13 రోజుల్లో రూ.421 కోట్లు
కొత్తగా 5 వేల పొదుపు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు వ్యవహారం తపాలా శాఖకు మాత్రం కొత్త ఊపునిచ్చింది. ముందెన్నడూ లేనిస్థాయిలో కేవలం 13 రోజుల్లో ఏకంగా రూ.421.5 కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఇది రూ.100 కోట్లు కూడా ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ తపాలా సర్కిల్ పరిధిలో నెలకు అతికష్టమ్మీద రూ.200 కోట్ల డిపాజిట్లు కూడా రావు మరి. అలాంటిది నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.421.5 కోట్లు జమయ్యారుు. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధితో కూడిన హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో రూ.195.35 కోట్లు, మిగతా జిల్లాలతో కూడిన హైదరాబాద్ రీజియన్ పరిధిలో రూ.226.15 కోట్లు సమకూరాయి. ఇక ఆర్‌బీఐ, స్టేట్‌బ్యాంకులు కొంతమేర నగదును తపాలా కార్యాలయాలకు పంపడంతో వారం పాటు జనం క్యూ కట్టి పాత నోట్లు మార్చుకున్నారు. రూ.161.71 కోట్ల నగదు మార్పిడి జరిగింది.
కొత్తగా 5 వేల ఖాతాలు
ఎప్పుడూ తపాలా కార్యాలయం గడప తొక్కని యువత కూడా ఇప్పుడు వాటిల్లో పొదుపు ఖాతాలు తెరిచేందుకు క్యూ కడుతోంది. తెలంగాణ తపాలాశాఖ పరిధిలో అన్ని రకాలు కలుపుకొని 2 కోట్లకుపైగా ఖాతాలున్నారుు. అందులో పొదుపు ఖాతాల సంఖ్య 50 లక్షల వరకు ఉంది. అరుుతే గత పది రోజుల్లో కొత్తగా ఐదు వేల వరకు ఖాతాలు తెరవడం విశేషం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే 3,500 కొత్త ఖాతాలున్నాయి. తపాలా ఖాతాలపై అవగాహనలేనివారు కూడా నోట్ల మార్పిడి కోసం వచ్చి ఖాతాల వివరాలు తెలుసుకుని తెరుస్తున్నట్టు తపాలా సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఊపు కొద్దిరోజుల్లో తగ్గినా.. తపాలాపై ప్రచారం పెరిగిందని, భవిష్యత్తులో ఖాతాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
కొత్త ఖాతాలతోనే ఆదాయం
తపాలా కార్యాలయాల్లో డిపాజిట్లు ఎంత పెరి గినా వాటితో తపాలా శాఖకు పెద్దగా ప్రయో జనమేమీ ఉండదు. ఆ మొత్తం నేరుగా కేంద్ర ఆర్థిక శాఖకే జమవుతుంది. కేంద్రం అవస రాలకు, అభివృద్ధి పనులకు ఆ నిధులను వాడుకుంటుంది. కొత్త ఖాతాలు తెరిస్తే.. ఒక్కో ఖాతాకు రూ.235 చొప్పున తపాలాకు కేంద్రం చెల్లిస్తుంది. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త ఖాతాలకు జనం మొగ్గు చూపుతుండడంతో.. తపాలాశాఖకు ఆదాయం సమకూరనుంది. ప్రజలు కొత్త ఖాతాలు తెరిచేలా తపాలా అధికారులు కూడా ప్రచారం చేస్తున్నారు.
‘తపాలా’లో కాసుల గలగల
Published Wed, Nov 23 2016 3:41 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement