
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment