సాక్షి, ముంబై : రూ 50 కోట్లకు మించిన మొండి బకాయిల ఖాతాల్లో అక్రమాలపై తనిఖీ చేయాలని లేనిపక్షంలో నేరపూరిత కుట్ర అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిధులను దారిమళ్లించారనే ఆరోపణలతో భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను తీవ్ర నేరాల విచారణా కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు బ్యాంకర్లను హెచ్చరించింది.
ఆయా ఖాతాల్లో దర్యాప్తు సంస్థలు అక్రమాలను వెలికితీస్తే వీటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైన బ్యాంకర్లపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 120 బీ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిఫాల్ట్ ఖాతాల్లో నిధుల దారిమళ్లింపును దర్యాప్తు ఏజెన్సీలు గుర్తిస్తే ఆయా బ్యాంక్‌లపై చర్యలు తప్పవని స్పష్టం చేశాయి. కాగా నిధుల దారి మళ్లింపు సహా అక్రమాలకు పాల్పడి దివాలా చట్ట ప్రక్రియలో ఉన్న దాదాపు పన్నెండు కంపెనీలపై బ్యాంకులు, దర్యాప్తు సంస్ధలు దృష్టిసారించాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 8 లక్షల కోట్లకు పైగా రుణ బకాయిలు, మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. పీఎన్‌బీలో రూ 14,000 కోట్ల స్కామ్, నీరవ్ మోదీ వ్యవహారం సహా పలు స్కాంలతో బ్యాంకింగ్ రంగం కుదేలైన క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్రమత్తం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment