సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వంలోని 11 మంది మంత్రులు ప్రమాణం చేసినప్పటికీ వారికి గురువారం ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ అభీష్టం మేరకు జరిగే శాఖల కేటాయింపు అధికారికంగా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి, మంత్రులు ప్రమాణం చేసిన రోజునే సాయంత్రానికి సాధారణ పరిపాలన శాఖ ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ నూతన ప్రభుత్వంలో అలా జరగలేదు. మధ్యాహ్నం 2 గంటల లోపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసినప్పటికీ రాత్రి వరకు ఇలాంటి ఉత్తర్వులేవీ రాలేదు.
ఈలోపే ఫలానా మంత్రికి ఫలానా శాఖ కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆధారంగా పలువురు మంత్రుల అనుచరులు, సన్నిహితులు తమ నేతకు ఫలానా శాఖ కేటాయించారనే నిర్ధారణకు వచ్చారు. కానీ అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపాయి. ‘ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం.
ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపు వార్తలను ప్రజలు నమ్మొద్దు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆదేశాలిస్తుంది. ఆ ఆదేశాలు జారీ చేసేంతవరకు శాఖల కేటాయింపుపై ప్రచారాలు నమ్మవద్దు.’ అని గాం«దీభవన్ నుంచి ప్రకటన వెలువడింది. కాగా కొత్త మంత్రులకు శుక్రవారం శాఖల కేటాయింపు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment