
లోక్‌సభలో కేంద్రబడ్జెట్ 2025-26 సమయంలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న మదింపు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం..వంటి నిబంధనలను విలీనం చేస్తూ పన్ను సంవత్సరం అనే ఏకీకృత భావనను ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు ద్వారా కొన్ని నిబంధనలు, సంస్కరణ చర్యలను ప్రవేశపెట్టామని, వర్షాకాల సమావేశాల్లో ఇవి చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించడం ద్వారా భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక బిల్లు వివిధ నిబంధనలను హేతుబద్ధీకరిస్తుంది. వీటిలో పన్ను మినహాయించబడిన మూలం(టీడీఎస్), పన్ను సేకరించిన మూలం(టీసీఎస్) నిబంధనలపై పరిమితులను తగ్గించడం వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..
విలీన కాలాన్ని ఐదేళ్లు పొడిగించడం వల్ల స్టార్టప్‌లు కూడా ప్రయోజనం పొందుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. విలీన కాలం అనేది ఒక కంపెనీ అధికారికంగా స్థాపించబడి చట్టబద్ధ సంస్థగా నమోదు చేసేందుకు పట్టే సమయాన్ని సూచిస్తుంది. ఫైనాన్స్ బిల్లు 2025 సవరణలలో భాగంగా ఆన్‌లైన్ ప్రకటనలపై 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కస్టమ్ డ్యూటీ నిర్మాణాల హేతుబద్ధీకరణ, కోతలను ఆమె పునరుద్ఘాటించారు. కస్టమ్స్ హేతుబద్ధీకరణ వల్ల దిగుమతిదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment