Veerappa Moily
-
మొయిలీ కుమార్తె హంస కన్నుమూత
బొమ్మనహళ్లి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూతురు హంస మొయిలీ (46) అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీ పనిపై చత్తీస్‌గడ్‌లో ఉన్న మొయిలీ వెంటనే బెంగళూరుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుపుతారు. మొయిలీ మూడవ కుమార్తె అయిన హంస సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. ఆమె మొదటి నుంచి భరతనాట్య కళాకారిణి. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2007లో దేవదాసీల జీవిత చరిత్రతో తమిళంలో నిర్మించిన శృంగారం అనే సినిమాలో ఆమె నటించారు. నాటకాలలోనూ నటించారు, కవితల సంపుటిని కూడా రచిండంతో పాటు యోగా సాధకురాలిగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంగా ఉన్న హంస ఇటీవలే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అనేకమంది ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయలేం: మొయిలీ
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే గనుక బజరంగ్ దళ్‌ను, పీఎఫ్ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ స్వరం మార్చింది. అలాంటి ప్రతిపాదన ఆచరణకు వీలుపడదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం ఉడిపిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బజరంగ్ దళ్ నిషేధంపై ఆయన స్పందించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు బజరంగ్ దళ్ గురించి మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. ఇది అన్ని రాడికల్ గ్రూప్‌లకు వర్తిస్తుందని చెప్పాం. కానీ, అలా నిషేధించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, కర్ణాటక ప్ఱభుత్వం బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంపై కర్ణాటక బీజేపీ చీఫ్ డీకే శివకుమార్ మీకు (మీడియాను ఉద్దేశించి..) మరింత స్పష్టత ఇస్తారు. చివరకు సుప్రీం కోర్టు కూడా విద్వేష రాజకీయాలకు ముగింపు ఉండాలని తన తీర్పులో అభిప్రాయపడింది. కాబట్టి.. అలాంటి ప్రతిపాదనేం మేం చేయట్లేదు. కాంగ్రెస్ నేతగా ఈ విషయాన్నే మీకు స్పష్టం చేయదల్చుకున్నా’’ అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిషేధం గురించి స్పష్టమైన వివరణ ఉంది. మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ప్రజలందరి మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాలను రగిలించే గ్రూపులను నిషేధించి తీరతామని పేర్కొంది. ఆ లిస్ట్‌లో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ కూడా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఈ అంశంపై బీజేపీపై భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ తరుణంలో.. ఇప్పుడు కర్ణాటక ఆ ప్రకటనపై వెనక్కి మళ్లడం గమనార్హం. ఇదీ చదవండి: కర్ణాటక ఎన్నికల్లో ఇదో సిత్రం.. తనకు తానే కిడ్నాప్ చేసుకుని.. -
మీరు ఏ ఎన్నికల్లో గెలిచారు?!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని గళమెత్తుతున్న జి–23 (గ్రూప్ ఆఫ్ 23) నాయకులపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్(68) మండిపడ్డారు. త్యాగాలతోనే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అకస్మాత్తుగా ప్రశ్నించడం ద్వారా కాదని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. జి–23లోని చాలామంది పెద్దలు పార్టీ పదవుల్లో నామినేట్ అయిన వాళ్లేనని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతూ అదే విధానాన్ని(నామినేట్) ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల రణరంగంలో ముందంజలో నిలవాలంటే కాంగ్రెస్‌కు పెద్ద శస్త్రచికిత్స అవసరమని జి–23 నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మా నాయకుడు పదేళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు నేతలు చేసే ‘అద్భుత వ్యాఖ్యానాల’తో పరిష్కారం దొరకదని సల్మాన్ ఖుర్షీద్ చురక అంటించారు. పార్టీ నేతలంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలని, సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఆయన పార్టీ అధినేత అయినా కాకపోయినా తమ నాయకుడిగా మాత్రం ఉంటారని వెల్లడించారు. సంస్కరణలు, శస్త్రచికిత్స అంటూ కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ లేవనెత్తిన అంశాలపై ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘‘శస్త్రచికిత్స చేస్తానంటే నేను సంతోషిస్తా. కానీ, నా కాలేయం, మూత్రపిండాలు తీసుకుంటానంటే ఎలా? ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనుకుంటున్నారో దయచేసి ఎవరైనా చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సర్జరీ చేయాల్సిందేనని, అయితే, దానివల్ల సాధించదేమిటో, కోల్పోయేదేమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్జరీ కంటే ముందు ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు అవసరమని తెలిపారు. సమస్య లోతుల్లోకి వెళ్లాలని, దానికి పరిష్కారాన్ని కనిపెట్టాలని అన్నారు. పదవులు వదులుకుంటేనే సంస్కరణలు సాధ్యం సర్జరీ, సంస్కరణలు, ప్రాథమిక మార్పు తీసుకురావడం అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. వాటి అర్థాలేమిటో తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని, వారికి (జి–23 నాయకులు) కీలక పదవులు దక్కాలని కోరుకుంటున్నారేమో తెలియదు. అదే నిజమైతే అది సంస్కరణగానీ, సర్జరీ గానీ కాబోదు. ‘నాకొక›పదవి కావాలి’ అని కోరుకోవడం మాత్రమే అవుతుంది’’ అని తేల్చిచెప్పారు. సంస్కరణ అం టూ మాట్లాడుతున్న నేతలు తొలుత ఇతర నాయకులతో మాట్లాడాలని సూచించారు. వారు తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎన్నికలు జరగాల్సిందే. అయితే, ఏ ఎన్నికల్లో గెలిచి వారు (జి–23 నేతలు) ఇప్పుడున్న స్థానాలను చేరుకున్నారో గుర్తుచేస్తే మాలాంటి వారు సులభంగా అర్థం చేసుకుంటారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచి వారంతా పదవులు చేపట్టారా?’’అని ఖుర్షీద్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సంస్కరణ అనేది అకస్మాత్తుగా సాధ్యం కాదని, పొందినదాన్ని వదులుకున్నప్పుడే అది సాకారమ వుతుందని తెలిపారు. పార్టీలో మార్పు రావాలని కోరుకున్నప్పుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు. -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్‌తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్‌తో న్యూస్ పేపర్‌పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్‌లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్‌లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్‌షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్‌లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్‌లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్‌లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్‌లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ అవార్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్‌కు ఇంగ్లిష్‌లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్‌కు ఈ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది. మొయిలీ, అరుంధతి కాకుండా, ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణి), హరీశ్ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్ దేవన్(మణిపుర్), రూప్ చంద్ హన్స్దా(సంతాలి), నందకిషోర్(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్(సంస్కృతం), హుస్సేన్ ఉల్ హక్(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా(అస్సామీ), దివంగత హిదయ్ కౌల్ భారతి(కశ్మీరీ), ధరనింధర్ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు. -
‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’) కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. శశి థరూర్, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఏకగ్రీవంగా తీర్మానించడంతో.. పార్టీలో చెలరేగిన ప్రకంపనలు చప్పున చల్లారిపోయాయి.(చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) ఈ పరిణామాల గురించి వీరప్ప మొయిలీ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘‘‘పార్టీ కోసం సోనియాజీ చేసిన త్యాగం గురించి మాకు తెలుసు. అందుకు మేం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఎన్నో ఏళ్లుగా మేం కూడా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టే పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అధినాయకత్వ దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అంతేతప్ప సోనియా గాంధీ మనోభావాలను కించపరచుకోవాలనుకోలేదు. ఆమెపై గౌరవం అలాగే ఉంటుంది. అయితే అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం దానిని ఆశించే మేం లేఖ రాశాం. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఆమె మాకు తల్లిలాంటి వారు. తొలుత అధ్యక్షురాలిగా కొనసాగేందుకు నిరాకరించినా తర్వాత ఆమె అంగీకరించారు. ఆమె మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమె పట్ల మా ప్రేమ తగ్గదు. అయితే మేం రాసిన లేఖ ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అనేకసార్లు ద్రోహం చేసిన వాళ్లే.. పార్టీ విధేయులుగా నటిస్తూ తమ విధేయతనే ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా సీనియర్ నాయకుల తీరుపై ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సీనియర్ నేతలు ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి. -
ముందుచూపు లేని మోదీ సర్కారు
ముంబై: మోదీ సర్కారు ముందుచూపు లేకుండా లాక్డౌన్ విధించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డాన్ వల్ల తలెత్తె పరిణామాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లిందని దుయ్యబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధం చేసినట్టుగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో ఆర్థిక లోటు గురించి ఆలోచించకుండా ప్రజలకు అన్నిరకాలుగా సాయం అందించాలని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. 21 రోజుల నిర్బంధం గడువు ముగిసిన తర్వాత లాక్డౌన్ బాధితులకు అండదండలు అందించాలని కేంద్రానికి సూచించారు. ‘ఇది(కోవిడ్‌పై పోరు) యుద్ధం లాంటిదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. ఆర్థిక లోటును సవరించుకుని అత్యవసర పరిస్థితిని తక్షణం ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కరోనా నివారణ చర్యలకు ప్రైవేటు రంగం సరైన విధంగా స్పందించలేద’ని వీరప్ప మొయిలీ అభిపప్రాయపడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ‘తబ్లిగీ జమాత్’ను అనుమతించడాన్ని పెద్ద తప్పిదంగా ఆయన వర్ణించారు. ‘ఈ తెలివైనోళ్లంతా అప్పుడు ఏం చేస్తున్నారు. కరోనా పరిణామాల గురించి పూర్తిగా తెలిసినా అధికార యంత్రాంగం ఎందుకు తబ్లిగీ జమాత్‌ను అనుమతించింద’ని మొయిలీ ప్రశ్నించారు. కాగా, కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యాఖ్యానించింది. (భారత్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాదు) -
‘రాహుల్ వెళ్లి పోవచ్చు కానీ..’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధ పడటం.. సీనియర్ నాయకులు అందుకు అంగీకరించకపోవటం వంటి విషయాలు తెలిసిందే. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి రాహుల్ గాంధీ రాజీనామాను అంగీకరించారు. అయితే దానికి ఒక షరతు పెట్టారు. రాహుల్ స్థానంలో సమర్థుడైన ఓ కొత్త వ్యక్తిని నియమించిన తర్వాతనే ఆయన రాజీనామా చేయాలని వీరప్ప మొయిలి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్ ఆలోచించేది సరైందే. అయితే ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే వెళ్లొచ్చు. అయితే పార్టీకి నూతన సారథిని వెతికి పెట్టిన తర్వాతే ఆయన ఆ పని చేయాలి. ప్రస్తుతం పార్టీ సంక్షోభ స్థితిలో ఉంది. ఈ స్థితిని నుంచి పార్టీని గట్టెంచిగలిగేది రాహుల్ మాత్రమే. ఆయన నాయకత్వ లక్షణాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే కావు. జాతీయ స్థాయి బాధ్యతల విషయం. అలాంటి బాధ్యతను సరైన వ్యక్తి చేతిలో పెట్టాకే రాహుల్ రాజీనామా చేయాలి’ అని మొయిలి అన్నారు. -
కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సిగ్గు చేటన్నా రు. శనివారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కుంతి యా, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, జైపాల్‌రెడ్డి, జెట్టి కుసుమ కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్‌లు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు సబి తా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్దన్‌రెడ్డి, బానోత్ హరిప్రియ, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు ఫిరాయింపులపై స్పందిం చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు ఇదే చివరి హెచ్చరిక: మొయిలీ ‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి. ఈ తతంగమంతా సీఎం కార్యాలయం కేంద్రంగానే నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నామని విడుదల చేసిన లేఖలన్నీ ఒకే విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే విషయమై పలుమార్లు మా పార్టీతోపాటు టీడీపీ స్పీకర్‌కు అనేక పిటిషన్లు ఇచ్చింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై ఎలాంటి వేటు పడలేదు. కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. దీనికి కారణం సీఎం కేసీఆరే. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల తరువాత కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం దారుణం. కేసీఆర్ రాజ్యంగ విలువల్ని, రాజధర్మాన్ని విస్మరించారు. ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి కేసీఆర్ అక్రమాలపై రాజ్యాంగాధినేతగా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరాం. సీఎం కేసీఆర్‌కు ఇదే మా చివరి హెచ్చరిక. గవర్నర్‌కు ఇదే చివరి వినతి’’అని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో 29% ఓటు బ్యాంకు, 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే ఫిరాయింపు లను టీఆర్ఎస్ ప్రోత్సహించడం దారుణమని మరో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. నేను నరసింహన్‌ను.. ఉత్సవ విగ్రహాన్ని కాదు : గూడూరుతో గవర్నర్ వ్యాఖ్యలు పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్‌ను కాంగ్రెస్ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చిన సమ యంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రె స్ నేత గూడూరు నారాయణరెడ్డి తనను ఉత్సవ విగ్రహంగా గతంలో అభివర్ణించడాన్ని నరసింహన్ ప్రస్తావించారు. గవర్నర్ సిబ్బంది ఒకరు గూడూరు ను నరసింహన్‌కు పరిచయం చేయగా ‘‘నేను నరసింహన్‌ను, అంతటా ఉంటాను. ఉత్సవ విగ్రహాన్ని కాదు’’అని వ్యాఖ్యానించారు. -
‘రఫేల్’ అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఆరోపించారు. రఫేల్ విమానాల కొనుగోలు కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని ఫ్రాన్స్‌లోని కంపెనీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే రూ. 520 కోట్లుగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంచనాలను రూ. 1,600 కోట్లకు పెంచారని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొçన్నం ప్రభాకర్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ భద్రతపై ప్రధాని మోదీ రాజీపడి, భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. ఈ ఒప్పందంపై చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త ప్రశ్న తలెత్తుతుందన్నా రు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ చేయించాలన్నారు. మేకిన్ ఇండియా గురించి చెప్పే మోదీ ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం తప్పుడు సమాచారంతో సుప్రీంకో ర్టును సైతం తప్పుదోవ పట్టించి, కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసిందని విమర్శించారు. కాగ్ నివేదికను పీఏసీకే సమర్పించలేదని, అలాంటి నివేదిక ఏదీ లేకుండానే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించిందన్నారు. దీనిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని ఎందుకు వణికిపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. -
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి మొయిలీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌వన్నీ వంచన రాజకీయాలేనని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి రహమాన్ ఖాన్, ఎంపీ నాసిర్ హుస్సేన్, కర్ణాటక మాజీ హోంమంత్రి రామలింగారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో నేనూ ఆ సమావేశంలో ఉన్నాను. నాకు సీఎం పదవి వద్దు. సీఎల్పీ ఇస్తే చాలన్నాడు. కానీ మాట నిలబెట్టుకోలేదు. వంచించడమే ఆయన విధానం. తెలంగాణ ప్రజలకు సైతం అనేక హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు’ అని మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో అభివృద్ధి ఊహించని రీతిలో జరిగిందని, టీఆర్ఎస్ రాగానే అది కుంటుపడిందన్నారు. ఐటీ సహా ఇతర అంశాల్లో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడిందని, ప్రస్తుతం హైదరాబాద్‌కు ఆ ప్రభ లేదని చెప్పారు. కొత్త పరిశ్రమలేవీ హైదరాబాద్‌కు రాలేదన్నారు. అవినీతి, ఆత్మహత్యల్లో రెండో స్థానం.. తెలంగాణ రాష్ట్రం అవినీతి, ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని మొయిలీ అన్నారు. ఇక, నిరుద్యోగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో మొత్తం జనాభాలో 70 శాతం పేదరికంలోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఎక్కువ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని, దొంగతనాలు 17 శాతం, కిడ్నాప్‌లు 31 శాతం, రేప్ కేసులు 30 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. బీజేపీతో కుమ్మక్కై సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, బీజేపీ తోడేలు పాత్ర పోషిస్తుంటే, టీఆర్ఎస్ గొర్రెల కాపరి పాత్ర వహిస్తోందని మొయిలీ ఆరోపించారు. -
అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి -
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు : వీరప్ప మొయిలీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూడా పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... రక్షణ సంబంధమైన అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొయిలీ విమర్శించారు. దేశ రక్షణ కోసం 126 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు.. రాఫెల్ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందని ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ కంపెనీకి ఎన్డీయే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. ఈ కాంట్రాక్టుకు 12 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశారని... తద్వారా 61 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడమంటే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని మొయిలీ విమర్శించారు. పార్టీ తరపున మెమోరాండం ఇస్తాం.. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారణ జరపాలని కోరిన విషయాన్ని మొయిలీ గుర్తుచేశారు. ప్రతీ వేదికపై రాహుల్ ఈ విషయాన్ని లేవనెత్తుతున్నా.. మోదీజీ మాత్రం మౌనంగానే ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయమై సెప్టెంబరు 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారని తెలిపారు. అదే విధంగా 24న గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మెమోరాండం అందజేస్తామని పేర్కొన్నారు. -
‘పులిని తిరిగి అడవికి పంపే సమయం వచ్చేసింది’
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలను కోతులు, నక్కలతో మోదీని పులితో పోల్చిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. హెగ్డే వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ స్పందిస్తూ క్రూర మృగంగా మారిన పులిని తిరిగి అడవికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కర్ణాటకలోని కర్వార్‌లో శుక్రవారం ఓ సభలో పాల్గొన్న హెగ్డే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పులి లాంటి మోదీనే ఎంపిక చేసుకుంటారని కోతులు, నక్కలతో కూడిన విపక్షాలను కాదని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఏడాది జనవరిలో దళితులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించగా తాను వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తనను టార్గెట్ చేసిన కుహనా మేథావులను ఉద్దేశించి అలా అన్నానని వివరణ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. -
పార్లమెంటరీ ప్యానల్ ముందుకు పీఎస్‌బీల సారథులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్యలు, మోసపూరిత కేసులపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆర్థిక శాఖ స్థాయీ సంఘం దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ ముందు ఐడీబీఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు అధినేతలు మంగళవారం హాజరై తమ ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే కమిటీ ముందు ఈనెల మొదట్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) రూ.8.99 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలే రూ.7.77 లక్షల కోట్లు కావడం గమనార్హం. మరోపక్క మోసపూరిత కేసు లూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. -
కాంగ్రెస్‌లో ట్వీట్ల రగడ
సాక్షి,బెంగళూరు : వచ్చే ఎన్నికల్లో మంత్రి మహదేవప్ప ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో కీలకపాత్ర పోషించనున్నారని మాజీ సీఎం, ఎంపీ వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్లు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ట్వీట్లు పార్టీకి ప్రమాదకారిగా మారుతాయని కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజా పనులశాఖ మంత్రితో కలిగిన సంబంధాలే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను నిర్దేశించనున్నాయంటూ వీరప్పమొయిలీ ట్విట్టర్ఖాతాలో ట్వీట్లు దర్శనమిచ్చాయి. దీంతో పార్టీలో నేతల మధ్య అసంతృప్తి, భేదాభిప్రాయాలు తలెత్తాయంటూ దావాలనంలా వ్యాపించిన వార్తలు సీఎం సిద్దరామయ్య తదితర సీనియర్ నేతలకు తలనొప్పిగా మారింది. వీరప్ప మొయిలీ ట్వీట్లను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, కాంగ్రెస్ హైకమాండ్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరప్ప మొయిలీ ట్వీట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే తమ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లపై మాజీ సీఎం వీరప్పమొయిలీ వివరణ ఇచ్చుకోసాగారు. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా ట్వీట్లు చేసారని మొయిలీ ఆరోపించారు. ట్వీట్ల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ వేణుగోపాల్ వివరణ కోరగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తాము పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుమారుడు హర్షపై కూడా విమర్శలు వ్యక్తమవుతుండటం తమను మరింత క్షోభకు గురి చేస్తోందంటూ వీరప్పమొయిలీ ఆవేదనకు లోనయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ట్వీట్లను వీరప్పమొయిలీ ఖాతా నుంచి తొలగించగా తమ కుమారుడు హర్షకు టికెట్ దక్కే అవకాశం లేదంటూ సమాచారం అందండంతోనే మాజీ సీఎం వీరప్పమొయిలీ ఈ విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం వీరప్పమొయిలీ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లు కాంగ్రెస్‌లో ప్రకపంపనలు సృష్టిస్తుండగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడానికి ఆయుధాల్లాగా పరిణమించాయి. వీరప్పమొయిలీ చేసిన ట్వీట్ల ఆధారంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పదిశాతం కమీషన్ల ప్రభుత్వమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్పమొయిలీ తమ ట్వీట్ల ద్వారా వాటిని నిజం చేసారన్నారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్లపై విమర్శలు, ఆరోపణలు చేసిన సీఎం సిద్దరామయ్య తదితర కాంగ్రెస్ నేతలు వీరప్ప చేసిన ట్వీట్లకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడ కూడా ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజాపనుల శాఖా మంత్రి మహదేవప్ప, పది శాతం ప్రభుత్వ పోస్టర్‌బాయ్ సీఎం సిద్దరామయ్య ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ విమర్శించారు. బహుశా కమీషన్లు, నల్లధనం సేకరణలో తీరిక లేకుండా గడుపుతున్నారేమోనని విమర్శించారు. ఇది ముగిసిన అధ్యాయం... తమ ట్విట్టర్‌ఖాతాను ఎవరో హ్యాక్ చేసారని తమ ట్విట్టర్ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లకు తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మాజీ సీఎం వీరప్పమొయిలీ స్పష్టం చేసారని, ఇక దీనిపై చర్చ అనసవసరమని ఇది ముగిసిన అధ్యాయమంటూ మంత్రి మహదేవప్ప తెలిపారు. శుక్రవారం ఇదే విషయంపై మంత్రి మహదేవప్ప మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో వీరప్ప మొయిలీ ప్రముఖులని అటువంటి వ్యక్తి ట్విట్టర్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇది ఎవరో కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే ఉద్దేశంతో చేసిన దుశ్చర్యగా తాము భావిస్తున్నామని ఈ పరిణామాలు వీరప్పమొయిలీకి తమకు మధ్యనున్న సత్సంబంధాలు దెబ్బ తీయలేవంటూ స్పష్టం చేశారు. -
మా పార్టీలో డబ్బే ముఖ్యం: వీరప్ప మొయిలీ
బెంగళూరు: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ శుక్రవారం చేసిన ఓ ట్వీట్‌తో వివాదం చెలరేగింది. ‘రాజకీయాల్లో డబ్బు సమస్యను కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజా పనుల విభాగం మంత్రి (మహదేవప్ప)తో కాంట్రాక్టర్లకున్న సంబంధాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి సరైంది కాదు’ అని మొయిలీ ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్ పేర్కొంది. అయితే ఇది ధ్రువీకృత ఖాతా కాదు. ‘ఆ ట్వీట్‌ను నేను చేయలేదు. అది వేరెవరో చేసిన తప్పు. ఆ ట్వీటర్ ఖాతా నా నియంత్రణలో లేదు’ అని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొయిలీ కుమారుడు హర్షకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల విభాగం మంత్రి మహదేవప్ప ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. -
జయలలిత పార్టీ నాశనం అవుతుందా ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజకీయ నేతగా మారిన కమల్ హాసన్ కొత్త పార్టీకి తమిళనాడులో పెద్దగా చోటు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఒకప్పుడు తమిళనాడుకు ఇన్చార్జ్గా వ్యవహరించిన వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన పార్టీ పెద్దగా ఎదగబోదని, చాలా తక్కువ మార్జిన్ మాత్రమే సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలని, మరోపక్క, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించారని, ఈ నేపథ్యంలో కమల్, రజినీల పార్టీలు ముందుకెళ్లగలగాలంటే డీఎంకే, అన్నాడీఎంకేలతో కలవాల్సిందేనని చెప్పారు. ఆ పార్టీలతో సంబంధాలు పెట్టుకోకుండా వారు మనుగడ సాగించడం కష్టమని అంచనా వేశారు. తమిళనాడులో ఉన్న చోటంతా కూడా డీఎంకే, అన్నాడీఎంకేలే ఆక్రమించాయని, కమల్‌కు భారీగా చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదన్నారు. బహుషా అన్నాడీఎంకే కూలిపోవచ్చని, ఆ స్థానాన్ని తాను ఆక్రమిస్తానని కమల్ అనుకుంటూ ఉండొచ్చేమోనని, అలా జరుగుతుందని మాత్రం తనకు అనిపించడం లేదని మొయిలీ సందేహం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను డామినేట్ చేసేలాగా కమల్ ప్రాంతీయ అజెండా ఉంటే మాత్రం చెప్పలేమని అభిప్రాయపడ్డారు. డీఎంకేతో కాంగ్రెస్ పార్టీది బలమైన సంబంధం అని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఇప్పటికిప్పుడైనా ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నారు. -
సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ పాత్ర మున్ముందు కూడా కొనసాగుతుందని పార్టీ సీనియర్ నేత ఎం.వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. త్వరలోనే ఆ బాధ్యతలను ఉపాధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్‌గాంధీకి అప్పగించేందుకు రంగం సిద్ధమయిన విషయం విదితమే. దీనిపై మొయిలీ మాట్లాడుతూ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ సోనియా పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తల్లిగా కూడా సోనియా గాంధీ దాదాపు 19 ఏళ్లపాటు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు మోశారని గుర్తు చేశారు. ఇకపైనా ఆమె పార్టీకి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత నిర్ణయాత్మకంగా, చురుగ్గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. -
మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు?
