
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేలం వేసే ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించేందుకు ‘బ్యాంక్‌నెట్’ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. సరికొత్తగా తీర్చిదిద్దిన ఈ–ఆక్షన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఎన్‌పీఏ కేసుల పరిష్కార ప్రక్రియను పారదర్శకమైన విధంగా, వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని మంత్రి వివరించారు.
ఆటోమేటెడ్ కేవైసీ సాధనాలు, సురక్షితమైన పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకు ధ్రువీకరించిన ప్రాపర్టీ టైటిల్స్ మొదలైన వాటిని అనుసంధానించడంతో పాటు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రాపర్టీ వేలం ప్రక్రియ ఆసాంతం అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు, 15 ప్రభుత్వ ప్రాయోజిత రుణాలు, సబ్సిడీ పథకాలను ఒకే చోట అనుసంధానించేందుకు ‘జన సమర్థ్ పోర్టల్’ ఉపయోగపడుతోందని మంత్రి తెలిపారు. దరఖాస్తుదారు డేటాను డిజిటల్‌గా మదింపు చేసే ఈ ప్రక్రియతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, అనుమతులను పొందడం మరింత సులభతరం అయ్యిందని వివరించారు.
ఇదీ చదవండి: టెస్లాను వెనక్కి నెట్టిన బీవైడీ
28న ఇండస్‌ఇండ్‌పై నివేదిక
ఇండస్‌ఇండ్ బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాలను పరిశీలిస్తున్న ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యూసీ మార్చి 28న బ్యాంకు బోర్డుకు తమ నివేదికను సమరి్పంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అకౌంటింగ్ సమస్యలు, వివిధ స్థాయుల్లో లోపాలు, తీసుకోతగిన దిద్దుబాటు చర్యలతో పాటు బ్యాంకునకు వాస్తవంగా ఎత మేర నష్టం వాటిల్లినది కూడా పీడబ్ల్యూసీ తన నివేదికలో పొందుపర్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి. దాదాపు రూ. 2,100 కోట్ల అకౌంటింగ్ లోపాల వల్ల సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ అంచనా వేసింది. అవసరమైన వివరాలన్నీ వెల్లడించి, ప్రస్తుత త్రైమాసికంలోనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.