న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల సాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,000–25,000 కోట్ల స్థాయికి తగ్గుతుందని, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడమే దీనికి కారణమని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. నియంత్రణ పరమైన మూలధన అవసరాల కోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.48,239 కోట్ల నిధులను అందించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1,00,958 కోట్లను సమకూర్చింది.
‘‘కామన్ ఈక్విటీ టైర్–1 రేషియో 8.5 శాతం నిర్వహణకు గాను 2019– 20 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు రూ.20,000–25,000 కోట్ల నిధులు అవసరం అవుతాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించిన రూ.1.96 లక్షల కోట్ల కంటే ఇది ఎంతో తక్కువ’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిధుల సాయంతో బ్యాంకుల పరపతి పెరుగుతుందని, ఎన్‌పీఏల కేటాయింపులకు ఊతం లభిస్తుందని పేర్కొంది. కానీ, రుణాలకు సంబంధించిన సమస్యలు ఇంకా అధిక మొత్తంలో పరిష్కారం కావాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అందించే సాయంతో బలమైన పీఎస్‌బీలు రుణాల్లో వృద్ధిని సాధించేందుకు నిధుల వెసులుబాటు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment