ఆప్ నేత కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురక
బిల్లు పేలవమైనదన్న విమర్శలపై మండిపాటు
బిల్లులోని అంశాలపట్ల హర్షం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఉభయ సభలు ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని వెల్లడి
రాలెగావ్ సిద్ధీ (మహారాష్ట్ర): పార్లమెంటు పరిశీలనలో ఉన్న లోక్‌పాల్ సవరణ బిల్లు పేలవమైనదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శలను అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తప్పుబట్టారు. బిల్లు ఆమోదం పొందాక అందులో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే వాటిని సరిదిద్దేందుకు దీక్ష చేపట్టాలని కేజ్రీవాల్‌కు చురకలంటించారు. ప్రభుత్వం పటిష్ట లోక్‌పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలంటూ తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధీలో నిరవధిక దీక్షకు దిగిన హజారే ఆదివారం తన దీక్ష ఆరో రోజు ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. ‘బిల్లులోని నిబంధనలను నేను క్షుణ్ణంగా చదివా. నా డిమాండ్లలో చాలా వాటికి బిల్లులో చోటు లభించింది. సీబీఐపై అజమాయిషీని ప్రభుత్వం ఈ బిల్లులో తొలగించింది. అటువంటి మరో 13 అంశాలను కూడా బిల్లులో పొందుపరిచింది. ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపట్ల సంతోషంగా ఉన్నా.
రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటు, పౌర సేవల పత్రం (సిటిజన్స్ చార్టర్) వంటి డిమాండ్లకు కూడా బిల్లులో చోటుదక్కుతుందని ఆశిస్తున్నా. ఈ బిల్లు ప్రజలకు అనుకూలంగా ఉంది. అందుకే దీన్ని స్వాగతిస్తున్నా. బిల్లు తెచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒకవేళ బిల్లులో లోపాలున్నాయని నీకు (కేజ్రీవాల్) అనిపిస్తే వాటిని సరిదిద్దేందుకు ఉద్యమించు, ఆందోళన చేపట్టు, నిరాహారదీక్షకు దిగు’ అని హజారే వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌తో విభేదాలపై ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. ‘వారి (ఆప్ నేతలు) గురించి నేనేమీ చెప్పను. మేమెందుకు గొడవ పడాలి. ఆయన (కేజ్రీవాల్) ఆలోచనల మీద ఆయన్ను దృష్టిపెట్టుకోనివ్వండి. నిజం ఎప్పటికీ నిజమే. అదే చివరకు గెలుస్తుంది’ అని హజారే బదులిచ్చారు. అయితే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించే వరకూ దీక్ష విరమించబోనన్నారు. వీలైతే లోక్‌సభలోనూ ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని సూచించారు. భవిష్యత్తులో తిరస్కార హక్కు, రీకాల్ హక్కుల వంటి అంశాలపై ఉద్యమిస్తానని చెప్పారు.
హజారే వైఖరి విచారకరం: కేజ్రీవాల్
ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానంటూ హజారే చేసిన ప్రకటన విచారకరమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును బలహీనమైనదిగా అభివర్ణించారు. ప్రస్తుత బిల్లుకు ఆమోదం లభిస్తే దానివల్ల కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి తప్ప ఇంకెవరికీ మేలు జరగదని విమర్శించారు.