పదవుల నుంచి తప్పుకున్న గురుదాస్ కామత్
న్యూఢిల్లీ : ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్... పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు ఆయన బుధవారమిక్కడ హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుదాస్ కామత్ మాట్లాడుతూ...గతవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలిపారు.
ఇకపై తాను పార్టీలో ఏ విధమైన పదవిలో కొనసాగబోనని తేల్చి చెప్పారు. కాగా తనకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి, కాంగ్రెస్‌కు సేవ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి గురుదాస్ కామత్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా ముంబై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శివసేనతో పొత్తుపై గురుదాస్ కామత్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన రాహుల్‌ను కలిసి పదవీ బాధ్యతలను తప్పించాలని కోరారు.