రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త | Rise and Fall of Pramod Mittal he spent an Rs 550 cr on his daughter wedding | Sakshi
Sakshi News home page

రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త

Published Mon, Mar 10 2025 12:09 PM | Last Updated on Mon, Mar 10 2025 12:17 PM

Rise and Fall of Pramod Mittal he spent an Rs 550 cr on his daughter wedding

ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్‌అంబాసిడర్‌గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్‌ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్‌ మాగ్నెట్‌’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్‌ సోదరుడే ఈ ప్రమోద్‌ మిట్టల్‌.  మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.

బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్‌స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్‌) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్‌ మిట్టల్‌ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్‌ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్‌ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్‌ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్‌ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.

ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..

ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..

మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.

వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.

రిస్క్‌ మేనేజ్‌మెంట్‌: జీఐకేఐఎల్‌ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement