
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం భేటీ కానున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు సహా పలు కీలక అంశాలపై బ్యాంకర్లతో ఆమె చర్చించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఆర్‌బీఐ ఇటీవల పలుమార్లు చేపట్టిన వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించాలని ఆర్థిక మంత్రి బ్యాంకర్లను కోరనున్నారు. రుణాల చెల్లింపుల్లో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పాలసీలో పారదర్శకత దిశగా కృషిచేయాలని బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగస్ట్ 30లోగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై ప్రకటన చేసిన అనంతరం బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి తొలిసారిగా సమావేశమవుతుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.విలీనానంతరం దేశంలో ప్రస్తుతమున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి కేవలం 12 బ్యాంకులకే పరిమితం కానుంది. కాగా పీఎస్‌బీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు ఈనెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment