Jayanthi Natarajan
-
కేంద్ర మాజీమంత్రి నివాసంలో సీబీఐ సోదాలు
-
కేంద్ర మాజీమంత్రి నివాసంలో సీబీఐ సోదాలు
సాక్షి, చెన్నై : కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ నివాసంలో సీబీఐ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. యూపీఏ హయాంలో జార్ఖండ్‌లో పర్యావరణ అనుమతుల కేసులో అధికారుల సోదాలు చేపట్టారు. మైనింగ్ చట్టాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగంతో ఆమెపై120బీ పీసీ చట్టం కింద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు గంటలుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్‌తో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి చెన్నైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, రాంచీ, ఒడిశాలోనూ సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. జయంతీ నటరాజన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కంపెనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ హక్కులకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ ఇప్పటికే ఐదు ప్రాథమిక విచారణలను నమోదు చేసింది. కాగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన జయంతి నటరాజన్ 2015 జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని కేంద్రం గతంతోనే ప్రకటించిన విషయం విదితమే. -
గ్రూపు రచ్చ
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో గ్రూపుల రచ్చ ఢిల్లీకి చేరింది. చిదంబరం ఫిర్యాదుతో రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీకి పరుగులు తీశారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో చిదంబరం మద్దతు దారులు దాడికి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఈ వివాదాలే ఆ పార్టీకి గడ్డు పరిస్థితులను కల్పించాయి. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తమిళ మానిల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మరింత తగ్గింది. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ బాధ్యతలు చేపట్టిన క్షణాల్లో వాసన్ వ్యతిరేక శక్తులందరూ ఏకమయ్యారు. తామంతా ఐక్యతతో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రగల్బాలు పలికారు. ఈ ఐక్యతను చాటుకుని నెలలు గడవక ముందే, మళ్లీ గ్రూపులు రచ్చకెక్కాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గానికి షాక్‌లు ఇచ్చేరీతిలో ఈవీకేఎస్ మద్దతు దారులు గళాన్ని పెంచారు. ఈ వ్యాఖ్యల యుద్ధం చివరకు తారా స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో మరో మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు టాటా చెప్పడంతో పాటుగా అటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ మీద దుమ్మెత్తి పోసి వెళ్లారు. ఇందుకు స్పందించిన ఈవీకేఎస్ నోరు జారారు. చిదంబరంతో కయ్యానికి కాలు దువ్వుతూ తీవ్రంగానే స్పందించడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. చిదంబరం ఫిర్యాదు : జయంతి నటరాజన్ బయటకు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టం లేదని ఈవీకేఎస్ వ్యాఖ్యానించారు. ఆమె బాటలోనే తండ్రి, తనయుడు నడిస్తే రాష్ర్ట కాంగ్రెస్‌కు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని పరోక్షంగా చిదంబరం, ఆయన తనయుడు కార్తీలను ఉద్దేశించి ఈవీకేఎస్ వ్యాఖ్యానించ డం ఢిల్లీకి చేరింది. తనను, తన కుమారుడిని పార్టీ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరు ఇచ్చారంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చిదంబరం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఫలితంగా, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఓ పెద్ద గ్రూపే బయలుదేరడం గమనార్హం. ఢిల్లీకి పరుగు : ఈవీకేఎస్ను తప్పించాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఢిల్లీకి ఫిర్యాదులు చేశారుు. ఈవీకేఎస్ రూపంలో వాసన్ బయటకు వెళ్లాల్సి వచ్చిందని, జయంతి నటరాజన్ అదే బాటలో పయనించారని పేర్కొన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఢిల్లీకి నుంచి పిలుపు రావడంతో ఆగమేఘాలపై విమానం ఎక్కాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడింది. ఉదయాన్నే ఢిల్లీకి పరుగులు తీసిన ఈవీకేఎస్ అధినేత్రిని, యువరాజును కలుసుకుని తన వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. సోనియా , రాహుల్ గాంధీ ఈవీకేఎస్‌కు తీవ్రంగానే క్లాస్ పీకినట్టుగా వచ్చిన సంకేతాలతో చిదంబరం వర్గం పోస్టర్ల హల్చల్ సృష్టించే పనిలో పడింది. పోస్టర్లతో : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఈవీకేఎస్ను ఉద్దేశించి తీవ్రంగానే ఆ పోస్టర్లలో స్పందించారు. ఈవీకేఎస్ను ఖండించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్టర్లు వెలిశారుు. చిదంబరం మద్దతు నాయకుడు ఎస్ఎం కుమార్ పేరిట చెన్నై నగరంలో పలు చోట్ల గోడలకెక్కిన ఈ పోస్టర్లు ఈవీకేఎస్ వర్గంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నారుు. ఈ పోస్టర్ల వివాదం మరిన్ని ఎపిసోడ్లుగా సాగబోతుందో వేచి చూడాల్సిందే. తమ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి వచ్చిన పిలుపుతో ఢిల్లీకి వెళ్ల లేదని ఈవీకేఎస్ వర్గం పేర్కొంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈవీకేఎస్, మహిళా నాయకురాలు, నటి కుష్భు ప్రచారం చేపట్టబోతున్నారని, అందుకే ఆ ఇద్దరు వేర్వేరుగా ఢిల్లీ బాట పట్టినట్టు పేర్కొంటున్నారు. -
జయంతిని ప్రశ్నించనున్న సీబీఐ?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులపై సీబీఐ విచారణ చేపడుతోంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా జయంతీ నటరాజన్ ఐదు కంపెనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ హక్కులకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ ఐదు ప్రాథమిక విచారణలను నమోదు చేసింది. సీబీఐ త్వరలో జయంతీ నటరాజన్‌ను ప్రశ్నించే అవకాశముంది. సీబీఐ ఇటీవల పర్యావరణ శాఖ అధికారులను, జార్ఖండ్ అధికారులను ప్రశ్నించి పలు డాక్యుమెంట్లు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. జయంతి.. రాహుల్ గాంధీలపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని కేంద్రం ప్రకటించింది. -
కాంగ్రెస్‌కు జయంతి షాక్
-
కాంగ్రెస్‌కు జయంతి షాక్
* నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు.. పార్టీకి రాజీనామా * పర్యావరణ అనుమతుల్లో రాహుల్ జోక్యం చేసుకునేవారు * కీలక ప్రాజెక్టులపై ‘సూచనలు’ పంపేవారు * పార్టీ సేవల కోసమని మంత్రి పదవికి రాజీనామా చేయించారు చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు! కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూపీఏ హయాంలో కీలకమైన ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల విషయంలో రాహుల్ జోక్యం చేసుకునేవారని గుట్టును బయటపెట్టారు. దీంతో అటు కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ పడగా.. ఇటు అధికార బీజేపీ చేతికి కొత్త అస్త్రాలు అందాయి. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సమీక్ష జరుపుతామని కేంద్రం సంకేతాలు పంపగా.. సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముంగిట జయంతి ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. రాహుల్ వల్లే తప్పుకుంటున్నా... రాహుల్‌గాంధీ తీరు వల్లే మనస్తాపానికి గురై పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జయంతి నటరాజన్ చెప్పారు. అనుమతులపై రాహుల్ నుంచి వచ్చిన ‘సూచనలు’ పాటించానని, అయినా పార్టీ తనను అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లుగా తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. తమిళనాడు కాంగ్రెస్ ట్రస్టీ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నా. నేను మంత్రిగా ఏ తప్పూ చేయలేదు. దీనిపై ఎలాం టి విచారణ ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినట్టు తేలితే జైలుకెళ్లడానికైనా, ఉరిశిక్షకైనా సిద్ధమే’’ అని స్పష్టంచేశారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలను కలిసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. యూపీఏ-2 లో పర్యావరణ, అటవీశాఖ మంత్రి(ఇండిపెండెంట్)గా పనిచేసిన జయంతి, 2013, డిసెంబర్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘పర్యావరణ అనుమతులపై నేను చట్టాలు, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరించా. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. వేదాంత ప్రాజెక్టు విషయంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నా. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో స్వచ్ఛంద సంస్థలు లేవనెత్తిన అభ్యం తరాలను ప్రముఖంగా పేర్కొంటూ రాహుల్ నుంచి సందేశాలు అందాయి’’ అని జయంతి నటరాజన్ వివరించారు. పార్టీ ఆదేశాల మేర కు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాహుల్ కార్యాలయం కేంద్రంగా తనను ఇబ్బంది పెట్టే చర్యలు కొనసాగాయన్నారు. కొందరు బడా పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి రాహుల్ ఫిక్కీలో తనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్నారు. తన తప్పేంటో తెలుసుకునేందుకు సోనియాను, రాహుల్‌ను కలిసేం దుకు అనేకసార్లు ప్రయత్నించినా వారు భేటీకి నిరాకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న తనను... పార్టీ సేవల పేరుతో మంత్రి పదవి నుంచి తొలగించారని, తర్వాత 11 నెలలపాటు పార్టీకి దూరంపెట్టడం ఆవేదనకు గురిచేసిందన్నారు. రాహుల్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ జయంతి ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. అమె అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ ‘జయంతి ట్యాక్స్’ పేరుతో లోక్‌సభ ఎన్నికల ముంగిట బీజేపీ విమర్శలు గుప్పించడంతోనే రాజీనామా చేయించాల్సి వచ్చిందన్నారు. పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలను జయంతి నటరాజన్‌కు ముందు అదే శాఖకు మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్, ఆమె తర్వాత మంత్రి గా కొనసాగిన ఎం.వీరప్పమొయిలీ ఖండించారు. రాహుల్‌గానీ, సోనియాగానీ ఏనాడూ తమ విధులు, నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు కాదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘కొత్త రాజకీయ బాసులు’ చెప్పినట్టు ఆమె నడుచుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ఆమెపై చట్టపరం గా చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాలు లేనందునే చివరికి మంత్రి పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందన్నారు. దురుద్దేశంతోనే రాహుల్‌పై జయంతి ఆరోపణలు చేశారని, ఈ అంశాలను ఏడాది కాలంగా పార్టీ వేదికలపై ఎందుకు ప్రస్తావించలేదని అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రశ్నించారు. సోనియాకు జయంతి రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ.. పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణం-పరిశ్రమల మధ్య సమతూకం పాటించాలన్న దివంగత ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తికి అనుగుణంగానే నేను నా శాఖ విధులు నిర్వర్తించాను. ఎన్ఏసీ చైర్‌పర్సన్‌గా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై మీరు లేఖలు రాశారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి ‘ప్రత్యేక వినతులు’ వచ్చేవి. వాటిని నేను గౌరవించాను. పర్యావరణ, అటవీశాఖలకు స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. 2013, డిసెంబర్ 20న ప్రధాని మన్మోహన్సింగ్ నన్ను పిలిచారు. నేను వెళ్లగానే ఆయన లేచి నిలబడ్డారు. కాస్త ఆందోళన, వ్యాకులతతో కనిపించారు. ‘జయంతి, మీ సేవలు పార్టీకి అవసరమని పార్టీ అధ్యక్షురాలు సోనియా నాతో చెప్పారు’ అని అన్నారు. నాకు అర్థం కాలేదు. ‘‘సరే సర్, అయితే నేనేమి చేయాలి’ అని అడిగా. ‘ఆమె(సోనియా) మిమ్మల్ని రాజీనామా చేయాలన్నారు’ అని ప్రధాని అన్నారు. నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ‘రాజీనామా..?ఎప్పుడు సర్?’ అని అడిగా. ‘ఈరోజే’ అని ప్రధాని బదులిచ్చారు. నేను ఒక్కమాట మాట్లాడలేదు. ‘అయితే సరే’ అని నవ్వుతూ చెప్పా. మీపై పూర్తి విశ్వాసంతో రాజీనామా చేశా. ఈలోగానే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాలో నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. నేను రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్‌గాంధీ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఫిక్కీలో రాహుల్ ఆ మాటలు చెప్పేందుకే మీతో రాజీనామా చేయించారా అని మీడియా నన్ను అడిగింది. అనుమతుల విషయంలో నేను ఎప్పుడూ అవరోధంగా నిలవలేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల జాప్యంలో నేను బాధ్యురాలిని కాదు. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై జరుగుతున్న దాడితో తీవ్రంగా కలత చెందా. నా రాజీనామా, ఫిక్కీలో ప్రసంగంపై నేను రాహుల్‌కి ఒక మెసేజ్ పంపా. ఇలా చేయడానికి నేను చేసిన తప్పేమిటని అడిగా. నేనేమైనా తప్పు చేసి ఉంటే.. వివరణ అడగాల్సిందని వేడుకొన్నా. ఆయనను కలుసుకునేందుకు సమయం కావాలని అడిగా. ‘నేను కాస్త బిజీగా ఉన్నా. మళ్లీ కలుద్దాం’ అని రాహుల్ బదులిచ్చారు. ‘స్నూప్‌గేట్’ విషయంలో ఇప్పటి ప్రధాని మోదీపై దాడి చేయాల్సిందిగా నాకు సూచించారు. తొలుత నేను అం దుకు నిరాకరించా. నేను అప్పడు మంత్రిగా ఉన్నందున ప్రభుత్వం తరఫున దీనిపై మాట్లాడేందుకు తిరస్కరించా. ఇది ‘ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయం’ అని పార్టీ నాయకత్వం చెప్పటంతో. తప్పనిసరై దానిపై మాట్లాడాల్సి వచ్చింది. (ఈ లేఖను జయంతి నటరాజన్ 2014 నవంబర్ 5న సోనియాకు రాశారు) -
పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష: జైట్లీ
న్యూఢిల్లీ: పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం యూపీఏ పాలనపై గురి పెట్టింది! వివిధ ప్రాజెక్టులకు యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని ప్రకటించింది. నాడు పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది. ‘పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఆరోపణలు చూస్తుంటే.. యూపీఏ సర్కారు శాడిస్టు ఆర్థిక విధానాలు అవలంబించినట్లు స్పష్టమవుతోంది. చట్టాలతో నిమిత్తం లేకుండా వారి అనుంగులకే అనుమతులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు ఇచ్చిన లేదా నిరాకరించిన పర్యావరణ అనుమతులపై ప్రస్తుత పర్యావరణ శాఖ సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం విలేకరులతో అన్నారు. అనుమతుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే యూపీఏ హయాంలో వృద్ధిరేటు కుంటుపడిందన్నారు. -
రాహుల్ కారణంగానే...జయంతి నటరాజన్
చెన్నై : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవని కేంద్ర మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత జయంతి నటరాజన్ వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పటి కాంగ్రెస్ వేరు...ఇప్పటి కాంగ్రెస్ వేరు అని అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగడంపై పునరాలోచన చేయాల్సి వచ్చిందన్నారు. మనకు తెలిసిన కాంగ్రెస్ ఇది కాదని... చాలా మరిపోయిందని జయంతి నటరాజన్ అన్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని, తన నరనరానా కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని జయంతి నటరాజన్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం భావోద్వేగంతో కూడిన నిర్ణయమని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు జయంతి నటరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ అనుమతుల విషయంలో రాహుల్ గాంధీ చెప్పిన సూచనలు చేసినా కేబినెట్ నుంచి తనను బలవంతంగా తొలగించటం ఆవేదన కలిగించిందన్నారు. మంత్రివర్గం నుంచి తప్పించే ముందు తన తప్పేంటో చెబితే బాగుండేదన్నారు. నిజంగా తాను పర్యావరణ అనుమతులు ఇచ్చే విషయంలో తప్పు చేసి ఉంటే ఉరి తీసినా అందుకు సిద్ధంగా ఉన్నానని జయంతి నటరాజన్ అన్నారు. ఈ సందర్భంగా జయంతి నటరాజన్ ...రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు చేసే విషయంలో రాహుల్ సిఫార్సులు చేసేవారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ ద్వంద్వ ప్రమాణాలు పాటించారన్నారు. రాహుల్ కార్యాలయంలోని ఓ వర్గం తనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కుట్ర పన్నిందన్నారు. ఆ కారణంగానే తనను కేబినెట్ నుంచి బలవంతంగా తప్పించాన్నారు. కేబినెట్ నుంచి తప్పించిన అనంతరం కాంగ్రెస్‌లోని ఓ వర్గం తనపై మీడియాలో అసత్య ప్రచారం చేసిందన్నారు. అలాగే 'స్పూప్ గేట్' వివాదంపై ప్రధాని మోదీపై విమర్శలు చేయాలని అధిష్టానం ఆదేశిస్తే...అందుకు తాను నిరాకరించాన్నారు. ఆ కారణంగానే తనపై కక్ష కట్టారని, అనంతరం జరిగిన పరిణామాణ వల్లే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. గతంలో పలు సంస్థలకు అనుమతులు ఇచ్చేందుకు జయంతి నటరాజన్ నిరాకరించిన ఆమెపై అప్పటి కేబినెట్ సహచరులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో చేరే యోచన లేదని ఆమె తెలిపారు. -
'జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు తీవ్రమైనవి'
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు చాలా తీవ్రమైనవని పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సంబంధిత ఫైళ్లపై పరిశీలన చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. మరోవైపు యూపీఏ ఇచ్చిన అనుమతులపై పర్యావరణ శాఖ పరిశీలన చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. కాగా కేంద్ర మాజీ పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ ...సోనియాగాంధీ, రాహుల్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతులపై రాహుల్‌తో పాటు పలువురు తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ కు జయంతి నటరాజన్ గుడ్‌బై!
-
కాంగ్రెస్ కు జయంతి నటరాజన్ గుడ్‌బై!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జయంతి నటరాజన్ తన నిర్ణయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ సూచనలు పాటించినా 2013లో కేబినెట్ నుంచి తనను బలవంతంగా తప్పించారని జయంతి నటరాజన్ విమర్శించారు. రాహుల్ కార్యాలయంలోనే తనపై కుట్ర పథకం సిద్ధమైందని ఆమె ఆరోపించారు. వివిధ సందర్భాల్లో పార్టీ అగ్ర నాయకత్వం వేధించిందని జయంతి నటరాజన్ వ్యాఖ్యానించారు. కాగా గత ఏడాది నవంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆమె లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా మీడియాకు లీకైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తనను తప్పించడానికి కారణాలు వెల్లడించలేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని జయంతి ఈ సందర్భంగా ఆ లేఖలో ఘాటుగా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. -
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు రాజుకుం టోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదులు ఢిల్లీ చేరుతున్నాయి. తంగబాలు వర్గం తీరుపై అధిష్టానం చెంతకు ఫిర్యాదు చేరడంతో కొరడా ఝుళిపించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇందులో ప్రధాన గ్రూపులుగా కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వర్గాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణ స్వామి గ్రూపులు ఆ తర్వాత కోవకు చెందుతాయి. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి నాయకులు పలువురు తమదైన శైలిలో గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ రాజకీయాల కారణంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల ఎంపికకు పన్నెండేళ్లు పట్టింది. గ్రూపు నేతలందరూ తాము సమైక్యంగా ఉన్నామని అధిష్టానానికి చాటుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ నెల రెండో వారంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల పదవుల్ని భర్తీ చేస్తూ, ఏఐసీసీ చిట్టా విడుదల చేసింది. దీంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం మద్దతుదారుల్ని కల్గిన వాసన్ వర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలక పదవుల్ని ఎక్కువ శాతం తన్నుకెళ్లింది. ఆ తర్వాతి స్థానంలో చిదంబరం వర్గం నిలిచింది. తమకు అన్యాయం జరిగిదంటూ చిదంబరం వర్గం లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తంగబాలు వర్గం మాత్రం ఎదురు దాడికి సిద్ధం అయింది. ఎదురు దాడి: రెండు రోజుల క్రితం సత్యమూర్తి భవన్లో కొత్త కార్యవర్గం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జికే వాసన్ వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తక్కిన గ్రూపుల వారు అంతంత మాత్రంగానే వచ్చారు. ఇందులో తంగబాలు వర్గానికి చెందిన తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటుగా పదమూడు మంది టీఎన్సీసీపై తిరుగు బాటు చేశారు. తమను అవమాన పరుస్తున్నారంటూ ఆ పరిచయ కార్యక్రమాన్ని వాకౌట్ చేయడం వివాదానికి దారి తీసింది. బహిరంగంగా పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్పై తంగబాలు వర్గం మాటల దాడికి దిగడాన్ని వాసన్ వర్గం తీవ్రంగా పరిగణించింది. ఇతర గ్రూపులు తమతో ఢీకి సిద్ధం కావొచ్చన్న సంకేతాలతో వాసన్ వర్గానికి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మేల్కొన్నారు. ఇక మీదట ఏ ఒక్కరూ వేలు ఎత్తి చూపని విధంగా, ఆదిలోనే చెక్ పెట్టడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీకి పంచారుుతీ: తంగబాలు వర్గం వ్యవహరిస్తున్న తీరుపై పంచారుుతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర పార్టీని ధిక్కరించే విధంగా ఆ వర్గానికి చెందిన జిల్లా కార్యదర్శులు, ఇతర పదవుల్లో ఉన్న వాళ్లు దూసుకెళుతుండటంతో వారిపై కొరడా ఝుళిపించాలని అధిష్టానానికి జ్ఞాన దేశికన్ విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ధోరణితో వ్యవహరించిన ఆ నాయకుల పదవుల్ని ఊడ గొట్టేందుకు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తున్నది. అధ్యక్షుడిని ధిక్కరించడం ఎంత వరకు సబబు? అన్న నినాదంతో వారి స్థానంలో కొత్త వాళ్లను చేర్చడం లక్ష్యంగా ఢిల్లీలో వాసన్ వర్గం పావులు కదుపుతోంది. ఇక, తాము తక్కువ తిన్నామా..? అన్నట్టు తంగబాలు వర్గం సైతం ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల పంచారుుతీ ఢిల్లీకి చేరడంతో అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఓ గ్రూపు వివాదానికి ఆజ్యం పోయడంతో మున్ముందు మరెన్ని గ్రూపులు రాజుకుంటాయోనన్న బెంగ ఏఐసీసీ వర్గాల్ని వేధిస్తోంది. -
తొలగించలేదు... నేనే తప్పుకున్నా: జయంతి
న్యూఢిల్లీ: వివిధ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం చేసినందుకే తనను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు వచ్చిన వార్తలను జయంతి నటరాజన్ ఆదివారం ఖండించారు. నూరు శాతం పార్టీ పనుల కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు పునరుద్ఘాటించారు. ఇంతకుమించి మరే కారణాలు లేవన్నారు. అలాగే తన హయాంలో ప్రాజెక్టులకు అనుమతులను ఎక్కడా నిలిపేయలేదని స్పష్టం చేశారు. అయితే ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో డ్యామ్‌లు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించిన మాట వాస్తవమేనన్నారు. -
రాష్ట్ర కాంగ్రెస్‌లో రాహుల్ ముద్ర
చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌పై రాహుల్‌గాంధీ ముద్ర ఏనాడో పడిపోగా ఎన్నికల నేపథ్యంలో మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆకర్షణీయమైన నేతల ఎంపికను ప్రారంభించారు.పేరుకు జాతీయపార్టీగా చెలామణి అవుతున్నా రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే బలహీనంగా మారిపోయింది. ఒంటరిగా గెలిచే స్తోమతను కోల్పోయిన కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల క్రితమే ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైంది. ఐదేళ్ల కొకసారి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ కాంగ్రెస్ కాలక్షేపం చేస్తోంది. రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కిం చుకోకున్నా కేంద్రంలో అధికారంలోకి రావడంతో తమిళనాడుకు చెందిన నేతలు కేబినెట్లో మంత్రులుగా మారిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవ లం 8 స్థానాల్లో గెలుపొందినా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న డీఎంకే 18 ఎంపీల స్థానాల్లో గెలుపొందగా 9మంది కేంద్ర మంత్రు లు కాగలిగారు. కాంగ్రెస్ నుంచి ఎంత మంది కేంద్ర మంత్రులైనా పార్టీకి అదనంగా వచ్చిన బలమేమీ లేదు. కేంద్ర మంతులు చిదంబరం, జీకేవాసన్, జయంతి నటరాజన్, సుదర్శన్ నాచియప్పన్ది తలోదారి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ముఠా తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స చేయడం ప్రారంభించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ఘోరపరాజయం పాలవడం కాంగ్రెస్‌ను కుదిపేసిం ది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ఫలితాలు పునరావృతం కాకూడదనే భావనతో రాష్ట్ర రాజకీయాల పై మరోసారి దృష్టిపెట్టారు. ఇందు కు కొనసాగింపుగా తమిళనాడుకు చెందిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ మాజీగా మారిపోయారు. రాష్ట్రం లో సీనియర్ నేత, మంచి వాగ్దాటికలిగన నాయకురాలిగా పేరొందిన ఆమె సేవలను ప్రచారానికి విని యోగించుకోనున్నారు. వర్గ వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నుంచి జయంతి నటరాజన్ చేత రాజీనామా చేయిం చిన అధిష్టానం ఆ తరువాత ఎవరిపై కన్నువేస్తుందోననే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. -
జయంతి రాజీనామా
పార్టీ సేవ కోసం కేంద్ర మంత్రి పదవికి గుడ్‌బై ఆమె రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి జయంతి బాటలో మరికొందరు మంత్రులు...? త్వరలో ఏఐసీసీలోనూ మార్పులు రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన సన్నాహకాల్లో భాగం గా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) జయంతి నటరాజన్ (59) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి వచ్చిన సూచనల ప్రకారమే ఆమె పార్టీ కోసం పనిచేసేందుకు మంత్రి పదవిని వదులుకున్నట్టు తెలుస్తోంది. జయంతి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని, ఆమె పర్యవేక్షించిన మంత్రిత్వశాఖ బాధ్యతలను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీకి అదనంగా అప్పగించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాజీనామా అనంతరం జయంతి మీడియాతో మాట్లాడుతూ ‘‘లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ కోసం పనిచేయడానికి నా అభీష్టాన్ని వ్యక్తీకరించాను. ఏ స్థాయిలో నా సేవలను ఉపయోగించుకుంటారనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యురాలైన జయంతిని రెండేళ్ల క్రితం కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే పలు భారీ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జయంతి జాప్యం చేయడంపై పరిశ్రమ వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడమే ఆమె రాజీనామాకు దారితీసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అదే బాటలో మరికొందరు... ఇక జయంతి బాటలోనే మంత్రివర్గం నుంచి మరి కొందరు కూడా తప్పుకుని పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్, కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి (స్వతంత్ర హోదా) సచిన్ పైలట్, రక్షణ శాఖ సహాయ మంత్రి జితేందర్‌సింగ్, హోంశాఖ సహాయమంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ తదితరులున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణపైనా దృష్టి ప్రభుత్వం నుంచి మంత్రులను పార్టీకి తీసుకురావడంతోపాటు... పార్టీలోనూ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా పనిచేయని నేతలకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలోనే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సచిన్ పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా పంపవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. రాహుల్ కోటరీలో ఒకరైన జితేందర్ సింగ్‌కు త్వరలో జరిగే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. ఆయన గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న అశోక్ తన్వర్‌ను హర్యానా పీసీసీ అధ్యక్షుడిగా పంపుతారని ప్రచారం సాగుతోంది. -
రాజీనామా బాటలో 10 మంది కేంద్ర మంత్రులు!
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో మినహా ఎక్కడ సోదిలో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దక్కుతుందనుకున్న ఢిల్లీ శాసన సభ కూడా అరవింద్ కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చిపెట్టుకుని పోయే సరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తలలు పట్టుకున్నారు. దాంతో రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు చేపట్టవలసిన చర్యల కోసం అత్యంత సన్నిహితులతో తల్లికొడుకులు సమావేశమై చర్చించారు. దీంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు కీలక వ్యక్తులను మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని నిర్ణయించారు. అందులోభాగంగానే కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శనివారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఆ శాఖ బాధ్యతలు వీరప్ప మొయిలీకి అప్పగించారు. అంతా చకచకా జరిగిపోయాయి. అయితే జయంతిని అనుసరించి మరో 10 మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కేంద్ర మంత్రులు తమ జేబుల్లో రాజీనామా పత్రాలను పెట్టుకుని తిరుగుతున్నట్లు 10 జనపథ్ రోడ్డులో సమాచారం. ఇంతకు రాజీనామా బాట పట్టనున్న 10 మంది కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, జై రాం రమేష్, ఏ కే ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
-
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తన మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేందుకే జయంతి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జయంతి వ్యవహరించారు. కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశానుసారం తిరిగి పూర్తీస్థాయిలో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకే ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. యూపీఏ-2 హయాంలో.. చివరిసారి కేంద్రమంత్రివర్గంలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్నికల సమయానికి.. పార్టీని బలోపేతం చేసేందుకు 10 జన్‌పథ్ కసరత్తుచేయడంలో భాగంగా.. మరికొంతమంది సీనియర్లు కేంద్ర కేబినెట్ వదిలి.. పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే జయంతి నటరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. అడవులు, పర్యావరణ శాఖలను ఇకపై కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పర్యవేక్షించనున్నారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
'ఓటమిని అంగీకరిస్తున్నాం' ఏఐసీసీ కార్యాలయం ఖాళీ!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంగా దిశగా ప్రయాణిస్తోంది. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఫలితాలను విశ్లేషించుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ నేత జయంతి నటరాజన్ అన్నారు. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లో గెలిచిన అభ్యర్థులకు కృతజ్ఞతలు అని అన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తాం అని అన్నారు. ఢిల్లీలో పార్టీకి లభించిన ప్రతికూల ఫలితాలపై సమీక్ష జరుపుతాం అని అన్నారు. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని మరోసారి చేజిక్కించుకునేందుకు బీజేపీ అడుగులేస్తుండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. ఇక ఛత్తీస్ గఢ్ లో ఫలితాలు నువ్వా నేనా అనే రీతిలో ఉత్కంఠను కలిగిస్తున్నాయన్నారు. ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తర్వాత కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టాయి. దీంతో న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం పూర్తిగా బోసిపోయింది. కొద్దిమంది మీడియా ప్రతినిధులు, పోలీసులు తప్ప నాయకులు అన్నవాళ్లు ఎవరూ ఆ దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. నాలుగు రాష్ట్రాలకు గాను ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కొంత మేరకు ఆశ కనిపిస్తుండగా మిగిలిన మూడు రాష్ట్రాల్లో సోదిలోకి కూడా లేకుండా పోయింది. దీంతో జాతీయ స్థాయి నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి హాజరు కాకుండా ముఖం చాటేశారు. -
పోలవరం కేసు సుప్రీంలో ఉంది
పాల్వాయి ప్రశ్నకు మంత్రి జయంతి నటరాజన్ జవాబు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు మంజూరుచేసిన పర్యావరణ, అటవీ, ఆర్ఆర్, టీఏసీ అనుమతులను పక్కనపెడుతూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకెళ్లకుండా నిరోధిస్తూ శాశ్వత ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వేసిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్య తదితర అంశాలపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి జయంతి నటరాజన్ గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 29 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లాలో 42 పల్లెలు, ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు ముంపునకు గురికావచ్చునని, మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లో 1,77,275మంది నిర్వాసితులయ్యే అవకాశం ఉందని జయంతి పేర్కొన్నారు. -
అద్దె నియంత్రణకు కొత్త బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ అద్దె నియంత్రణ చట్టం 1995ను రద్దు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో గురువారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీనిస్థానంలో సమగ్ర అద్దె నియంత్రణ చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అద్దెను పెంచడం, చెడు ప్రవర్తన ఉన్న కిరాయిదారుణ్ని ఖాళీ చేయించే హక్కు యజమానికి ఇవ్వడం వంటివి కొత్త బిల్లులోని ముఖ్యాంశాలు. ఢిల్లీ అద్దె నియంత్రణ (రద్దు) బిల్లు 2013ను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి దీపాదాస్ మున్షీ ప్రవేశపెట్టారు. 1958 నాటి అద్దె నియంత్రణ చట్టానికి బదులుగా తెచ్చిన 1995 చట్టాన్ని రద్దు చేయడానికే ఈ బిల్లును తెచ్చామని ఆమె వివరణ ఇచ్చారు. 1958 అద్దె నియంత్రణ చట్టం పూర్తిగా అద్దెదారుడికే అనుకూలంగా ఉందనే వాదనలు ఉన్నాయి. అయితే 1995 అద్దె నియంత్రణ చట్టాన్ని పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదించినప్పటికీ, కిరాయిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలుకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే తాజా బిల్లు కూడా 1958 అద్దె నియంత్రణ చట్టాన్ని పోలి ఉంది. ఈ చట్టంలో అద్దెల పెంపునకు పలు ఆంక్షలు విధించారు. కిరాయిదారులను యజమానులు ఇష్టమొచ్చినప్పుడు ఖాళీ చేయించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యజమానులు అద్దెకిచ్చిన ఆస్తులకు తగిన వసతులు కల్పించాలని నిర్దేశించారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. ‘ఐదు ఆస్పత్రులు ప్రమాణాలను పాటించడం లేదు’ జీవవైద్య వ్యర్థాల నిర్వహణ ప్రమాణాలను ఢిల్లీలోని ఐదు ప్రముఖ ఆస్పత్రులు పాటించడం లేదని తనిఖీల్లో తేలిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి జయంతి నటరాజన్ రాజ్యసభకు గురువారం తెలిపారు. మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఇంద్రప్రస్థ ఎక్స్టెన్షన్), ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, రోహిణిలోని డాక్టర్ బాబా సాహిబ్అంబేద్కర్ ఆస్పత్రి, డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య సంస్థాన్, జవహర్లాల్ నెహ్రూ మార్గ్‌లోని లోక్‌నాయక్ ఆస్పత్రులు నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని ఆమె వెల్లడించారు. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీబీసీ) ఈ ఐదు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ సంబంధిత ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిబంధనలను తూ.చ. తప్పకపాటించాని, అమలును పర్యవేక్షిస్తామని వాటిలో పేర్కొన్నట్టు జయంతి వివరించారు.