
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్‌లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్ టెస్ట్’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్‌బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్‌బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
అంతర్గత ఆడిట్‌లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్‌ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment