'అన్నా హజారే కలలకు నమ్మక ద్రోహం'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ను కౌగిలించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమ్ఆద్మీ అసంతృప్త నేత శాంతి భూషణ్.. కేజ్రీవాల్ చర్యపై మండి పడ్డారు. అన్నా హజారే కలలకు నమ్మకద్రోహం చేసేదిలా కేజ్రీవాల్ చర్య ఉందని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ మాజీ సహచరుడు, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఈ కౌగిలింత చర్యను సిగ్గుమాలిన పనిగా అభివర్ణించాడు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో తమ ఆదర్శాలను వదిలేస్తున్నారని ఆయన విమర్శించాడు.
అయితే కేజ్రీవాల్ మద్దతు దారులు మాత్రం వేదిక మీద లాలు ప్రసాదే బలవంతంగా కేజ్రీవాల్ను కౌగిలించుకున్నారని ఆరోపించడం విశేషం. అయినా కౌగిలించుకున్నంత మాత్రాన ఇద్దరి అభిప్రాయాలు ఒకటయినట్టు కాదని, దీనిని వేదికపై జరిగిన చిన్న ఘటనగా చూడాలే తప్ప రాద్దాంతం చేయడం తగదంటున్నారు.
దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న అమ్ఆద్మీ పార్టీ అనతి కాలంలోనే ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కుంభకోణాలతో మసకబారిన లాలు ప్రసాద్తో అమ్ఆద్మీ అధినేత వ్యవహరించిన తీరుకు నెటిజియన్లు సైతం గరంగా ఉన్నారు.