గ్యాస్ ధర పెరిగితేనే మంచిది: వీరప్పమొయిలీ
కడుపు కాలడమే మంచిది... సంపాదించడం ఎలాగో తెలుస్తుంది అన్నాడట వెనకటికెవడో. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్లకు గ్యాస్ ధరలను సవరించిన సందర్భంగా మొయిలీ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ''మీరు గ్యాస్ ధరలు పెంచకపోతే, స్వదేశీ ఉత్పత్తి పెరగదు. దిగుమతులు పెరిగిపోతూనే ఉంటాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్కు 4.2 డాలర్ల చొప్పున చెల్లిస్తుండగా దాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర 2014 ఏప్రిల్ నుంచి అమలుకానుంది. ఇదే ధరను కేజీ బేసిన్లోని కేజీ-డి6 చమురు క్షేత్రాల్లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్కు కూడా కేబినెట్ ఆమోదించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మొయిలీ పై విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.