NPA mangement
-
‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..?
రూ.లక్ష లేదా రెండు లక్షల రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇవ్వాలంటే సవాలక్ష పత్రాలు అడిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ కార్పొరేట్లు అప్పుకోసం బ్యాంకులకు వెళితే మర్యాదలు చేసిమరీ కోరి అప్పిస్తాయి. కానీ లక్షల్లో అప్పుతీసుకునే సామాన్యులే నెల కిస్తీలు సవ్యంగా చెల్లిస్తారు. కోట్లల్లో అప్పులు తీసుకునే కొందరు కార్పొరేట్లు, ఇతరులు పూర్తిగా చెల్లించేవరకు అనుమానమే. అలా తీసుకున్న అప్పు చెల్లించకుండా బ్యాంకుల వద్ద పోగవుతున్న నిరర్ధక ఆస్తుల(తిరిగి చెల్లించని అప్పులు) చిట్టా 2019 వరకు ఏకంగా రూ.9,33,779 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి కరాద్ తెలిపారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద ఇచ్చిన లోన్లను కలుపుకొని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2019 మార్చి 31 నాటికి రూ.9,33,779 కోట్లుగా రికార్డయ్యాయని కేంద్ర మంత్రి కరాద్ ఇటీవల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది బ్యాంకుల అడ్వాన్స్‌ల్లో 9.07 శాతానికి సమానం. ద్రవ్యోల్బణం కారణంగా పరిస్థితులు దిగజారితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మరింత పెరగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే.. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు. ఏమిటి లాభం.. బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి. ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు? బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ’(ఏఆర్సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి. దీని ఏర్పాటు ఇలా.. ఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ప్రముఖులు ఏమంటున్నారంటే.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాను మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ‘ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్’ పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకులకు తరలించాలన్నారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో అఇష్టతను చూపించారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. ఇదీ చదవండి: కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్నింగ్
సాక్షి, ముంబై : రూ 50 కోట్లకు మించిన మొండి బకాయిల ఖాతాల్లో అక్రమాలపై తనిఖీ చేయాలని లేనిపక్షంలో నేరపూరిత కుట్ర అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిధులను దారిమళ్లించారనే ఆరోపణలతో భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను తీవ్ర నేరాల విచారణా కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు బ్యాంకర్లను హెచ్చరించింది. ఆయా ఖాతాల్లో దర్యాప్తు సంస్థలు అక్రమాలను వెలికితీస్తే వీటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైన బ్యాంకర్లపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 120 బీ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిఫాల్ట్ ఖాతాల్లో నిధుల దారిమళ్లింపును దర్యాప్తు ఏజెన్సీలు గుర్తిస్తే ఆయా బ్యాంక్‌లపై చర్యలు తప్పవని స్పష్టం చేశాయి. కాగా నిధుల దారి మళ్లింపు సహా అక్రమాలకు పాల్పడి దివాలా చట్ట ప్రక్రియలో ఉన్న దాదాపు పన్నెండు కంపెనీలపై బ్యాంకులు, దర్యాప్తు సంస్ధలు దృష్టిసారించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 8 లక్షల కోట్లకు పైగా రుణ బకాయిలు, మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. పీఎన్బీలో రూ 14,000 కోట్ల స్కామ్, నీరవ్ మోదీ వ్యవహారం సహా పలు స్కాంలతో బ్యాంకింగ్ రంగం కుదేలైన క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్రమత్తం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. -
పోచంపల్లి బ్యాంకుకు జాతీయ అవార్డు
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్ : పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని బ్యాంకు చైర్మన్ కర్నాటి పాండు, సీఈఓ సీత శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిఏటా ముంబయిలోని బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ఈ అవార్డులు అందజేస్తుందని పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్ ఎన్పీఏ మేనేజ్మెంట్ కింద ఒక అవార్డు, మరొకటి ఆదాయ సముపార్జనకు వచ్చినట్లు చెప్పారు. కాగా ఈ నెల 22వ తేదీన బెంగళూరులో జరిగిన ‘జాతీయ సహకార సంస్థల సమ్మేళన’ సమావేశంలో నాబ్కాబ్ సీఈఓ డి.కృష్ణ, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ శశిధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ జిట్ట చంద్రమౌళి, డైరక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, తడ్క రమేష్, గుర్రం ప్రభాకర్, సీత శోభ, సీత వెంకటేశం, విష్ణు, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.