ఆదాయంలో 11 శాతం వృద్ధి
26% అధికంగా నికర లాభం
కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూనియన్, కెనరా బ్యాంక్ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి.
‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్‌పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఫలితమిస్తున్న చర్యలు..
‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.
ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్/బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment