
కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ (ఫైల్ ఫొటో)
ముంబై : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్(63) అంత్యక్రియలు ముంబైలోని చరాయి శ్మశాన వాటికలో గురువారం ముగిశాయి. అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(ఆగస్టు 23)న గురుదాస్ చరాయి శ్మశాన వాటికను ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. విధి ఎంత విచిత్రమైందో అంటూ ఆయన సన్నిహితులు నివాళులు అర్పించారు. ఆయన హఠాన్మరణం తమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
సరిగ్గా ఇదే రోజున..
‘ఆరోజు నాకు గుర్తుంది. నేను, గురుదాస్‌జీ, మా సహచరుడు హాందోర్ జీ కలిసి.. తొమ్మిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(ఆగస్టు 23)న ఈ శ్మశాన వాటికను ప్రారంభించాము. ఇప్పుడు గురుదాస్ జీ అంత్యక్రియలు ఇక్కడే, ఇలా జరగడం చూస్తుంటే విధి ఎంత విచిత్రమైందో కదా అన్పిస్తోంది. ఈ శ్మశాన వాటికను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తానన్న మాటను నిలబెట్టుకున్న గురుదాస్ ఇక్కడే శాశ్వతంగా నిద్రిస్తారని ఊహించలేదు. నిబద్ధత, నిజాయితీలకు మారుపేరైన గురుదాస్‌జీ లోటును ఎవరూ తీర్చలేరు’ అంటూ ముంబై మాజీ ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాడ్ గురుదాస్ కామత్‌కు నివాళులు అర్పించారు. కాగా న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ బుధవారం తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment