
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రోల్టా ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.616.30 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన రోల్టా 2023 జనవరిలో దివాలా ప్రకటించి వివిధ రుణదాతలకు సుమారు రూ.14,000 కోట్లు బకాయి పడింది. ఈ కేసును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించారు.
రోల్టా ఇండియా లిమిటెడ్ చేసిన రూ.616.30 కోట్ల రుణాల మోసం వివరాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సెబీ (ఎల్ఓడీఆర్) రెగ్యులేషన్స్, 2015 కింద బ్యాంక్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, అంతర్గత వివరాల వెల్లడి విధానాల్లో భాగంగా బీఓఐ ఈ విషయాన్ని పేర్కొంది. మే 2024 కొన్ని సంస్థల నివేదిక ప్రకారం రోల్టా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నేతృత్వంలోని సంస్థలకు రూ.7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్ సెక్యూర్డ్ విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ.6,699 కోట్లు బకాయి పడింది.
ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!
కార్యకలాపాలు ప్రభావితం కాకుండా చర్యలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.616.30 కోట్ల మొత్తాన్ని పూర్తిగా సమకూర్చినట్లు ఆర్‌బీఐకి తెలిపిన వివరాల్లో పేర్కొంది. ఈ వర్గీకరణ వల్ల దాని ఆర్థిక పరిస్థితి ప్రభావితం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. పారదర్శకతను కొనసాగించడానికి, నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి బ్యాంక్ నిబద్ధతతో ఉందని పేర్కొంది. ఏదేమైనా, భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) సమస్యను ఈ పరిణామాలు హైలైట్ చేస్తున్నాయి. ఇది ఆర్థిక సంస్థలకు సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు తమ రుణ విధానాల్లో తగిన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.