
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్‌కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్‌ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారమెత్తాడు.
గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ యాక్టివ్‌గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్‌ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు.
ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్‌గా రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు.
విదేశీ శిక్షణ ముఖ్యం
భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది.
మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్‌షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌గానూ కొనసాగాడు.
బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా... బీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment