స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Oct 23 2017 1:39 AM | Last Updated on Mon, Oct 23 2017 3:44 AM

Stocks view

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌     కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  
ప్రస్తుత ధర: రూ.1,695, టార్గెట్‌ ధర: రూ.1,952
ఎందుకంటే: సూక్ష్మ రుణ సంస్థ భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌(బీఎఫ్‌ఐఎల్‌)ను కొనుగోలు చేయడం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు కలసివచ్చే అంశం. ఈ ఏడాది జూన్‌  నాటికి భారత్‌ ఫైనాన్షియల్‌ ఇచ్చిన రుణాలు రూ.9,631 కోట్లుగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రుణాలు రూ.1,16,407 కోట్లుగా ఉన్నాయి. విలీనం కారణంగా మొత్తం రుణాలు 1,26,038 కోట్లకు చేరాయి. ప్రస్తుతం 2.4 శాతంగా ఉన్న ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సూక్ష్మ రుణాలు.. విలీనం కారణంగా 8 శాతానికి పెరుగుతాయి.

ప్రస్తుతం 60:40 శాతంగా ఉన్న కార్పొరేట్, కన్సూమర్‌ రుణ నిష్పత్తిని 50:50 శాతానికి మార్చుకోవాలని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ ఫైనాన్షియల్‌ విలీనం కారణంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు నిధుల వ్యయం 3–4 శాతం తగ్గి,  మార్జిన్‌ 20–30 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశాలున్నాయి. కొత్తగా 68 లక్షల మంది ఖాతాదారులు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు లభిస్తారు.

విలీనం నేపథ్యంలో ప్రమోటర్లకు వారంట్ల జారీతో రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ), ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ) నిష్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆర్‌ఓఏ 7 బేసిస్‌ పాయింట్లు తగ్గి 1.7 శాతానికి, ఆర్‌ఓఈ 70–80 బేసిస్‌ పాయింట్లు తగ్గి 15.2 శాతానికి తగ్గుతాయి. అయితే విలీనం మొత్తం షేర్ల డీల్‌ ద్వారా జరుగుతున్నందున, ఆర్‌ఓఏ త్వరగానే పుంజుకునే అవకాశాలున్నాయి.

విలీనం.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పుస్తక విలువపై ఒక్కో షేర్‌కు రూ.8 చొప్పున మాత్రమే ప్రభావం చూపుతుందని అంచనా. ఈ విలీనం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. స్టాండోలోన్‌ ప్రాతిపదికన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పనితీరు పటిష్టంగా ఉండటంతో షేర్‌ జోరుగానే పెరుగుతోంది. రెండేళ్లలో నికర లాభం 25 శాతం పెరిగి రూ.4,481 కోట్లకు పెరగవచ్చని అంచనా.


అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీమార్ట్‌)     అమ్మేయొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,168, టార్గెట్‌ ధర: రూ.873
ఎందుకంటే: డీమార్ట్‌ పేరుతో రిటైల్‌ స్టోర్స్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.3,508 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్‌ 70 బేసిస్‌ పాయింట్లు పెరిగి 9.1%కి వృద్ధి చెందింది. స్థూల మార్జిన్‌ 90 బేసిస్‌ పాయింట్లు పెరిగి 16 శాతానికి చేరింది. ఉద్యోగుల వ్యయాలు 40 బేసిస్‌ పాయింట్లు పెరిగి నికర అమ్మకాల్లో 2 శాతానికి చేరాయి.

ఇబిటా 37 శాతం వృద్ధితో రూ.318 కోట్లకు పెరిగింది. నికర లాభం 65 శాతం పెరిగి రూ.191 కోట్లకు చేరింది. అయితే ఈ ఫలితాలను గత క్యూ2 ఫలితాలతో పోల్చడానికి లేదు. జీఎస్‌టీ అమలు ప్రభావం, గత క్యూ2లో ఎక్కువగా కొత్త స్టోర్స్‌ ప్రారంభం కావడం దీనికి ప్రధాన కారణాలు. ఏడు నెలల క్రితం స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన దగ్గర నుంచి 92 శాతం వరకూ ఎగసిన ఈ షేర్‌ గత మూడు నెలల్లోనే 35 శాతం పెరిగింది. 

గత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌కు 159 రెట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 102 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 70 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. వృద్ధి అవకాశాలు బాగా ఉన్నాయన్న అంచనాలతో ఈ షేర్‌ బాగా దూసుకుపోతోంది. ఫలితంగా పోటీ కంపెనీల కన్నా ఇది చాలా ఖరీదైన షేరని చెప్పవచ్చు. అయితే పోటీ కంపెనీలతో పోల్చితే మంచి వృద్ధి అవకాశాలున్నాయి. డిమార్ట్‌ స్టోర్స్‌ 136 వరకూ ఉన్నాయి.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ఒక్కో స్టోర్‌ విలువ 8.7 కోట్ల డాలర్లుగా ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను 6 శాతం, నికర లాభం అంచనాలను 5 శాతం తగ్గిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 50 రెట్ల ధరకు టార్గెట్‌ ధరను నిర్ణయించాం. ఇక ఈ ఏడాది కొత్తగా 25 స్టోర్స్‌ను కంపెనీ ప్రారంభించనున్నది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement