పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష: జైట్లీ
న్యూఢిల్లీ: పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం యూపీఏ పాలనపై గురి పెట్టింది! వివిధ ప్రాజెక్టులకు యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని ప్రకటించింది. నాడు పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది. ‘పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఆరోపణలు చూస్తుంటే.. యూపీఏ సర్కారు శాడిస్టు ఆర్థిక విధానాలు అవలంబించినట్లు స్పష్టమవుతోంది.
చట్టాలతో నిమిత్తం లేకుండా వారి అనుంగులకే అనుమతులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు ఇచ్చిన లేదా నిరాకరించిన పర్యావరణ అనుమతులపై ప్రస్తుత పర్యావరణ శాఖ సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం విలేకరులతో అన్నారు. అనుమతుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే యూపీఏ హయాంలో వృద్ధిరేటు కుంటుపడిందన్నారు.