితుడైన సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఇదే స్థానం నుంచి ఎంఎన్ఎస్ టికెట్ పై బరిలో దిగారు. -
'పచ్చి మిరపకాయ' గుర్తుతో రాఖీ సావంత్ కొత్త పార్టీ!
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. అవకాశం లభిస్తే బీజేపీ తరపున పోటీ చేస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇంకా విశేషమేమిటంటే పచ్చి మిరపకాయ గుర్తుతో ఓ పార్టీనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. తన ఆలోచణల్ని ఆచరణలో పెట్టేందుకుగాను జైన మతానికి చెందిన సాధువు పులక్ సాగర్ ను రాఖీ సావంత్ సోమవారం కలిసి ఆశీస్సుల్ని పొందారు. నిన్న ఆగ్రాకు చేరుకున్న రాఖీ సావంత్.. సాధువుతో రహస్య సమావేశం జరిపినట్టు సమాచారం. లోకసభ ఎన్నికల్లో ముంబై వాయవ్య ముంబై స్థానం నుంచి గురుదాస్ కామత్ పై పోటి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని పీఠంపై నరేంద్రమోడీని కూర్చుండ పెట్టేందుకు తాను కృషి చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. ఇకపై బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ పాత్రలకు స్వస్తి చెప్పనున్నట్టు.. మంచి పాత్రలు లభిస్తే నటిస్టానని సావంత్ తెలిపింది. -
ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్!
మరో బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజ్ థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) పార్టీ తరపున సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఎన్నికల బరిలోకి దిగనుండటంతో వాయవ్య ముంబైలో పోరు మరింత ఆసక్తిగా మారనుంది. ఇప్పటికే వాయవ్వ ముంబై లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గురుదాస్ కామత్, శివసేన నుంచి గజానన్ కీర్తికర్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మయాంక్ గాంధీ బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మహేశ్ మంజ్రేకర్ బరిలోకి దిగడంతో శివసేన అభ్యర్థి కీర్తికర్ గెలుపు అవకాశాలు సన్నగిల్లడమే కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గురుదాస్ కామత్ వాయవ్య ముంబై స్థానం నుంచి 38 వేల ఓట్లతో విజయం సాధించారు. కాని ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలువడం ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయాన్ని చెప్పవడం కష్టంగా మారింది. 16 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మరాఠీ, గుజరాతీ ఓటర్లే కీలకంగా మారనున్నారు. జుహు, విలే పార్లే వెస్ట్ తోపాటు, టెలివిజన్ రంగానికి చెందిన ఎక్కువ మంది ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవ్, అస్థిత్వ, పితా చిత్రాలకు దర్శకత్వం వహించగా, నటుడిగా పలు తెలుగు, హిందీ చిత్రాల్లో మహేశ్ కనిపించారు.