కాంగ్రెస్లో ఉంటేనే ప్రజాసేవ సాధ్యం!
రాజకీయాల నుంచే వైదొలగుతానంటూ ఇటీవల ప్రకటించిన కేంద్ర మాజీమంత్రి గురుదాస్ కామత్.. మళ్లీ పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. రెండు వారాల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను రాజీనామా చేశానని, వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నట్లు చెప్పానని అన్నారు. ఏ పార్టీ పేరు లేకుండా సమాజ సేవ చేద్దామన్న ఉద్దేశంతో అలా చేశానని తెలిపారు. అయితే, గత 15 రోజులుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తనకు ఫోన్లు చేస్తూ, పునరాలోచించుకోవాలని చెబుతూ వచ్చారని అన్నారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా సమావేశం అయిన తర్వాత.. దేశ ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సాధ్యం అవుతుందని తనకు అర్థమైందని కామత్ ఓ ప్రకటనలో తెలిపారు. తర్వలోనే తాను తాను ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానని.. గుజరాత్, రాజస్థాన్, దాద్రా నగర్ హవేలి, డామన్, డయ్యు రాష్ట్రాల ఇన్చార్జిగా ఉంటానని తెలిపారు. శుక్రవారం నుంచి ఆయా రాష్ట్రాల ప్రజలను కలుస్తానన్నారు.