ఇక బంకుల్లో వంట గ్యాస్
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల్లో వంట గ్యాస్ సిలిండర్ల (ఎల్పీజీ) విక్రయం ఇకపై దేశవ్యాప్తం కానుంది. ఐదు మెట్రో నగరాల్లో చమురు సంస్థల యాజమాన్యంలోని బంకుల్లో అక్టోబర్ 5 నుంచిప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను దేశవ్యాప్తంగా చమురు సంస్థల యాజమాన్యంలోని దాదాపు 1,440 పెట్రోల్ బంకులన్నింట్లోనూ విక్రయించేందుకు అనుమతిస్తూ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత భద్రతా ప్రమాణాలున్న ఇతర బంకులను కూడా సిలిండర్లను విక్రయానికి అనుమతించే అవకాశముందని పెట్రోలియం శాఖ పేర్కొంది.
ఇవి మార్కెట్ ధరకు (అంటే సబ్సిడీ ధరకు రెట్టింపుకు కాస్త ఎక్కువగా) అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కొనుగోలుదారు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీవో ఉద్యోగుల వంటివారికి దీనితో బాగా లబ్ధి చేకూరనుంది. 5 కేజీ ఎల్పీజీ సిలిండర్ మొదటిసారి కొనుగోలు చేసేందుకు రూ.1,000, రెగ్యులేటర్‌కు రూ.250 (పన్నులు అదనం) ఖర్చవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలును ప్రస్తుతానికి నిలిపేశారు.