ఈ నెల.. గడిచేదెలా?
• నవంబర్‌లో రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా
• నోట్ల రద్దుతో తక్షణ ప్రభావం.. భవిష్యత్తుపై ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఈ నెలలో రూ.2 వేల కోట్లకు పైగా పడిపోతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైంది. ఏ రోజుకా రోజు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి భవిష్యత్తుపై వ్యూహ రచన చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ రంగాల వారీగా ప్రభుత్వ ఆదాయంపై పడే ప్రభావాన్ని అంచనా వేసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వివిధ శాఖలకు సంబంధించి గడచిన ఏడు నెలల్లో వచ్చిన ఆదాయంతోపాటు నోట్ల రద్దు తర్వాత నవంబర్‌లో వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేసుకున్నారు. ప్రదానంగా వ్యాట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, రవాణా శాఖ అదాయం గణనీయంగా పడిపోరుుందని అంచనాకు వచ్చారు. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం అరుుదు శాతం కూడా చేరకపోవడాన్ని ఆందోళనకర పరిణామంగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించటం, భూముల క్రయ విక్రయాలు నిలిచిపోవటంతో దీని ప్రభావం వివిధ రంగాలకు విస్తరిస్తుందనే అభిప్రాయాలపై చర్చించారు.
రవాణా శాఖకు రోజుకు రూ.3 కోట్ల గండి
వాహనాల కొనుగోళ్లు సగానికి సగం తగ్గిపోవటంతో రవాణా శాఖకు రోజుకు రూ.3 కోట్లకు పైగా గండి పడింది. మద్యం అమ్మకాలపై ఇప్పటికిప్పుడు ప్రభావం లేదని, వచ్చేవారంలో అమ్మకాలు కొంత మేర తగ్గుతాయని అంచనా వేశారు. నగదు చెలామణిలో లేకపోవటంతో బడా మాల్స్ మొదలు చిన్న వ్యాపారాలు దివాళా తీశాయని అధికారులు పేర్కొన్నారు. వరుసగా నాలుగు రోజులు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు దాదాపు 110 శాతం పెరిగినా ఆ తర్వాత బంక్‌లు వెలవెలబోతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయంపై పడే ప్రభావంపై ప్రతిరోజు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
తమ శాఖలలో తలెత్తే ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ద్వారా రాబోయే మాసాల్లో లభించే ఆదాయం, గ్రాంట్స్, తదితర అంశాలపైనా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, ఎస్.పి.సింగ్, ఎంజి.గోపాల్, రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్‌కే జోషి, అజయ్ మిశ్రా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇంటెలిజెన్‌స ఐజీ నవీన్ చంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.