
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్యలు, మోసపూరిత కేసులపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆర్థిక శాఖ స్థాయీ సంఘం దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ ముందు ఐడీబీఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు అధినేతలు మంగళవారం హాజరై తమ ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదే కమిటీ ముందు ఈనెల మొదట్లో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్‌పటేల్ హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) రూ.8.99 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలే రూ.7.77 లక్షల కోట్లు కావడం గమనార్హం. మరోపక్క మోసపూరిత కేసు లూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment