ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 25 శాతం అప్
ఒక్కో షేర్‌కు రూ.4.5 డివిడెండ్
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 25 శాతం పెరిగింది. 2014-15 క్యూ4లో రూ.495 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.620 కోట్లకు ఎగసిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,278 కోట్ల నుంచి రూ.4,044 కోట్లకు పెరిగిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.4.5(45 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాల పరంగా చూస్తే.. 2014-15లో రూ.1,794 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 28 శాతం పెరిగి రూ.2,286 కోట్లకు వృద్ధి చెందిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,240 కోట్ల నుంచి రూ.14,878 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 0.81 శాతం నుంచి 0.87 శాతానికి, అలాగే నికర మొండిబకాయిలు రూ.0.31 శాతం నుంచి 0.36 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 1.2 శాతం క్షీణించి రూ.973 వద్ద ముగిసింది.