కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తన మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేందుకే జయంతి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జయంతి వ్యవహరించారు. కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశానుసారం తిరిగి పూర్తీస్థాయిలో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకే ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. యూపీఏ-2 హయాంలో.. చివరిసారి కేంద్రమంత్రివర్గంలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్నికల సమయానికి.. పార్టీని బలోపేతం చేసేందుకు 10 జన్‌పథ్ కసరత్తుచేయడంలో భాగంగా.. మరికొంతమంది సీనియర్లు కేంద్ర కేబినెట్ వదిలి.. పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే జయంతి నటరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. అడవులు, పర్యావరణ శాఖలను ఇకపై కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పర్యవేక్షించనున్నారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.