సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో అవినీతి లేకపోతే కర్ణాటకలో మాదిరి మంత్రులందరినీ లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిలదీశారు. ముఖ్యమంత్రి ఇండియా టుడేకు ఇచ్చి ఇంటర్వ్యూలో అన్నీ అవాస్తవాలే మాట్లాడారని, ఏవిషయంపైనా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధిలో నెంబర్ వన్ స్టేట్ అని చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనన్నారు. గొర్ల కొనుగోళ్లలో అవినీతి జరిగితే సీఎం గొప్పగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆంధ్ర పెట్టుబడిదారులు ఇప్పుడు ముఖ్యమంత్రి పంచన చేరారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్ర సామాన్య జనం వలసపోతే నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబులతో ముఖ్యమంత్రి సన్మానం చేయించుకుంటున్నాడని అన్నారు. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అనే అంశంపై చర్చ జరగాలంటూ దీని గురించి ఎవరితోనూ చర్చించకుండా కేసీఆర్ మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దేశ రెండో రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతిని సీఎం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలు లేకుంటే హెచ్‌టీ కాటన్ రాష్ట్రమంతా ఎలా సరఫరా చేయగలిగిందని దాసోజు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment