అద్దె నియంత్రణకు కొత్త బిల్లు
Published Fri, Aug 30 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ అద్దె నియంత్రణ చట్టం 1995ను రద్దు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో గురువారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దీనిస్థానంలో సమగ్ర అద్దె నియంత్రణ చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అద్దెను పెంచడం, చెడు ప్రవర్తన ఉన్న కిరాయిదారుణ్ని ఖాళీ చేయించే హక్కు యజమానికి ఇవ్వడం వంటివి కొత్త బిల్లులోని ముఖ్యాంశాలు. ఢిల్లీ అద్దె నియంత్రణ (రద్దు) బిల్లు 2013ను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి దీపాదాస్ మున్షీ ప్రవేశపెట్టారు. 1958 నాటి అద్దె నియంత్రణ చట్టానికి బదులుగా తెచ్చిన 1995 చట్టాన్ని రద్దు చేయడానికే ఈ బిల్లును తెచ్చామని ఆమె వివరణ ఇచ్చారు.
1958 అద్దె నియంత్రణ చట్టం పూర్తిగా అద్దెదారుడికే అనుకూలంగా ఉందనే వాదనలు ఉన్నాయి. అయితే 1995 అద్దె నియంత్రణ చట్టాన్ని పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదించినప్పటికీ, కిరాయిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలుకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే తాజా బిల్లు కూడా 1958 అద్దె నియంత్రణ చట్టాన్ని పోలి ఉంది. ఈ చట్టంలో అద్దెల పెంపునకు పలు ఆంక్షలు విధించారు. కిరాయిదారులను యజమానులు ఇష్టమొచ్చినప్పుడు ఖాళీ చేయించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యజమానులు అద్దెకిచ్చిన ఆస్తులకు తగిన వసతులు కల్పించాలని నిర్దేశించారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం.
‘ఐదు ఆస్పత్రులు ప్రమాణాలను పాటించడం లేదు’
జీవవైద్య వ్యర్థాల నిర్వహణ ప్రమాణాలను ఢిల్లీలోని ఐదు ప్రముఖ ఆస్పత్రులు పాటించడం లేదని తనిఖీల్లో తేలిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి జయంతి నటరాజన్ రాజ్యసభకు గురువారం తెలిపారు. మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఇంద్రప్రస్థ ఎక్స్‌టెన్షన్), ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్, రోహిణిలోని డాక్టర్ బాబా సాహిబ్‌అంబేద్కర్ ఆస్పత్రి, డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య సంస్థాన్, జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని లోక్‌నాయక్ ఆస్పత్రులు నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని ఆమె వెల్లడించారు.
జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీబీసీ) ఈ ఐదు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ సంబంధిత ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిబంధనలను తూ.చ. తప్పకపాటించాని, అమలును పర్యవేక్షిస్తామని వాటిలో పేర్కొన్నట్టు జయంతి వివరించారు.
Advertisement
Advertisement