ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,433 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1.036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంక్‌లో విలీనమైన సూక్ష్మ రుణ సంస్థ, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పనితీరు బాగుండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ సీఎమ్‌డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,370 కోట్ల నుంచి శాతం వృద్ధితో రూ.8,625 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ (బీఎఫ్‌ఐఎల్) విలీనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ క్యూ1 ఫలితాల్లో బీఎఫ్‌ఐఎల్ గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ1 ఫలితాలను, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు.
రుణ వృద్ధి 28 శాతం...: 28 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2,844 కోట్లకు పెరిగిందని, 4.05 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో మనీ మార్కెట్ రేట్లు భారీగా తగ్గాయని, ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ పెరిగిందని పేర్కొన్నారు.
మొండి బకాయిలు డబుల్...: గత క్యూ1లో 1.15 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై 2.15 శాతానికి పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ఇది 2.10 శాతం. గత క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.23 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.350 కోట్ల నుంచి రూ.430 కోట్లకు చేరుకున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కారణంగా గత కొన్ని క్వార్టర్ల పాటు రుణ నాణ్యత ప్రభావితమైంది, ప్రస్తుతం ఈ రుణ నాణ్యత ఇబ్బందుల నుంచి బయటపడ్డాం’’ అని సోబ్తి వివరించారు. ఆరంభంలో భారీగా లాభపడిన ఇండస్ ఇండ్ షేర్ చివరకు 2% నష్టంతో రూ.1,510 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment