కేజ్రీవాల్ రాజకీయ మార్గం సరికాదు: అన్నా హజారే
దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న దశలో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ స్థాపించడం సరైన చర్య కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్ తొలుత అన్నాహజారే నాయకత్వంలోనే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది ఆయన హజారేతో విభేదించి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. తాజా ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్గా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నాయి.
హజారే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ రాజకీయ ప్రవేశాన్ని తప్పుపట్టారు. 'మా జట్టు బలంగా ఉండటంతో పాటు ఐకమత్యంగా ఉంటే దేశ ముఖచిత్రాన్ని మార్చొచ్చు. ఉద్యమం బలపడిన సమయంలో కేజ్రీవాల్ పార్టీ పెట్టడం సరికాదు. తాజా ఎన్నికల సందర్భంగా నిధులు సేకరించేందుకు నా పేరు వాడుకోరాదని ఆయనకు లేఖ రాశా. ఆయనతో పోట్లాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల దేశానికి ఉపయోగం ఉండదు. ఈ నెల 10 నుంచి అవినీతి నిర్మూలన ఉద్యమాన్ని మళ్లీ చేపడుతాం. కేజ్రీవాల్ సహా ఏ రాజకీయ పార్టీ నాయకుడితోనూ వేదిక పంచుకోం' అని హజారే చెప్పారు.