ప్రియుడితో వెళ్తా, పెళ్లైన నెల రోజులకు విడాకులిస్తారా?
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టెలి–లా’పోర్టర్‌కు వెల్లువెత్తిన విచిత్ర ప్రశ్నలు
సలహాలు అడిగిన వారిలో 12 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్కులు
పోర్టల్‌ను ఆశ్రయించిన వారిలో 19లక్షల మందితో యూపీ టాప్
పోర్టల్‌ను ఆశ్రయించిన 3 లక్షల మంది ఏపీ, 3 లక్షల మంది తెలంగాణవాసులు
దేశ వ్యాప్తంగా ‘టెలి–లా’పోర్ట్‌లో రిజిస్టరైన వారి సంఖ్య కోటికి పైనే
వివరాలు వెల్లడించిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్.. నేను హోంవర్క్ చేయకుంటే మా టీచర్ నన్ను గోడకుర్చీ వేయించవచ్చా? పిల్లలను కొట్టే తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చా? నేను సొంతింట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం అందుతుంది? అదెలా పొందాలి? ప్రేమికుడి దగ్గరకి వెళ్లాలనుకుంటున్నాను. వివాహమైన నెల రోజులకు విడాకులు సాధ్యమేనా?’పెళ్లైన 30ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవచ్చా?.. ఇలాంటి విచిత్ర ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ టెలీ–లా పోర్టల్‌కు పోటెత్తాయి.
న్యాయ సలహాల కోసం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారిలో 12 ఏళ్ల మైనర్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం విశేషం. గత సంవత్సరం పోర్టల్‌ను ఆశ్రయించిన వారి సంఖ్య కోటి దాటడం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 19 లక్షల మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఎక్కువ మందితో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షలకు పైగా, తెలంగాణలో రెండు లక్షలకు పైగా వ్యక్తులు టెలి–లాను ఆశ్రయించారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కలి్పంచి వారికి న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘టెలి–లా’పోర్టల్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ పోర్టల్‌కు పౌరుల నుంచి మంచి స్పందన వస్తోంది.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత తీవ్రమైన సమస్యలతో పాటు అసంబద్ధమైన విషయాలపైనా న్యాయ సలహాలు కోరుతున్నారు. దీని ద్వారా.. కొన్ని చోట్ల పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు సైతం పోర్టల్ అందుకుంది. న్యాయ సలహాలే కాకుండా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ‘టెలి–లా’పోర్టల్‌ను పెద్దసంఖ్యలో పౌరులు ఆశ్రయించి తగు సూచనలు, సలహాలు పొందారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల చట్టపరమైన సమస్యలపై లీగల్ సర్విసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదులు సంప్రదింపులు, సహాయంతోపాటు దిశానిర్దేశం చేస్తారు.
2024 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల నుండి 1,06,18,641 మంది న్యాయ సలహా కోసం పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1,0492,575 మందికి న్యాయ సహాయం, సంప్రదింపులు కూడా అందించారు. ‘టెలి–లా’ను ఆశ్రయించిన టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1,902,911 మంది ఆశ్రయించగా 1,888,805 మంది సలహాలు పొందారు. మధ్యప్రదేశ్‌లో 1,126,681 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 1,125,191 మంది సలహాలు పొందారు.
మహారాష్ట్ర నుంచి 838,214 మంది ఆశ్రయించగా 834,149 మంది సలహాలు పొందారు. జమ్మూకశ్మీర్ నుంచి 694,208 మంది ఆశ్రయించగా 687,375 మంది సలహాలు పొందగలిగారు. రాజస్థాన్ నుంచి 650,980 మంది ఆశ్రయంగా పొందారు. వీరిలో 646,394 మందికి లాయర్లు సలహాలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.
కర్ణాటక నుంచి 401,838 మంది టెలి–లా పోర్టల్‌ను ఆశ్రయించగా 369,859 మంది సలహాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 341,884 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 341,424మంది సలహాలు పొందారు. తెలంగాణ నుంచి 300,171 మంది ఆశ్రయించారు. వీరిలో 294,977 మందికి న్యాయవాదులు సలహాలు ఇచ్చారు. తమిళనాడు నుంచి 286,107 మంది ఆశ్రయంగా పొందగా 284,408 మంది సలహాలు పొందారు. కేరళ నుంచి 40,746 మంది పోర్టల్‌ను సలహాలు, సూచనలు అడగ్గా 36,891 మందికి సలహాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment