ముంబై: మౌలిక రంగ కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు చెందిన బ్రోకరేజ్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందామని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది.
పూర్తిగా నగదు రూపంలోనే జరిగే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ బ్రోకరేజ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం వల్ల తమ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించగలమని ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీఈఓ, ఎండీ రమేశ్ సోబ్తి చెప్పారు. కొనుగోలు 3 నెలల్లో పూర్తవ్వగలదన్న అంచనాలున్నాయని వివరించారు.
రోజుకు 30 లక్షల లావాదేవీలు..
2007లో ఆరంభమైన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ బ్రోకరేజ్ వ్యాపారం డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీసులతో పాటు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ క్లియరింగ్ సేవలను కూడా అందిస్తోంది. ఎఫ్‌పీఐ, ఎఫ్‌ఐఐలతో సహా మొత్తం వెయ్యికి పైగా బ్రోకర్ క్లయింట్లు ఈ కంపెనీకి ఉన్నారు. ఈ వ్యాపార విభాగం రోజుకు 30 లక్షల లావాదేవీలను నిర్వహిస్తుందని అంచనా. గతేడాది ఈ సంస్థ రూ.324 కోట్ల ఆదాయంపై రూ.45 కోట్ల నికర లాభం సాధించింది.
ఆల్‌టైమ్ హైకి ఇండస్‌ఇండ్ బ్యాంక్..
ఈ డీల్ వార్తలతో బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,983 వద్ద ముగిసింది. సెన్సెక్స్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైనా ఇంట్రాడేలో ఈ షేర్ మాత్రం జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,990ను తాకింది. ఈ బ్యాంక్ ఇటీవలే భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ను కొనుగోలు చేసింది.
లావాదేవీ మొత్తం నగదులోనే
మూడు నెలల్లో డీల్ పూర్తి
Comments
Please login to add a commentAdd a comment