అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామక ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. అవినీతి నిరోధక విభాగమైన లోక్‌పాల్ నియామక ప్రక్రియ పూర్తిగా రాజకీయ అక్రమమని, ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమని బీజేపీ నేత అరుణ్‌జైట్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియ చట్టపరంగా సందేహించాల్సిందేనన్నారు. అక్రమంగా తీసుకునే ఇటువంటి తొందరపాటు చర్యల వల్ల లోక్‌పాల్ ఏర్పడకముందే దాని విశ్వసనీయతకు విఘాతం కలుగుతుందన్నారు. యూపీఏ చర్యను తప్పుబడుతూ ఈ మేరకు జైట్లీ తన బ్లాగ్‌లో అభిప్రాయాలు వెల్లడించారు.
ఈ నెల 27 లేదా 28న ప్రధాని లోక్‌పాల్ నియామక కమిటీని సమావేశపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సగం పూర్తయ్యాయి. మరో 26 రోజుల్లో ఫలితాలు రావడంతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారం నుంచి దిగిపోయే ముందు, హడావిడిగా యూపీఏ లోక్‌పాల్ నియామక ప్రక్రియ చేపట్టం సరైనదేనా? అని జైట్లీ ప్రశ్నించారు. ఇలాంటి అనైతిక చర్య లోక్‌పాల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దీన్ని చేపట్టడంపై ప్రధాని ఆత్మపరిశీలించుకోవాలని ఆయన సూచించారు.