Lokpal
-
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్‌ను కొట్టేసిన లోక్‌పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది. -
లోక్‌పాల్ ఎదుట విచారణకు సెబీ చీఫ్
అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలని సెక్యూరిటీ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్పర్సన్ మాధబి పుర్ బచ్ను అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లోక్‌పాల్ ఆదేశించింది. ఈ విచారణకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా ఫిర్యాదుదారులు కూడా హాజరుకావాలని తెలిపింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) మాధబిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి 2025 జనవరిలో విచారణకు హాజరుకావాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది.మహువా మొయిత్రా, మరో ఇద్దరు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దాంతో నవంబరు 8న సెబీ చీఫ్‌ను లోక్‌పాల్ వివరణ అడిగింది. అందుకు ఆమె నాలుగు వారాల సమయం కోరారు. డిసెంబరు 7న ఫిర్యాదులో పేర్కొన్న విధంగా అఫిడవిట్ రూపంలో లోక్‌పాల్(Lokpal)కు వివరణ ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపేందుకు వచ్చే నెల 28న ఫిజికల్‌గా హాజరుకావాల్సిందిగా బచ్తోపాలు ఫిర్యాదుదారులను లోక్‌పాల్ ఆదేశించింది.అసలేం జరిగిందంటే..బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది.ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వేతనంఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానాసెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. -
మహువాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా వెల్లడించారు. తన ఫిర్యాదు ఆధారంగా లోక్‌పాల్ ఈ మేరకు ఆదేశించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. దీనిపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ‘‘సీబీఐ ముందుగా అదానీ గ్రూప్ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణం తదితరాలపై విచారణ జరిపితే బాగుంటుంది. ఆ తర్వాత నా అంశానికి రావచ్చు. నాకు ఎన్ని పాదరక్షలున్నాయో లెక్కపెట్టుకోవచ్చు’’ అని ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. ఇందుకు బదులుగా హీరానందానీ నుంచి డబ్బులతో పాటు ఇతరత్రా పలు రకాలుగా ఆమె భారీ స్థాయిలో లబ్ధి పొందారని ఆమెపై ఆరోపణ. ఎంపీ హోదాలో ఉంటూ డబ్బుల కోసం జాతీయ భద్రతనే ఆమె ప్రమాదంలో పడవేశారని లోక్‌సభ స్పీకర్‌కు దూబే గతంలో ఫిర్యాదు చేయడం తెల్సిందే. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేయడం విదితమే. ఈ ఉదంతంపై కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ) నోట్ ఇస్తారని చెబుతున్నారు. -
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి!
న్యూఢిల్లీ: ఎంక్వైరీ అండ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్లను త్వరగా నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్‌పాల్ కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్‌పాల్ బదులిచ్చింది. ప్రభుత్వధికారుల అవినీతిపై ఫిర్యా దులను పరిశీలించడం, ప్రాసిక్యూషన్ ప్రక్రియ జరపడమనే రెండు ప్రధాన విధులను ఈ ఇరువురు డైరెక్టర్లు నిర్వహిస్తారు. 2019 మార్చిలో లోక్‌పాల్‌కు ఛైర్పర్సన్ను, సభ్యులను నియమించారు. అయితే ఎంక్వైరీ డైరక్టర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ల నియామకం జరగలేదు. దీనిపై అజయ్ దూబే అనే యాక్టివిస్టు ఆర్టీఐ కింద లోక్‌పాల్‌ను ప్రశ్నించారు. లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం కింద వీరివురి నియామకం జరపాల్సిఉందని, కేంద్రం పంపిన పేర్ల నుంచి ఇద్దరిని లోక్‌పాల్ చైర్పర్సన్ ఎంపిక చేయాల్సి ఉందని అజయ్ చెప్పారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు -
కోవిడ్‌తో ‘లోక్‌పాల్’ త్రిపాఠీ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. -
‘లోక్‌పాల్’ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్‌పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్‌పాల్ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది. ప్రజా సేవకుల అవినీతి కేసులను విచారించేందుకు లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2019, మార్చిలో లోక్‌పాల్ మొదటి చైర్మన్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణం చేశారు. జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో పాటు జస్టిస్ పీకే మహంతి, జస్టిస్ అభిలాష్ కుమారి, జస్టిస్ ఏకే త్రిపాఠి సభ్యులుగా నియమితులయ్యారు. తాజాగా జస్టిస్ దిలీప్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు
సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించినందుకు గాను వారికి ప్రభుత్వం నుంచి తాయిలాలు అందాయని, ఈ వ్యవహారంపై విచార ణ జరిపించాలని కోరుతూ లోక్‌పాల్‌కు పీసీసీ ప్రధా న కార్యదర్శి కె.మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్యలకు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించి ఇచ్చారని, అలాగే ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికి కాంట్రాక్టు బిల్లుల తక్షణ చెల్లింపు, భవిష్యత్‌లో కాంట్రాక్టుల కేటాయింపు హామీలివ్వడం ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు.ఖమ్మం అర్బన్ మండలంలో 10,489 చదరపు గజాలను పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీకి కేటాయించారన్నారు. తొలుత క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించిన రెవెన్యూ శాఖ.. అజయ్‌కుమార్ కాంగ్రెస్ నుంచి 2016 ఏప్రిల్‌లో టీఆర్ఎస్లోకి చేరిన తర్వాత ఆ దరఖాస్తును పరిష్కరించారని నివేదించారు. ఈ స్థలం రూ.50 కోట్ల విలు వ చేస్తుందని, కానీ టీఆర్ఎస్లో చేరినందుకు కృత జ్ఞతగా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరించారని తెలిపారు. అలాగే సండ్ర వెంకట వీరయ్య బుర్హాన్‌పురం రెవెన్యూ గ్రామంలో 1,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించారని, టీఆర్ఎస్లో చేరినందుకు రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని రూ.50 లక్షల రుసుముతో క్రమబద్ధీకరించారన్నారు. కందాల ఉపేందర్‌రెడ్డి తనకు రావాల్సిన ప్రభుత్వ కాంట్రాక్టు పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణం చెల్లించడం, భవిష్యత్‌లో కొత్త కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం కల్పించడమనే షరతులతో పార్టీ ఫిరాయించారని నివేదించారు. ఈ వ్యవహారాలపై విచారణకు ఆదేశించాలని ఆయన పిటిషన్లో కోరారు. సదరు ఎమ్మెల్యేలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. -
సండ్ర, పువ్వాడ అజయ్‌పై లోక్‌పాల్‌లో ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్‌లపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు నమోదు అయింది. ఖరీదైన ప్రభుత్వ స్థాలాలను కబ్జా చేసి కేసీఆర్ ప్రభుత్వంతో క్రమబద్దీకరణ చేయించుకున్నారంటూ తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఫిర్యాదు చేశారు. రాజకీయ అవినీతికి పాల్పడ్డారని, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరీదైన ప్రభుత్వ స్థలాలను జీవో నెం.5 ద్వారా తక్కువ ధరకు కట్టబెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాజకీయ అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ఫై, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ స్థలాల తాయిలాలకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి లొంగిపోయారని అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనానికి సంతకం పెట్టిన మొత్తం 11మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు మానవతా రాయ్ తెలిపారు. -
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
చరిత్రాత్మక ఘట్టం.. ఎవరీ పీసీ ఘోష్..?
న్యూఢిల్లీ : భారతదేశ లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా భారత సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తదితరులు హాజరయ్యారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని లోక్‌పాల్ అంబుడ్స్‌మెన్ వ్యవస్థలో వివిధ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బి భోస్లే, ప్రదీప్ కుమార్ మహంతి, అభిలాష కుమారిలతో పాటుగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార త్రిపాఠి లోక్‌పాల్ సభ్యులుగా ఉంటారు. వీరందరూ 70 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి రిటైర్ అవుతారు.(ఎట్టకేలకు లోక్‌పాల్) ఎవరీ పీసీ ఘోష్...? చరిత్రాత్మక లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా నియిమితులైన పీసీ ఘోష్ 1952 మే 28న కోల్‌కతాలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. ఆ పిమ్మట 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ ధర్మాసనమే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. ఇక 2017 మే 27న జస్టిస్ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. లోక్‌పాల్ విధి- విధానాలు... ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దాఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు. ఇక ఫిబ్రవరి చివరి నాటికి లోక్‌పాల్ నియామకం జరపాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్యానెల్ కమిటీ.. పీసీ ఘోష్‌ను లోక్‌పాల్‌గా ఎంపిక చేశారు. ఇక లోక్‌పాల్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన.. ఐదేళ్ల తర్వాత, ఎన్నికల ముందు లోక్‌పాల్ నియామకం జరగడం గమనార్హం. President Kovind administered the Oath of Office to Justice Pinaki Chandra Ghose as Chairperson, Lokpal, at a ceremony held at Rashtrapati Bhavan pic.twitter.com/flXLRbjWjg — President of India (@rashtrapatibhvn) March 23, 2019 -
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) మంగళవారం నియమితులయ్యారు. సశస్త్ర సీమా బల్ మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు లోక్‌పాల్ కమిటీలో న్యాయేతర సభ్యులుగా ఉండనున్నారు. లోక్‌పాల్‌లో నియామకం కోసం వీరందరి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. అవినీతిపై పోరు కోసం కేంద్రం లోక్‌పాల్‌ను తీసుకొస్తుండటం తెలిసిందే. -
ఇంతకు ‘లోక్‌పాల్’ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించి ఐదేళ్ల అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్‌ను ఆదివారం నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఈ లోక్‌పాల్ కమిటీలోకి ఎనిమిది మంది సభ్యులను తీసుకోవాల్సి ఉంది. కమిటీలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలోనే దేశంలో నల్ల డబ్బును నిర్మూలిస్తానని, అవినీతిని అంతం చేస్తానని తెగ ప్రచారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థాయిలో వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తారని సామాజిక కార్యకర్తలు ఆశించారు. తొలి లోక్‌పాల్‌ను నియమించడానికి నరేంద్ర మోదీకి ఐదేళ్లు పట్టింది. అదీ నాడు లోక్‌పాల్ కోసం ఉద్యమించిన అన్నా హజారే, లోక్‌పాల్‌ను నియమించాలంటూ మళ్లీ నిరశనకు దిగడం, మరోపక్క ఫిబ్రవరి నెలలోగా లోక్‌పాల్‌ను నియమించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పరిణామాల మధ్య మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ ఎట్టకేలకు తొలి లోక్‌పాల్‌ను సిఫార్సు చేసింది. అదీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక. మిగతా ఎనిమిది మంది సభ్యుల నియామకం ఎన్నికల్లోగా జరుగుతుందన్న నమ్మకం లేదు. సుప్రీం కోర్టు విధించిన గడువుకాలం ముగిసిన తర్వాత లోక్‌పాల్‌ను ఖరారు చేసినందున ఆయన నియామకం చెల్లుతుందన్న గ్యారంటీ లేదు. అవినీతి జరగకుండా చూసేందుకు ‘నేను కాపలాదారుడిని’ అని ప్రచారం చేసుకుంటున్న మోదీకి, మరింత ఎన్నికల ప్రచారం కోసం లోక్‌పాల్ నియామకం పనికి వస్తుందేమో! ఎంపిక కమిటీలో ప్రతిపక్షం మాటకు ఏం మాత్రం విలువ లేనప్పుడు లోక్‌పాల్ కమిటీ వల్ల ప్రభుత్వంలో అవినీతిని అరికట్టవచ్చని భావించడం అత్యాశే కావచ్చు! గుజరాత్ ముఖ్యమంత్రిగా లోక్‌పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ‘లోక్‌పాల్ వ్యవస్థను తీసుకొస్తారనుకోవడం పొరపాటే కావచ్చు! 1968లోనే లోక్‌పాల్ గురించి చర్చ ప్రభుత్వ స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఓ వ్యవస్థ కావాలంటూ 1968లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయడంతో నాలుగవ లోక్‌సభలో లోక్‌పాల్ వ్యవస్థ గురించి మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్‌పాల్ వ్యవస్థకు భయపడడం వల్ల ప్రధాని సహా కేబినెట్ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరన్న వాదనతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత అనేక సార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అదే వాదనతో దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. దేశంలో అవినీతి అరికట్టేందుకు లోక్‌పాల్ వ్యవస్థ కావాలంటూ 2011లో అన్నా హజారే, నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లోక్‌పాల్ బిల్లుకు అంగీకరించింది. బిల్లును తీసుకరావడానకి రెండేళ్లు పట్టింది. 2013లో తీసుకొచ్చినప్పటికీ బిల్లులో మార్పులు, చేర్పుల కోసం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలు, స్థాయి సంఘాల చుట్టూ తిప్పడంతో 2014, జనవరి 1వ తేదీన చట్టరూపం దాల్చింది. లోక్‌పాల్ నియామకంపై జరుగుతున్న జాప్యానికి మూడున్నర ఏళ్లపాటు మౌనం వహించిన రాహుల్ గాంధీ 2018, జనవరి నెల నుంచి నరేంద్ర మోదీపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయమై నిలదీస్తూ వచ్చారు. -
తొలి లోక్‌పాల్ పీసీ ఘోష్!
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లోక్‌పాల్ నియామకం కొలిక్కి వచ్చింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) పేరును కేంద్రం ఖరారుచేసినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు. అయితే కమిటీ జస్టిస్ ఘోష్ పేరును ఖరారుచేసిన శుక్రవారం నాటి సమావేశానికి మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. లోక్‌పాల్ తొలి చైర్మన్ పదవికి సెర్చ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన తుది 10 మందిలో జస్టిస్ ఘోష్ కూడా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ అర్హుల జాబితాను కేంద్రానికి పంపింది. అందులో నుంచి జస్టిస్ ఘోష్ పేరును ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది. తొలి లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌పాల్ నియామకంపై పడిన ముందడుగును ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే స్వాగతించారు. 48 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పరిధిలోకి ప్రధాని కూడా.. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు. తండ్రీ జస్టిసే.. 1952 మే 28న కోల్‌కతాలో పీసీ ఘోష్ జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్లో పేరు నమోదుచేసుకున్నారు. 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ బెంచే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. -
తొలి లోక్‌పాల్‌గా పీసీ ఘోష్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్(పీసీ ఘోష్) తొలి లోక్‌పాల్‌గా నియమితులు కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిలతో కూడిన సెలక్షన్ కమిటీ జస్టిస్ ఘోష్‌ను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే రేపు(సోమవారం) వెలువడే అవకాశముంది. జస్టిస్ పీసీ ఘోష్ నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2017లో ఆయన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్‌పాల్ ఎంపిక సమావేశానికి లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్‌ఖర్గే హాజరుకాలేదు. లోక్‌పాల్‌లోని 8 మంది సభ్యులు, ఇతర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేవారం విడుదల కానుంది. లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు స్పందించింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ హామీయిచ్చారు. ఐదేళ్లు పూర్తవుతున్నా హామీని నిలుపుకోకపోవడంతో.. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ జనవరిలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
లోక్‌పాల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: సామాజికవేత్త్త అన్నా హజారే దీక్షను విరమించడంతో లోక్‌పాల్ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌గా భావించే లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ అయింది. అర్హతలు, నిబంధనలు ► లోక్‌పాల్ చైర్మన్ పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన వారు లేదా అవినీతి వ్యతిరేక విధానాలు, ప్రజా పాలన, విజిలెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, న్యాయ శాస్త్రం, మేనేజ్మెంట్ తదితర రంగాల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు. ► 45 ఏళ్లకు తక్కువగా ఉన్నవారు అనర్హులు. ► లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. అందులో నలుగురు న్యాయశాస్త్రంలో అనుభవం కలిగి ఉండాలి. ► కనీసం నలుగురికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళల నుంచి అవకాశం కల్పిస్తారు. ► చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది అమలవుతుంది). ∙చైర్మన్ జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాలకు సమానంగా ఉంటాయి. సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా చెల్లిస్తారు. ∙పదవీ కాలంలో వారు ఎలాంటి ఇతర లాభదాయక పదవులు నిర్వహించరాదు. ఎన్నికల్లో పోటీచేయరాదు. ∙దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 22. -
పద్మభూషణ్ వెనక్కిచ్చేస్తా: హజారే
రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్ చేశారు. కాగా, హజారేకు డాక్టర్ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామప్రజలు అహ్మద్‌నగర్–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్‌పాల్‌కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్‌పాల్‌కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్‌లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్‌లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
నిరహార దీక్ష చేపట్టిన అన్నా హజారే
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
లోక్‌పాల్ ఎక్కడ?
లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీకి ఫిబ్రవరి ఆఖరులోగా పేర్ల జాబితా సమర్పించాలని సెర్చ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశించింది. 2018 మార్చి నుంచి సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అనేక అవ కాశాలు ఇచ్చింది. కానీ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. నత్తనడక నడుస్తోంది. 2014 ఎన్నికల ప్రచారంలో తరచుగా వినిపించిన మాట లోక్‌పాల్. యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమైనదని దుయ్యబడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రకటించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి (మే 26, 2014) నాలుగేళ్ళ ఎనిమిది మాసాలు గడిచిపోయినాయి. ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. లోక్‌పాల్‌ను నియమించాలనే పట్టింపు ప్రధానికి ఉంటే ఆ పని ఎప్పుడో జరిగేది. ఆ సంకల్పం లేదు. అంతే. ఎన్నికల ప్రచారంలో చేసిన బాసలు కపట రాజకీయంలో భాగమే అనుకోవాలి. గుజ రాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 12 సంవత్సరాలలో కూడా మోదీ లోకాయుక్తను నియమిం చలేదు. ప్రజాప్రతినిధులలో, ప్రజాసేవకులలో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్‌ను నియమించా లన్న ఉద్యమం 1960లలో మొదలయింది. 2010లో ఊపందుకున్నది. అరుణారాయ్ నాయక త్వంలో ప్రజల హక్కుకోసం జాతీయ ఉద్యమం (నేషనల్ కేంపేన్ ఫర్ పీపుల్స్ రైట్స్– ఎన్సీపీ ఆర్ఐ) జన్‌లోక్‌పాల్ బిల్లు తయారు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ నియమించింది. అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషన్, శేఖర్సింగ్లతో కూడిన కమిటీ ఒక ముసాయిదా బిల్లును రూపొందించారు. దాని ఆధారంగా 2011 జనవరిలో ఢిల్లీలో రాంలీలా మైదానంలో పెద్ద బహిరం గసభ జరిగింది. మూడు మాసాల అనంతరం 2011 ఏప్రిల్‌లో అన్నాహజారే జంతర్‌మంతర్‌లో లోక్‌పాల్ చట్టం కోసం నిరవధిక నిరాహారదీక్ష ఆరంభించారు. ప్రభుత్వం దిగివచ్చింది. బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి తొమ్మిదిమంది ప్రముఖులతో ఒక సంయుక్త సంఘాన్ని అన్నా హజారే నియమించారు. ఇందులో అయిదుగురు సీనియర్ కేంద్ర మంత్రులూ, నలుగురు పౌరసమాజ ప్రముఖులూ ఉన్నారు. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ, కపిల్ శిబ్బల్, సల్మాన్ ఖుర్షీద్, వీరప్పమొయిలీ, పి చిదంబరం కేంద్ర మంత్రులు. శాంతిభూషణ్, సంతోష్‌హెగ్డే, కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్ పౌర సమాజం ప్రతినిధులు. సంయుక్త సంఘం రెండు అంశాలపైన విభేదాల కారణంగా బిల్లును ఖరారు చేయలేకపోయింది. సెలక్షన్ కమిటీలో రాజకీయ ప్రముఖులు ఉండాలా లేక రాజకీయేతర ప్రముఖులు ఉండాలా అనే అంశంపైనా, సీబీఐ లోక్‌పాల్ కిందికి రావాలా, లేదా అనే అంశంపైనా స్పష్టత కొరవడింది. చివరికి 2013 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన బిల్లులో ఈ రెండు అంశాల విషయంలో ఉద్యమకారులకు నిరాశ కలిగింది. సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడూ, ఒక న్యాయకోవిదుడూ ఉండాలని బిల్లులో ఉంది. సీబీఐ లోక్‌పాల్ పరిధిలోకి రాదని కూడా తేల్చారు. అవినీతిపై పోరాటానికి ఏదో ఒక చట్టం వస్తే అంతే చాలునని హజారే, తదితరులు భావించారు. 2014 జనవరి ఒకటో తేదీన జీవో వచ్చింది. తర్వాత నియమనిబంధనలు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి ప్రధాని మన్మోహన్సింగ్, సభాపతి మీరాకుమార్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, న్యాయకోవిదుడు పిపి రావులు రెండు విడతలు సమావేశమైనారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 మాసాలపాటు లోక్‌పాల్ ఊసు లేదు. సెలక్షన్ కమిటీ సమావేశం లేదు. కామన్‌కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) తరఫున ప్రశాంత్‌భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పైన సుప్రీంకోర్టు స్పందించిన కారణంగా సెలక్షన్ కమిటీ సమావేశాలు 2018 మార్చి ఒకటి నుంచి ఇంత వరకూ ఆరుసార్లు జరిగాయి. పీపీ రావు మృతి కారణంగా ముకుల్ రోహట్గీని న్యాయకోవిదుడుగా కమిటీలో నియమించారు. సెలక్షన్ కమిటీ సమావేశాలకు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ఖర్గేని ‘ఆహ్వానితుడుగా’ పిలుస్తున్నారు. హాజరు కావడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఆహ్వానితుడికి ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన వాగ్మూలం నమోదు కాదు. తనను సభ్యుడిగా ఆహ్వానించాలనీ, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2014, స్ఫూర్తిని అనుసరించి అతి పెద్ద ప్రతిపక్షానికి నాయకుడైన తనను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆహ్వానించాలని ఆయన వాదన. మోదీ అంగీకరించరు. లోక్‌పాల్ చట్టానికి 2016లో ఎన్డీఏ సర్కార్ సవరణ తెచ్చేందుకు ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ అందులో ఈ వివాదానికి పరిష్కారం లేదు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో లోక్‌సభలో ఎవ్వరూ లేరు కనుక కమిటీ సమావేశాలు సవ్యంగా జరగడం లేదనీ, సెర్చ్ కమిటీకి ప్రాథమిక సౌకర్యాలు లేవనీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టులో చెప్పారు. ఇది కేవలం ఒక సాకు. నిజంగా ప్రధానమంత్రికి లోక్‌పాల్ నియామకంపైన చిత్తశుద్ధి ఉంటే సెర్చి కమిటీ అధ్యక్షుడికి అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు. ఖర్గేని ప్రతిపక్ష నాయ కుడిగా పరిగణించవచ్చు లేదా తక్కిన నలుగురు సభ్యులూ కలసి ఒక వ్యక్తిని లోక్‌పాల్‌గా నిర్ణయిం చవచ్చు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక సుప్రీంకోర్టు నేరుగా లోక్‌పాల్‌ను నియమించా లని ప్రశాంత్‌భూషణ్ వాదిస్తున్నారు. ఎంతో పట్టుదలతో పోరాడి సాధించుకున్న లోక్‌పాల్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత కారణంగా అయిదేళ్ళుగా నిష్ఫలంగా ఉండటం విషాదం. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం), సీఐసీ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్– కేంద్ర సమాచార వ్యవస్థ) నీరు గారి పోతున్నాయంటూ, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కోల్పోతున్నాయనీ మాజీ కేంద్ర సమాచార కమిష నర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆవేదన వెలిబుచ్చుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి అయినా పట్టించుకుంటారా? -
‘అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష’
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అన్నా.. ప్రధాని చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు.. కానీ చేతల్లో మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచాయి. కానీ ఇప్పటివరకూ లోక్‌పాల్, లోకాయుక్తను నియమించలేదన్నారు. అందుకు నిరసనగా కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు. అంతేకాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని హమీ ఇచ్చింది. కానీ ఇంత వరకూ అందుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆ కమిషనే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్లపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
లోక్‌పాల్ ఎంపిక కమిటీ నియామకం
న్యూఢిల్లీ: అవినీతి నిరోధం కోసం నియమించనున్న లోక్‌పాల్‌కు చైర్పర్సన్, ఇతర సభ్యులను ఎంపిక చేసేందుకు ఓ కమిటీని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్‌వుమన్ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్, గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ ఖండ్వావాల, రాజస్తాన్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్, మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌లు ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘లోక్‌పాల్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి లోక్‌పాల్ ఎంపిక జరుగుతోంది’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేకుండానే ఈ ఎనిమిది మంది కమిటీని కేంద్రం నియమించింది. -
లోక్‌పాల్’ను బాయ్‌కాట్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌పాల్ ఎంపిక కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్ చేసింది. ‘ప్రత్యేక ఆహ్వానితులు’గా హాజరు కావాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేకు కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ మేరకు ప్రధానికి ఖర్గే లేఖ రాశారు. లోక్‌పాల్ ఎంపికలో ప్రతిపక్ష గొంతు లేకుండా చేసేందుకే ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారని ఆరోపించారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అయితే ఖర్గేకు ఆ హోదా లేకపోవడంతో ఆయన కమిటీలో సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయనను కేంద్రం పిలిచింది. లోక్‌పాల్ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు. -
కనీసం ‘లోక్‌పాల్’ కూడా లేదు
సాక్షి, బెంగళూరు (బెళగావి): అవినీతిపై పోరాటం అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోదీ లోక్‌పాల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. సోమవారం కర్ణాటకలో బెళగావి రామదుర్గ బహిరంగసభలో ప్రసంగిస్తూ కనీసం ఢిల్లీలో కూడా లోక్‌పాల్‌ను మోదీ ఏర్పాటు చేయలేకపోయారన్నారు. దేశంలో అతి పెద్ద మోసాలు, నేరాలు సంభవిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. మోదీ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి తమ సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప, బీజేపీ మాజీ మంత్రులు పక్కనే కూర్చొని ఉండడాన్ని మరచినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. కర్ణాటకలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ చెప్పారు. రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల రెండో విడత జనాశీర్వాద యాత్ర సోమవారంతో ముగిసింది. -
మార్పుల్లేని లోక్‌పాల్ బడ్జెట్
న్యూఢిల్లీ: అవినీతి కట్టడికి ఏర్పాటు చేయనున్న లోక్‌పాల్ కోసం కేటాయించిన రూ.4.29 కోట్ల బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు కేటాయించిన బడ్జెట్లో మాత్రం 1.5 కోట్ల స్వల్ప వృద్ధి కనిపించింది. గురువారం పార్లమెంట్లో జైట్లీ సమర్పించిన 2018–19 బడ్జెట్ లెక్కల ప్రకారం, అవినీతి నిరోధానికి ఏర్పాటు చేయబోయే లోక్పాల్కోసం 4.29 కోట్లు కేటాయించారు.