విశాఖ : రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. పాలన అంతా సంగ్ పరివార్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో అందరూ ఇబ్బంది పడ్డారని, చివరకు ప్రతి లావాదేవిపై పన్ను వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ మరి విజయ్ మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారని మొయిలీ ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు మొయిలీ చురకలు
న్యూఢిల్లీ :ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈ అంశంపై సొంతపార్టీ నిర్ణయంతో విభేదించారు. సీనియర్ల నుంచి అభిప్రాయం తీసుకోలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్ జత కలవడాన్ని మొయిలీ తప్పుబట్టారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంల విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే ఫిర్యాదులు కూడా అందయని, వాటన్నిటిని తాము సమీక్షించడం జరిగిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ అత్యున్నతమైనదని, ఈ ఘనత కాంగ్రెస్, యూపీఏలకు దక్కుతుందన్నారు. మళ్లీ బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు వెళ్లేది లేదని ఆయన అన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓటమికి కేవలం ఈవీఎంలు మాత్రమే కారణం కాదని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే ఓడినవాళ్లు తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించడం సరికాదని ఆయన చురకలు అంటించారు. మిగతా దేశాలతో పోల్చితే మన ఎన్నికల నిర్వహణా విధానం ఉత్తమమైనదని మొయిలీ అన్నారు. ఆ ఘటన యూపీఏతో పాటు కాంగ్రెస్ పార్టీకే దక్కుదుందన్నారు. ఈ నేపథ్యంలో మొయిలీ బుధవారం ఉదయం విపక్ష నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఈవీఎంల వినియోగంపై 13 పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే సహా పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ఈసీని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఈసీని కోరాయి. ఈవీఎంలపై తమ అనుమానాల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందిగా పార్టీలు ఎన్నిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి. -
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
-
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది. ‘పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకుకు కేంద్రం కోరింద’ని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో నకిలీ రూ. 500, వెయ్యి రూపాయల చెలామణి పెరగడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది. కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు(నవంబర్ 8) సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవనీ చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు. -
నోట్ల కిలాడీ అరెస్ట్
రూ. 25 కోట్ల నోట్ల మార్పిడి వ్యవహారంలో.... ► పారిపోతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకున్న ఈడీ న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్‌కతా వ్యాపారి పరాస్ ఎం ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోధాపై అంతకుముందే లుకౌట్ నోటీసు జారీ కాగా... ముంబై ఎయిర్ పోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిబ్బంది బుధవారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో రూ. 25 కోట్ల మేర పాత నోట్ల మార్పిడితో లోధాకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కస్టడీ కోరుతూ అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అస్సాంలో రూ. 2.3 కోట్ల కొత్త నోట్లు ఐటీ అధికారులు గురువారం అస్సాంలోని నగౌన్ పట్టణంలో వ్యాపారవేత్త అముల్య దాస్ నుంచి రూ. 2.3 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇల్లు, వ్యాపార కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో భారీగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఐటీ అధికారులు ఒక ఫైనాన్షియర్ నుంచి రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 43 లక్షల మేర కొత్త కరెన్సీగా గుర్తించారు. ఆ ఫైనాన్షియర్ ఎన్నడూ పన్ను చెల్లించలేదని, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఐటీ అధికారులు కనుగొన్నారు. అప్రకటిత ఆదాయం రూ. 10.3 కోట్ల వరకూ ఉన్నట్లు అతను వెల్లడించాడు. పార్లమెంటరీ కమిటీ ముందుకు ఉర్జిత్ జనవర్ 19న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు అంశాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై వివరించనున్నారు. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాౖటెన స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు అనంతరం పలువురు నిపుణులు ప్యానల్ ముందు హాజరై తమ అభిప్రాయాల్ని తెలిపినట్లు మెయిలీ పేర్కొన్నారు. -
మొండి బకాయిల సమస్యను తక్షణం సరిదిద్దండి
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అవసరముందని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థపై మొండి బకాయిలు భారంగా మారతాయని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అధ్యక్షతన గల ఈ సంఘం రూపొందించిన నివేదిక హెచ్చరించింది. 31మంది సభ్యులుగా గల ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం..రుణాలు మొండి బకాయిలుగా మారకుండానే తగిన సమయంలో బ్యాంకులు జోక్యం చేసుకోవాలి. ఒకవైపు మనం ఆర్థికంగా సంపన్నమైన దేశాలతో పోటీ పడుతున్నాం. మరోవైపు బ్యాంకుల మొండి బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ మొండి బకాయిల సమస్య కారణంగా బ్యాంక్‌ల మూలధనం, లిక్విడిటీ హరించుకుపోతున్నాయి. భవిష్యత్తులో మూలధనం సమీకరించే బ్యాంకుల సత్తా కూడా క్షీణిస్తోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.80వేల కోట్లుగా ఉన్నాయి. జూన్ నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు సెప్టెంబర్‌కి రూ.6,30,323 కోట్లకు పెరిగాయి.