Psbs
-
సవాళ్లలోనూ పీఎస్‌బీల బలమైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్, కెనరా బ్యాంక్ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి. ‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితమిస్తున్న చర్యలు.. ‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్/బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
పండుగల సీజన్లో రుణ వృద్ధిపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బ్యాంకింగ్ సేవల విస్తృతి సహా ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయాలు అందించడంపై ఈ సమావేశం దృష్టి సారించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం, మొండిబకాయిలు మరింత తగ్గాల్సిన ఆవశ్యకతపై సైతం సమావేశం చర్చించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రుణ వృద్ధిపై దృష్టి పెట్టాలని మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంసహా కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టాండ్‌అప్ ఇండియా, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనసహా వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలకు రుణాలు ఇవ్వడానికి సంబంధించి బ్యాంకుల పనితీరును కార్యదర్శి సమీక్షించారు. మున్ముందూ లాభాల బాటలోనే... మొండిబకాయిలు తగ్గడంసహా జూన్ నెల్లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించిన బ్యాంకింగ్ మున్ముందు కాలంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు దాదాపు 7 శాతం మేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020-21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. బ్యాం 2020-21లో పట్టాలపైకి... బ్యాంకింగ్‌కు 2020-21 చక్కటి యూ టర్న్ వంటిది. 2015-16 నుంచి 2019-20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదు చేసుకుంది. 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు, 2015-16లో రూ.17,993 కోట్లు, 2016-17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్‌బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
రెండు రోజులు బ్యాంకింగ్ సమ్మె!
సాక్షి, న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) మంగళవారం బ్యాంకింగ్‌కు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్‌బీయూ స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. 2019లో ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. అలాగే గడచిన నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం భేటీ కానున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు సహా పలు కీలక అంశాలపై బ్యాంకర్లతో ఆమె చర్చించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ ఇటీవల పలుమార్లు చేపట్టిన వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించాలని ఆర్థిక మంత్రి బ్యాంకర్లను కోరనున్నారు. రుణాల చెల్లింపుల్లో వన్‌టైమ్ సెటిల్మెంట్ పాలసీలో పారదర్శకత దిశగా కృషిచేయాలని బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగస్ట్ 30లోగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై ప్రకటన చేసిన అనంతరం బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి తొలిసారిగా సమావేశమవుతుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.విలీనానంతరం దేశంలో ప్రస్తుతమున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి కేవలం 12 బ్యాంకులకే పరిమితం కానుంది. కాగా పీఎస్‌బీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు ఈనెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చాయి. -
పీఎన్బీ రుణ రేట్ల కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10% తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.55%నుంచి 8.45%కి తగ్గింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.65%కి కుదిం చింది. అయితే, బేస్‌రేటులో ఎటువంటి మార్పులేదని, 9.25% వద్ద ఈ రేటు యథాతథంగా ఉందని వెల్లడించింది. అలహాబాద్ బ్యాంకు కూడా... ప్రభుత్వ రంగ అలాహాబాద్ బ్యాంక్.. కూడా రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.10 శాతం తగ్గించింది. మార్చి 1 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. అన్ని రకాల కాల పరిమితులపై ఈ తాజా తగ్గింపు వర్తిస్తుందని స్పష్టంచేసింది. -
పీఎస్బీలకు తగ్గనున్న మూలధన నిధుల సాయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల సాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,000–25,000 కోట్ల స్థాయికి తగ్గుతుందని, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడమే దీనికి కారణమని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. నియంత్రణ పరమైన మూలధన అవసరాల కోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.48,239 కోట్ల నిధులను అందించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1,00,958 కోట్లను సమకూర్చింది. ‘‘కామన్ ఈక్విటీ టైర్–1 రేషియో 8.5 శాతం నిర్వహణకు గాను 2019– 20 ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు రూ.20,000–25,000 కోట్ల నిధులు అవసరం అవుతాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించిన రూ.1.96 లక్షల కోట్ల కంటే ఇది ఎంతో తక్కువ’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిధుల సాయంతో బ్యాంకుల పరపతి పెరుగుతుందని, ఎన్పీఏల కేటాయింపులకు ఊతం లభిస్తుందని పేర్కొంది. కానీ, రుణాలకు సంబంధించిన సమస్యలు ఇంకా అధిక మొత్తంలో పరిష్కారం కావాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అందించే సాయంతో బలమైన పీఎస్‌బీలు రుణాల్లో వృద్ధిని సాధించేందుకు నిధుల వెసులుబాటు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. -
70 పీఎస్బీ విదేశీ శాఖల మూసివేత!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి. లాభదాయకం కాని విదేశీ కార్యకలాపాలను మూసివేయడం, అలాగే ఒకే పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఒకటికి మించి ఉన్న శాఖలను క్రమబద్ధీకరించడం పీఎస్‌బీల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 70 విదేశీ శాఖల్ని మూసేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు గతేడాది 35 విదేశీ శాఖల్ని మూసేశాయి. 41 విదేశీ శాఖలు 2016–17లో నష్టాల్ని ప్రకటించాయి. నష్టాల శాఖల్లో 9 ఎస్బీఐకి చెందినవి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాఖలు, బ్యాంకు ఆఫ్ బరోడా 7 శాఖలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే పీఎస్బీలకు విదేశాల్లో శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలు కలిపి 165 వరకు ఉన్నాయి. -
బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్నింగ్
సాక్షి, ముంబై : రూ 50 కోట్లకు మించిన మొండి బకాయిల ఖాతాల్లో అక్రమాలపై తనిఖీ చేయాలని లేనిపక్షంలో నేరపూరిత కుట్ర అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిధులను దారిమళ్లించారనే ఆరోపణలతో భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను తీవ్ర నేరాల విచారణా కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు బ్యాంకర్లను హెచ్చరించింది. ఆయా ఖాతాల్లో దర్యాప్తు సంస్థలు అక్రమాలను వెలికితీస్తే వీటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైన బ్యాంకర్లపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 120 బీ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిఫాల్ట్ ఖాతాల్లో నిధుల దారిమళ్లింపును దర్యాప్తు ఏజెన్సీలు గుర్తిస్తే ఆయా బ్యాంక్‌లపై చర్యలు తప్పవని స్పష్టం చేశాయి. కాగా నిధుల దారి మళ్లింపు సహా అక్రమాలకు పాల్పడి దివాలా చట్ట ప్రక్రియలో ఉన్న దాదాపు పన్నెండు కంపెనీలపై బ్యాంకులు, దర్యాప్తు సంస్ధలు దృష్టిసారించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 8 లక్షల కోట్లకు పైగా రుణ బకాయిలు, మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. పీఎన్బీలో రూ 14,000 కోట్ల స్కామ్, నీరవ్ మోదీ వ్యవహారం సహా పలు స్కాంలతో బ్యాంకింగ్ రంగం కుదేలైన క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్రమత్తం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. -
సాయం అందినా తీరు మారదు!
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి అదనపు మూలధనం అందినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడకపోవచ్చని, ఒత్తిళ్లు కొనసాగవచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆయా బ్యాంకులు నిబంధనలకు అనుగుణంగా మూలధన నిష్పత్తుల స్థాయిని పాటించేందుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే నిధులు సరిపోతాయని వివరించింది. ‘బ్యాంకుల మూలధన నిల్వల పరిస్థితిని మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద భారీగా సమకూర్చే నిధులు.. ఆయా బ్యాంకుల తక్షణ క్యాపిటల్ నిష్పత్తి అవసరాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రభుత్వం ముందుగా అంచనా వేసిన దానికి ప్రస్తుతానికి మూలధన లోటు భారీగా పెరిగింది‘ అని భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూపొందించిన నివేదికలో మూడీస్ వివరించింది. మొండిబాకీలు, భారీ నష్టాలతో కుదేలవుతున్న పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 2.1 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది రూ. 90,000 కోట్లు సమకూర్చగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 65,000 కోట్లు అందించనుంది. గత నెల (జూలైలో) అయిదు బ్యాంకులకు రూ. 11,300 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. బాసెల్ త్రీ నిబంధనల కింద 2019 మార్చి నాటికి కనీసం 8 శాతం మూలధన నిష్పత్తి సాధించేందుకు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులకు కేంద్రం అందిస్తున్న నిధులు సరిపోవచ్చని తమ విశ్లేషణలో తెలుస్తోందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అల్కా అన్బరసు చెప్పారు. రుణ వృద్ధి 5–6 శాతమే ఉండాలి.. నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయిల్లో మూలధన నిల్వలను పాటించాలంటే.. బ్యాంకులు రుణ వృద్ధిని ఒక మోస్తరుగా 5–6 శాతం స్థాయిలోనే కొనసాగించాల్సి ఉంటుందని అల్కా తెలిపారు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రుణ వృద్ధిని మెరుగుపర్చాలనుకుంటే బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూర్చడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ఆమె వివరించారు. కేంద్రం నుంచి అందే అదనపు మూలధనంతో బ్యాంకులు తమ ప్రొవిజనింగ్ కవరేజీని పటిష్టపర్చుకోగలిగినా.. ఒకవేళ ఏదైనా మొండి పద్దును విక్రయించేటప్పుడు భారీగా బకాయిలకు కోతపడిందంటే ఈ నిధులు సరిపోకపోవచ్చని మూడీస్ తెలిపింది. ప్రొవిజనింగ్ పెంచాల్సి వస్తే.. మూలధన అవసరాలు కూడా గణనీయంగా పెరుగుతాయని వివరించింది. కేంద్రం మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధనాన్ని, ప్రొవిజనింగ్‌కు కావాల్సిన నిల్వలను పెంచుకోగలిగినా.. సరైన సంస్కరణలను అమలు చేయకపోతే ఈ ప్రయోజనాలన్నీ తాత్కాలిక మైనవిగానే ఉంటాయని పేర్కొంది. -
పార్లమెంటరీ ప్యానల్ ముందుకు పీఎస్‌బీల సారథులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్యలు, మోసపూరిత కేసులపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆర్థిక శాఖ స్థాయీ సంఘం దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ ముందు ఐడీబీఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు అధినేతలు మంగళవారం హాజరై తమ ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే కమిటీ ముందు ఈనెల మొదట్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) రూ.8.99 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలే రూ.7.77 లక్షల కోట్లు కావడం గమనార్హం. మరోపక్క మోసపూరిత కేసు లూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. -
బ్యాంకుల్లో 33 శాతానికి వాటా తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కేంద్ర ప్రభుత్వం తన వాటాను రానున్న రెండు మూడేళ్లలో 33 శాతానికి తగ్గించుకోవాలని సీఐఐ డిమాండ్ చేసింది. మొండి బకాయిల సమస్యతో కుదేలవుతున్న పీఎస్బీలకు కేంద్రం రీక్యాపిటలైజేషన్ సాయం చేస్తున్న నేపథ్యంలో సీఐఐ ఈ సూచన చేసింది. తక్షణ ప్రాదిపదికన ప్రభుత్వం తన వాటాను 52 శాతం వరకు తగ్గించుకునేందుకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని, 33 శాతానికి తగ్గించుకోవడం వచ్చే మూడేళ్ల కాలానికి లక్ష్యంగా పెట్టుకోవాలని సీఐఐ తన ప్రకటనలో పేర్కొంది. ప్రాధాన్య అవసరాల రీత్యా ఎస్బీఐలో గణనీయమైన వాటాను ప్రభుత్వం ఉంచుకోవచ్చని అభిప్రాయపడింది. వాటాలను తగ్గించుకోవడం అన్నది ఈక్విటీ షేర్ల రూపంలో కాకుండా ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం పీఎస్బీల్లో ప్రభుత్వం వాటా 58 శాతం, అంతకంటే ఎక్కువే ఉందని సీఐఐ తెలిపింది. ‘‘చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 80 శాతం పైనే ఉంది. కేవలం నాలుగు బ్యాంకుల్లో వాటా ఈ ఏడాది మార్చి నాటికి 58 శాతానికి తగ్గింది. 2018 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులకు నూతన అకౌంటింగ్ ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో మొండి రుణాలకు కేటాయింపులు 30 శాతం మేర పెంచాల్సి రావచ్చు. ఫలితంగా బ్యాంకులకు నిధుల అవసరాలు పెరుగుతాయి’’ అని సీఐఐ పేర్కొంది. దీంతో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌కు సంబంధించి సర్కారు ఆరు పాయింట్ల అజెండాను రూపొందించుకోవాలని సీఐఐ సూచించింది. బ్యాంకులకు వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మేర పీఎస్బీలకు రీక్యాపిటలైజేషన్ సాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. -
మూడో ఫ్రంట్ వస్తే మూడినట్లే: మూడీస్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడవ ఫ్రంట్ అధికారంలోకి వస్తే, పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తోంది. ఆర్థిక రికవరీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి ఆర్థిక సంస్కరణల ఎజెండా లేకుండా చిన్న, ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటయ్యే సంకీర్ణం వల్ల ఆర్థిక వ్యవస్థ పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ ఘోష్ పేర్కొన్నారు. వృద్ధికి వచ్చే ఎన్నికలు కీలకం: స్టాన్‌చార్ట్ కాగా భారత్ వృద్ధి తీరుకు రానున్న ఎన్నికలు కీలకమని స్టాండెర్డ్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి మెరుగుపడుతుందని కూడా విశ్లేషించింది.