సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత ఎన్నికలు కూడా పూర్తి కావడంతో రాష్ట్రంలోని ప్రముఖ నాయకులంతా తుది విడత ఎన్నికలపై దృష్టిసారించనున్నారు. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే శివ్డీ నుంచి మలబార్‌హిల్ వరకు ఇది వ్యాపించి ఉంది. ఈ నియోజకవర్గంలో అన్ని రాష్ట్రాలకు చెందినవారితోపాటు తెలుగు ప్రజలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉంది.
ఈసారీ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరా ప్రయత్నిస్తుండగా, ఈసారి పాగా వేసేందుకు మహాకూటమికి చెందిన శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్, ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానందగావ్కర్, ఆప్ అభ్యర్థి మీరా సాన్యాల్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖపోటీ నెలకొంది. 1996, 1999 మినహా 1984 నుంచి 2009 వరకు దక్షిణ ముంబై స్థానంలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేస్తూ వస్తోంది. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆప్ తరఫున కేజ్రీవాల్, ఎమ్మెన్నెస్ తరఫున రాజ్‌ఠాక్రేల ప్రచార ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించనుంది. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో దాదర్ తదితర మరాఠీ ప్రాబల్యమున్న ప్రాంతాన్నికూడా చేర్చారు.
దీంతో మహాకూటమి, ఎమ్మెన్నెస్‌లకి కొంత లాభం చేకూరే అవకాశముంది. 2009 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానందగావ్కర్ ఏకంగా 1. 50 లక్షలకుపైగా ఓట్లు దక్కించుకుని రెండో స్థాన ంలో నిలిచారు. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మీరా సాన్యాల్ ఈసారి ఆప్ టికెట్‌పై బరిలోకి దిగారు. కాగా ఈసారి మోడీ ప్రబావంతోపాటు ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఉందని పేర్కొంటూ విజయం తమదేనని శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మిలింద్ దేవరాకు గట్టి పోటీ...
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మిలింద్ దేవరాకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పథకం ప్రకారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రోడ్ షో, పాదయాత్రలతోపాటు వివిధ సంఘాలు నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్, సొసైటీల్లోని ప్రజలతో భేటీ కావడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. భేండీ బజార్‌లో పునరాభివృద్ధి, ఉపాధి కోసం కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా దక్షిణ ముంబై-నవీముంబైల మధ్య రాబోయే రోజుల్లో జలరవాణా, కొలాబా వరకు మోనో రైలు సేవలు, నావాశేవా-శివ్డీ సీలింక్ ప్రాజెక్టు తదితర హామీలతో ఓటర్ల దృష్టిని తనవైపు మళ్లించుకుంటున్నారు. ముఖ్యంగా మిలింద్ దేవరాకు మల్‌బార్ హిల్, భేండిబజార్, భైకలా, ముం బాదేవి, కొలాబా తదితర ప్రాంతాల్లో మంచి పట్టుంది. అయితే ఆప్ అభ్యర్థి మీరా సాన్యాల్ పెద్ద ఎత్తున మిలింద్ దేవరా ఓట్లను కొల్లగొట్టే అవకాశమూ లేకపోలేదు.
స్థానికంగా పట్టున్న బాలా...
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నాయకుడు బాలా నాందగావ్కర్ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. కార్పొరేటర్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులపై ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజ్‌గావ్-తాడవాడీకి చెందిన ఆయన శివ్డీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దగడూ సక్పాల్‌ను ఓడించి తన సత్తా చాటుకున్నారు. 2009లో మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఏకంగా 1.59 లక్షల ఓట్లతో రెండోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శివ్డీ, వర్లీ, భైకలా తదిత ర ప్రాంతాల్లో గట్టి పట్టు కలిగిన ఆయన ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నమో ప్రభావంపై సావంత్ ధీమా...
మహాకూటమికి చెందిన శివసేన అభ్యర్థిగా అరవింద్ సావంత్ బరిలోకి దిగారు. గట్టి పోటీ కనిపిస్తున్నప్పటికీ గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ‘కామ్‌గార్ సంఘటన్’ (కార్మిక సంఘాలు)లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆయనను శివసేన బరిలోకి దింపింది. ఒకవైపు నియోజకవర్గంలో మంచి పట్టున్న మిలింద్ దేవరా ఉండగా మరోవైపు శివసేన ఓట్లను చీల్చనున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాందగావ్కర్‌ల నుంచి గట్టి పోటీ కన్పిస్తోంది. దీంతో ఓ పథకం ప్రకారం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ప్రభావంతోపాటు కాంగ్రెస్ వ్యతిరేక వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆప్ ఊపే మీరాకు బాసట....
బ్యాంకర్‌గా గుర్తింపు ఉన్న మీరా సాన్యాల్ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) టికెట్‌పై బరిలోకి దిగారు. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆమె ఈసారి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తుండడంతో విజ యం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.2009 ఎన్నికల్లో 10,157 ఓట్లుమాత్రమే పొందిన ఆమె.... ఆప్ ప్రభావం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే ఆమె కోసం ప్రచారంచేసిన సంగతితెలిసిందే. ముఖ్యంగా ఆమెకు గుజరాతీ మార్వాడి సమాజం మద్దతు ఉంది. అదేవిధంగా మల్‌బార్ హిల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పట్టున్న ఆమె ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ కోటలో పాగా వేసేదెవరో..
Published Fri, Apr 18 2014 10:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement