మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్: తమకు న్యాయం చేయాలని కోరుతూ మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో గల ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎదుట గురువారం ఖాతాదారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు మాట్లాడారు. బ్యాంకు మేనేజరు చైతన్య ఖాతాదారులను మోసం చేసి సుమారు రూ. 1.35 కోట్లు కాజేశాడని ఆరోపించారు. మేనేజరును అరెస్టు చేసి వారం రోజులు దాటినా ఇంతవరకు బ్యాంకు ఉన్నతాధికారులు ఎవరూ ఖాతాదారులకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూడేసుకున్న డబ్బులను నమ్మి బ్యాంకులో వేసి మోసపోయామని వాపోయారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించపోతే ఈనెల 16 నుంచి బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
కాగా బ్యాంకులో మేనేజరుకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ఖాతాదారుల వివరాలు, ఏడాదిగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను బ్యాంకు ఉన్నతాధికారులను పంపించామని బ్యాంక్ ఇన్‌చార్జ్ మేనేజరు గాయత్రికుమార్ తెలిపారు. వారు విచారణ జరిపి తగు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బ్యాంకు ఎదుట ఆందోళన చేసిన వారిలో ఖాతాదారులు నామిరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ జె.రాజు, రవికుమార్, రాపాక మల్లయ్య, రవికిషన్,సరస్వతి,పొదిల సత్యనారాయణ, వై.మమత, వనం నాగరాజు తదితరులు ఉన్నారు.