Indus Ind Bank
-
స్పీడ్‌గా స్పందించారా.. అయితే అలర్ట్ అవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే, ఓ బ్యాంక్ గ్యారెంటీ అంశానికి సంబంధించి బ్యాంక్‌కు ఈ–మెయిల్ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే..? అలాంటి సత్వర స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచి్చన సందేశంతోనే నకిలీ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ వెలుగులోకి వచి్చంది. ఈ కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.45 కోట్ల విలువైన బోగస్ బ్యాంక్ గ్యారెంటీ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలో ‘కుటీర పరిశ్రమగా’ఈ దందా... కోల్‌కతాలోని అనేక ప్రాంతాలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు తయారు చేయడానికి అడ్డాలుగా ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలయాలతో పాటు గదుల్లోనూ కుటీర పరిశ్రమగా, వ్యవస్థీకృతంగా ఈ దందా నడుస్తుంటుంది. వీరికి దేశ వ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్‌కు చెందిన ఏజెంట్ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇంజనీరింగ్ కంపెనీ రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాల్సి వచ్చింది. వాటిని ఏర్పాటు చేస్తానంటూ ఈ కంపెనీ ఎండీని కలిసిన నాగరాజు కమీషన్ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ నుంచి దాదాపు రూ.47 లక్షలు కమీషన్‌గా తీసుకున్న ఇతగాడు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ లెటర్లు అందించాడు. పక్కాగా తయారు చేసిన కోల్‌కతా గ్యాంగ్.. ఏజెంట్‌గా వ్యవహరించిన నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేష్ వర్మ ద్వారా కోల్‌కతా వాసులు నీలోట్పాల్ దాస్, సుబ్రజిత్ గోశాల్లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు వివిధ కంపెనీలకు అందించారు. కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ పేరుతో తమకు అందినవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్ డెవలప్మెంట్ శాఖకు దాఖలు చేసి పనులు కూడా పొందింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తయారు చేయడంలో నీలోట్, సుబ్రజిత్లు దిట్టలు కావడంతో వీటిపై ఎవరికీ అనుమానం రాలేదు. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్ చెక్ చేయవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్‌ను సంప్రదించి సందేహం నివృత్తి చేసుకుంటాయి. ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో.. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్ ద్వారా జరుగుతాయి. సదరు బ్యాంక్ గ్యారెంటీ లేఖలోనే ఈ మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కోల్‌కతా ద్వయం దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఈ–మెయిల్ ఐడీలు కూడా రూపొందించింది. వీటిలో ఆయా బ్యాంకుల పేర్లు ఉండేలా, వాటిని చూసిన అధికారులు నిజమైనవిగానే భావించేలా జాగ్రత్తపడింది. హర్షిత సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్ గ్యారెంటీలను సరిచూడాలని భావించిన అర్బన్ డెవలప్మెంట్ విభాగాధినేత అందులో ఉన్న ఈ–మెయిల్‌కి మెసేజ్ పంపించారు. దీన్ని అందుకున్న సుబ్రజిత్ గోశాల్ బ్యాంకు అధికారి మాదిరిగానే కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానంగా మెయిల్ పంపిస్తూ... అవి నిజమైనవేనని స్పష్టం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఇంత త్వరగా సమాధానం రావడంతో షాక్‌కు గురైన అర్బన్ డెవలప్మెంట్ అధికారులు అనుమానించారు. రీజినల్ కార్యాలయాన్ని సంప్రదించడంతో.. కోల్‌కతాలోని బ్రాంచ్ నుంచి వచి్చన జవాబుతో పాటు బ్యాంకు గ్యారెంటీ పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. దీంతో వీటిని ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ రీజనల్ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా పంపించారు. వీటిని చూసిన అక్కడి అధికారుల షాక్‌కు గురయ్యారు. ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు శాఖే లేదని స్పష్టం చేశారు. తమకు ఈ–మెయిల్ ఐడీలు కూడా ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాసబ్‌ట్యాంక్‌లోని ఇండస్ఇండ్ బ్యాంక్ శాఖకు రీజనల్ కార్యాలయం తెలిపింది. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదై సీసీఎస్‌కు చేరింది. మరోపక్క హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసూ అక్కడికే వచి్చంది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. -
రూ.137 కోట్ల మోసం.. ‘తెలిసే బ్యాంకులు అప్పిచ్చాయి’
సాక్షి, హైదరాబాద్: ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను రూ.137 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి పోలీసు కస్టడీ గడువు ముగియడంతో సీసీఎస్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 2 రోజుల పోలీసుల విచారణలో ఆయన కొత్త అంశాలను బయటపెట్టలేదు. తనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అన్ని విషయాలు తెలిసే అప్పులు ఇచ్చాయని మాత్రమే చెప్పుకొచ్చాడు. మరికొన్ని అంశాలు రాబట్టాలని భావిస్తున్న పోలీసులు మరో 2 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సైఫాబాద్ పరిధిలో వ్యక్తి హత్య ఖైరతాబాద్: జులాయిగా తిరిగే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో వద్ద సమీర్ (35) జులాయిగా తిరుగుతూ వైట్నర్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 8గంటల సమయంలో పిల్లర్ నెం 1244–45 మధ్య రక్తం మడుగులో పడిఉన్నాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పరీక్షించి చూడగా తల వెనుక, కుడిచేయి, భుజం మీద పదునైన ఆయుధంతో కోసిన గాయాలు గుర్తించారు. అప్పడికే చనిపోయి ఉండటంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. రేణూ దేశాయ్ పంచుకున్న విషయాల ప్రకారం... ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: Digital Rules: ట్విటర్‌కు ఫైనల్ వార్నింగ్ View this post on Instagram A post shared by renu (@renuudesai) -
ఇండస్ ఇండ్‌కు బీఎఫ్ఐఎల్ దన్ను
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,433 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1.036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంక్‌లో విలీనమైన సూక్ష్మ రుణ సంస్థ, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పనితీరు బాగుండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ సీఎమ్‌డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,370 కోట్ల నుంచి శాతం వృద్ధితో రూ.8,625 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ (బీఎఫ్ఐఎల్) విలీనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ క్యూ1 ఫలితాల్లో బీఎఫ్ఐఎల్ గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ1 ఫలితాలను, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. రుణ వృద్ధి 28 శాతం...: 28 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2,844 కోట్లకు పెరిగిందని, 4.05 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో మనీ మార్కెట్ రేట్లు భారీగా తగ్గాయని, ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ పెరిగిందని పేర్కొన్నారు. మొండి బకాయిలు డబుల్...: గత క్యూ1లో 1.15 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై 2.15 శాతానికి పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఇది 2.10 శాతం. గత క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.23 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.350 కోట్ల నుంచి రూ.430 కోట్లకు చేరుకున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కారణంగా గత కొన్ని క్వార్టర్ల పాటు రుణ నాణ్యత ప్రభావితమైంది, ప్రస్తుతం ఈ రుణ నాణ్యత ఇబ్బందుల నుంచి బయటపడ్డాం’’ అని సోబ్తి వివరించారు. ఆరంభంలో భారీగా లాభపడిన ఇండస్ ఇండ్ షేర్ చివరకు 2% నష్టంతో రూ.1,510 వద్ద ముగిసింది. -
38 శాతం ఎగిసిన ఇండస్ ఇండ్ లాభం
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికం నికర లాభాలు 38 శాతం ఎగిసాయి. రూ. 1432 కోట్ల లాభాలను వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 34 శాతం పెరిగి రూ. 2844 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) స్వల్పంగా ఎగిసి 2.15 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.2 శాతం నుంచి 1.23 శాతానికి చేరాయి. అలాగే ప్రొవిజన్లు కూడా తగ్గాయి. మైక్రో ఫైనాన్స్ రంగ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బీఎఫ్ఐఎల్తో విలీనంతో విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామనీ, ఈ త్రైమాసికంలో, బ్యాంక్ తన టాప్ లైన్ గ్రోత్తోపాటు ఆపరేటింగ్ లాభాలలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిందని బ్యాంకు సీఎండీ రొమేష్ సోబ్టి తెలిపారు. తరువాతి త్రైమాసికాల్లో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో కొత్త అవకాశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు తీవ్ర ఒడిదుడకులకు లోనై చివరికి 2 శాతం నష్టంతో ముగిసింది. -
ఇండస్ఇండ్ లాభాలకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గండి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(2018–19, క్యూ2)లో రూ.920 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.880 కోట్లు)తో పోల్చితే 5 శాతం వృద్ధి సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌కు రుణాలివ్వడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభానికి గండి పడింది. ఈ గ్రూప్‌కు ఎంత మొత్తంలో రుణాలిచ్చింది వెల్లడించని ఈ బ్యాంక్ ఈ బకాయిల కోసం రూ.275 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ కేటాయింపులు కూడా కలుపుకుంటే నికర లాభం 25 శాతం పెరిగేదని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.5,395 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.6,755 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 21 శాతం అప్.... నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.2,203 కోట్లకు, ఫీజు ఆదాయం 20% వృద్ధితో రూ.1,218 కోట్లకు పెరిగిందని సోబ్తి పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ మార్జిన్ 4 శాతం నుంచి 3.88 శాతానికి తగ్గిందని తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడిందని వివరించారు. గత క్యూ2లో 1.08 శాతంగా, ఈ క్యూ1లో 1.15 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.09 శాతానికి చేరాయని తెలిపారు. ఈ క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 0.48 శాతానికి తగ్గాయని తెలిపారు. కేటాయింపులు రూ.294 కోట్ల నుంచి రెట్టింపై రూ.590 కోట్లకు చేరుకున్నాయి. నిర్వహణ లాభం రూ.1,992 కోట్లు.... రుణ వృద్ధి 32%, డిపాజిట్లు 19% చొప్పున వృద్ధి చెందాయని సోబ్తి తెలిపారు. కార్పొరేట్, రిటైల్ రుణాలు వేగవంతమైన వృద్ధిని సాధించాయని వివరించారు. ఇతర ఆదాయం 11% వృద్దితో రూ.1,317 కోట్లకు, నిర్వహణ లాభం 22% వృద్ధితో రూ.1,992 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 1.4 శాతం నష్టంతో రూ.1,627 వద్ద ముగిసింది. -
24 శాతం పెరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కీలక వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,122 కోట్లకు పెరగడం, 29 శాతం రుణ వృద్ధి వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,303 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.6,370 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్... గత క్యూ1లో రూ.1,774 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి చెప్పారు. వడ్డీయేతర (ఇతర) ఆదాయం రూ.1,167 కోట్ల నుంచి రూ.1,301 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎమ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 3.97 శాతంగా ఉండగా ఈ క్యూ1లో స్వల్పంగా తగ్గి 3.92 శాతానికి చేరిందని వివరించారు. కాగా ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్ 1 శాతం నష్టంతో రూ.1,935 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ చేతికి ఐఎల్ & ఎఫ్ఎస్ బ్రోకరేజ్
ముంబై: మౌలిక రంగ కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు చెందిన బ్రోకరేజ్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందామని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. పూర్తిగా నగదు రూపంలోనే జరిగే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ బ్రోకరేజ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం వల్ల తమ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించగలమని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ, ఎండీ రమేశ్ సోబ్తి చెప్పారు. కొనుగోలు 3 నెలల్లో పూర్తవ్వగలదన్న అంచనాలున్నాయని వివరించారు. రోజుకు 30 లక్షల లావాదేవీలు.. 2007లో ఆరంభమైన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ బ్రోకరేజ్ వ్యాపారం డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీసులతో పాటు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ క్లియరింగ్ సేవలను కూడా అందిస్తోంది. ఎఫ్‌పీఐ, ఎఫ్ఐఐలతో సహా మొత్తం వెయ్యికి పైగా బ్రోకర్ క్లయింట్లు ఈ కంపెనీకి ఉన్నారు. ఈ వ్యాపార విభాగం రోజుకు 30 లక్షల లావాదేవీలను నిర్వహిస్తుందని అంచనా. గతేడాది ఈ సంస్థ రూ.324 కోట్ల ఆదాయంపై రూ.45 కోట్ల నికర లాభం సాధించింది. ఆల్‌టైమ్ హైకి ఇండస్ఇండ్ బ్యాంక్.. ఈ డీల్ వార్తలతో బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,983 వద్ద ముగిసింది. సెన్సెక్స్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైనా ఇంట్రాడేలో ఈ షేర్ మాత్రం జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,990ను తాకింది. ఈ బ్యాంక్ ఇటీవలే భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ను కొనుగోలు చేసింది. లావాదేవీ మొత్తం నగదులోనే మూడు నెలల్లో డీల్ పూర్తి -
‘ఇండస్ ఇండ్’ లాభం రూ.936 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 25 శాతం వృద్ధితో రూ.936 కోట్లకు పెరిగింది. గత క్యూ3లో లాభం రూ.751 కోట్లు. కోర్ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్ చీఫ్ రమేశ్ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.4,716 కోట్ల నుంచి 16% వృద్ధితో రూ.5,474 కోట్లకు పెరిగిందని చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్... డిపాజిట్లు 23 శాతం, రుణాలు 25 శాతం చొప్పున వృద్ధి చెందాయని రమేశ్ సోబ్తి తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.1,895 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 22 శాతం పెరిగి రూ.1,077 కోట్లకు వృద్ధి చెందిందన్నారు. స్థూల మొండి బకాయిలు 0.94% నుంచి 1.16%కి, నికర మొండి బకాయిలు 0.39% నుంచి 0.46%కి పెరిగాయని సోబ్తి తెలిపారు. ఫలితాల నేపథ్యంలో ఇండస్ ఇండ్ షేరు 2 శాతం నష్టంతో రూ.1,699 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
ఇండస్ఇండ్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.1,695, టార్గెట్ ధర: రూ.1,952 ఎందుకంటే: సూక్ష్మ రుణ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(బీఎఫ్ఐఎల్)ను కొనుగోలు చేయడం ఇండస్ఇండ్ బ్యాంక్‌కు కలసివచ్చే అంశం. ఈ ఏడాది జూన్ నాటికి భారత్ ఫైనాన్షియల్ ఇచ్చిన రుణాలు రూ.9,631 కోట్లుగా, ఇండస్ఇండ్ బ్యాంక్ రుణాలు రూ.1,16,407 కోట్లుగా ఉన్నాయి. విలీనం కారణంగా మొత్తం రుణాలు 1,26,038 కోట్లకు చేరాయి. ప్రస్తుతం 2.4 శాతంగా ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ సూక్ష్మ రుణాలు.. విలీనం కారణంగా 8 శాతానికి పెరుగుతాయి. ప్రస్తుతం 60:40 శాతంగా ఉన్న కార్పొరేట్, కన్సూమర్ రుణ నిష్పత్తిని 50:50 శాతానికి మార్చుకోవాలని ఇండస్ఇండ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఫైనాన్షియల్ విలీనం కారణంగా ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నిధుల వ్యయం 3–4 శాతం తగ్గి, మార్జిన్ 20–30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలున్నాయి. కొత్తగా 68 లక్షల మంది ఖాతాదారులు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు లభిస్తారు. విలీనం నేపథ్యంలో ప్రమోటర్లకు వారంట్ల జారీతో రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ), ఆర్ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) నిష్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆర్‌ఓఏ 7 బేసిస్ పాయింట్లు తగ్గి 1.7 శాతానికి, ఆర్ఓఈ 70–80 బేసిస్ పాయింట్లు తగ్గి 15.2 శాతానికి తగ్గుతాయి. అయితే విలీనం మొత్తం షేర్ల డీల్ ద్వారా జరుగుతున్నందున, ఆర్‌ఓఏ త్వరగానే పుంజుకునే అవకాశాలున్నాయి. విలీనం.. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పుస్తక విలువపై ఒక్కో షేర్‌కు రూ.8 చొప్పున మాత్రమే ప్రభావం చూపుతుందని అంచనా. ఈ విలీనం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. స్టాండోలోన్ ప్రాతిపదికన ఇండస్ఇండ్ బ్యాంక్ పనితీరు పటిష్టంగా ఉండటంతో షేర్ జోరుగానే పెరుగుతోంది. రెండేళ్లలో నికర లాభం 25 శాతం పెరిగి రూ.4,481 కోట్లకు పెరగవచ్చని అంచనా. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) అమ్మేయొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,168, టార్గెట్ ధర: రూ.873 ఎందుకంటే: డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్స్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.3,508 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్ 70 బేసిస్ పాయింట్లు పెరిగి 9.1%కి వృద్ధి చెందింది. స్థూల మార్జిన్ 90 బేసిస్ పాయింట్లు పెరిగి 16 శాతానికి చేరింది. ఉద్యోగుల వ్యయాలు 40 బేసిస్ పాయింట్లు పెరిగి నికర అమ్మకాల్లో 2 శాతానికి చేరాయి. ఇబిటా 37 శాతం వృద్ధితో రూ.318 కోట్లకు పెరిగింది. నికర లాభం 65 శాతం పెరిగి రూ.191 కోట్లకు చేరింది. అయితే ఈ ఫలితాలను గత క్యూ2 ఫలితాలతో పోల్చడానికి లేదు. జీఎస్టీ అమలు ప్రభావం, గత క్యూ2లో ఎక్కువగా కొత్త స్టోర్స్ ప్రారంభం కావడం దీనికి ప్రధాన కారణాలు. ఏడు నెలల క్రితం స్టాక్ మార్కెట్లో లిస్టయిన దగ్గర నుంచి 92 శాతం వరకూ ఎగసిన ఈ షేర్ గత మూడు నెలల్లోనే 35 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 159 రెట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 102 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 70 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. వృద్ధి అవకాశాలు బాగా ఉన్నాయన్న అంచనాలతో ఈ షేర్ బాగా దూసుకుపోతోంది. ఫలితంగా పోటీ కంపెనీల కన్నా ఇది చాలా ఖరీదైన షేరని చెప్పవచ్చు. అయితే పోటీ కంపెనీలతో పోల్చితే మంచి వృద్ధి అవకాశాలున్నాయి. డిమార్ట్ స్టోర్స్ 136 వరకూ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఒక్కో స్టోర్ విలువ 8.7 కోట్ల డాలర్లుగా ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను 6 శాతం, నికర లాభం అంచనాలను 5 శాతం తగ్గిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 50 రెట్ల ధరకు టార్గెట్ ధరను నిర్ణయించాం. ఇక ఈ ఏడాది కొత్తగా 25 స్టోర్స్‌ను కంపెనీ ప్రారంభించనున్నది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 25 శాతం అప్
ముంబై: హిందుజా గ్రూప్‌కు చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్‌కు వాణిజ్య వాహన రుణాలు పెరగడం కలసివచ్చింది. దీంతో ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.880 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.704 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాల రుణాలు 25 శాతం పెరగడంతో మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయని, దీంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండీ రమేశ్ సోబ్తి చెప్పారు. సేవింగ్స్ డిపాజిట్లు 95 శాతం పెరగడంతో వ్యయాలకు, ఆదాయానికి గల నిష్పత్తి తక్కువగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం.. ఇవన్నీ నికర లాభం 25 శాతం పెరగడానికి ప్రధాన కారణాలని వివరించారు. కాసా డిపాజిట్లు దాదాపు రెట్టింపు కావడంతో మొత్తం డిపాజిట్లు 26 శాతం పెరిగాయని, దీంతో 4 శాతం నికర వడ్డీ మార్జిన్ (నిమ్) సాధించామని చెప్పారు. గత క్యూ2లో రూ.4,440 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.5,396 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 0.90 శాతం నుంచి 1.08 శాతానికి, నికర మొండి బకాయిలు 0.37 శాతం నుంచి 0.44 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. అంకెల పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.508 కోట్ల నుంచి రూ.537 కోట్లకు, స్థూల మొండి బకాయిలు రూ.1,272 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు కూడా రూ.214 కోట్ల నుంచి రూ.294 కోట్లకు పెరిగాయని వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేర్ బీఎస్ఈలో 1.4 శాతం లాభంతో రూ.1,743 వద్ద ముగిసింది. -
భారత్ ఫైనాన్షియల్...ఇండస్ఇండ్ ఖాతాలోకి!
విలీనంపై ఇరు కంపెనీలు ముందుకు... ► సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం ► నిర్ధిష్ట గడువును మాత్రం వెల్లడించని సంస్థలు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సూక్ష్మరుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఒకనాటి ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. విలీన సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఇరు సంస్థలూ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిర్దిష్ట కాలవ్యవధిలో మదింపు ప్రక్రియ పూర్తిచేసేందుకు, విలీన అవకాశాలను పరిశీలించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇరు సంస్థలు తెలియజేశాయి. అయితే, ఒప్పంద గడువు ఎప్పటిదాకా ఉంటుందనేది వెల్లడించలేదు. వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామంటూ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఏడాది మార్చిలో తెలియజేసింది. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) విలీనంపై అప్పట్నుంచే ఊహాగానాలు నెలకొన్నాయి. బీఎఫ్ఐఎల్ చాన్నాళ్లుగా ఇండస్‌ఇండ్‌కి కర్ణాటకలో బిజినెస్ కరెస్పాండెంట్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒకవేళ విలీనం సాకారమైన పక్షంలో ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించి ఇది మూడో డీల్ కానుంది. 2011లో డాయిష్ బ్యాంక్‌కి చెందిన క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోని కొనుగోలు చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత 2015లో ఆర్‌బీఎస్‌కి చెందిన ఆభరణాల రుణాల వ్యాపార విభాగాన్నీ దక్కించుకుంది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించే దిశగా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థల కొనుగోలు డీల్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్సీ బ్యాంక్, కోటక్, ఆర్బీఎల్ వంటి బ్యాంకులు గడిచిన 18 నెలల్లో వివిధ సూక్ష్మ రుణ సంస్థలను కొనుగోలు చేయడమో లేదా వాటిలో వాటాలు కొనుగోలు చేయడమో జరిగింది. షేర్లు రయ్.. రయ్... విలీన ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్, బీఎఫ్ఐఎల్ షేర్లు 5.5 శాతం దాకా పెరిగాయి. బీఎస్ఈలో ఇండస్ఇండ్ షేరు ఒక దశలో ఏడాది గరిష్ట స్థాయి రూ.1,803కి కూడా ఎగిసి చివరికి 5.56 శాతం పెరుగుదలతో రూ. 1,791 వద్ద ముగిసింది. ఇక, బీఎఫ్ఐఎల్ షేరు కూడా ఇంట్రాడేలో 4.59 శాతం పెరిగి ఏడాది గరిష్టమైన రూ. 979 స్థాయిని తాకింది. చివరికి 3.34 శాతం వృద్ధితో రూ. 967 వద్ద క్లోజయ్యింది. ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్గా ఉన్నప్పుడు బీఎఫ్ఐఎల్.. నాలుగేళ్ల క్రితం కీలకమైన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో.. రీపేమెంట్లపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత సంస్థలో నాయకత్వ పోరు తలెత్తింది. చివరికి వ్యవస్థాపకుడు విక్రమ్ ఆకుల నిష్క్రమించాల్సి వచ్చింది. జూన్ 30కి భారత్ ఫైనాన్షియల్ సంస్థకి 68 లక్షల పైగా కస్టమర్లు, రూ. 7,709 కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో సంస్థ రూ. 37 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి రూ. 290 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇండస్ఇండ్తో డీల్ సాకారమైన పక్షంలో రెండూ లిస్టెడ్ కంపెనీలే అయినందున షేర్ల మార్పిడి రూపంలో విలీనం జరుగుతుంది. ఇటీవలే ప్రైవేట్ దిగ్గజాలు ఐడీఎఫ్సీ బ్యాం క్, శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. -
ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 25 శాతం అప్
ఒక్కో షేర్‌కు రూ.4.5 డివిడెండ్ ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 25 శాతం పెరిగింది. 2014-15 క్యూ4లో రూ.495 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.620 కోట్లకు ఎగసిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,278 కోట్ల నుంచి రూ.4,044 కోట్లకు పెరిగిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.4.5(45 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాల పరంగా చూస్తే.. 2014-15లో రూ.1,794 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 28 శాతం పెరిగి రూ.2,286 కోట్లకు వృద్ధి చెందిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,240 కోట్ల నుంచి రూ.14,878 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 0.81 శాతం నుంచి 0.87 శాతానికి, అలాగే నికర మొండిబకాయిలు రూ.0.31 శాతం నుంచి 0.36 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 1.2 శాతం క్షీణించి రూ.973 వద్ద ముగిసింది. -
ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 30 శాతం అప్
22 శాతం పెరిగిన ఆదాయం ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం ఈ డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రూ.447 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 30 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు పెరిగిందని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,086 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.3,767 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 1.05 శాతం నుంచి 0.82 శాతానికి తగ్గాయని, అయితే నికర మొండిబకాయిలు 0.32 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ధర బీఎస్ఈలో 2.6 శాతం క్షీణించి రూ.912 వద్ద ముగిసింది. -
ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎదుట ఆందోళన
మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్: తమకు న్యాయం చేయాలని కోరుతూ మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో గల ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎదుట గురువారం ఖాతాదారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు మాట్లాడారు. బ్యాంకు మేనేజరు చైతన్య ఖాతాదారులను మోసం చేసి సుమారు రూ. 1.35 కోట్లు కాజేశాడని ఆరోపించారు. మేనేజరును అరెస్టు చేసి వారం రోజులు దాటినా ఇంతవరకు బ్యాంకు ఉన్నతాధికారులు ఎవరూ ఖాతాదారులకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూడేసుకున్న డబ్బులను నమ్మి బ్యాంకులో వేసి మోసపోయామని వాపోయారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించపోతే ఈనెల 16 నుంచి బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కాగా బ్యాంకులో మేనేజరుకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ఖాతాదారుల వివరాలు, ఏడాదిగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను బ్యాంకు ఉన్నతాధికారులను పంపించామని బ్యాంక్ ఇన్చార్జ్ మేనేజరు గాయత్రికుమార్ తెలిపారు. వారు విచారణ జరిపి తగు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బ్యాంకు ఎదుట ఆందోళన చేసిన వారిలో ఖాతాదారులు నామిరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ జె.రాజు, రవికుమార్, రాపాక మల్లయ్య, రవికిషన్,సరస్వతి,పొదిల సత్యనారాయణ, వై.మమత, వనం నాగరాజు తదితరులు ఉన్నారు.