ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,036 కోట్ల నికర లాభం సాధించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కీలక వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,122 కోట్లకు పెరగడం, 29 శాతం రుణ వృద్ధి వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,303 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.6,370 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్...
గత క్యూ1లో రూ.1,774 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి చెప్పారు. వడ్డీయేతర (ఇతర) ఆదాయం రూ.1,167 కోట్ల నుంచి రూ.1,301 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎమ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 3.97 శాతంగా ఉండగా ఈ క్యూ1లో స్వల్పంగా తగ్గి 3.92 శాతానికి చేరిందని వివరించారు. కాగా ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్ 1 శాతం నష్టంతో రూ.1,935 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment