Gas Price
-
పండుగ పూట మరో మంట! మొన్న నూనె.. ఇవాళ..
పండుగల పూట.. మొన్న నూనె.. ఇవాళ మరో మంట -
పాలిటికల్ గ్యాస్ స్ట్రాటజీ
-
రేపో, ఎల్లుండో పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపు
సాక్షి, సిద్దిపేట: ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన రాష్ట్రాన్ని పొరపాటున కాంగ్రెస్ చేతిలో పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమ ర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. సోమ వారం సిద్దిపేట బస్టాండ్‌లో బీపీ చెకప్ కేంద్రం, స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపుపై రేపో, ఎల్లుండో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారన్నారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని... ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లే వారని... ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. వీవోలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని... ఉద్యోగస్తులతోపాటు వారికి కూడా పీఆర్సీ వర్తింపజేశామన్నారు. ‘దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చుస్తోంది.. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు, బీమా, ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో మహిళా భవనం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ నుంచి తగ్గనున్న రిలయన్స్ గ్యాస్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు గత ఏడాదికాలంగా నెమ్మదించిన నేపథ్యంలో దేశీయంగా సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు రేటు కూడా వచ్చే నెల నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 12.12 డాలర్లుగా ఉన్న సంక్లిష్ట క్షేత్రాల గ్యాస్ రేటును ప్రభుత్వం 10.4 డాలర్లకు తగ్గించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం కేజీ–డీ6 క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే గ్యాస్ ధర సుమారు 14 శాతం తగ్గవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలను కేంద్రం ఏటా రెండుసార్లు (ఏప్రిల్ 1న ఒకసారి, అక్టోబర్ 1న మరోసారి) సవరిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా మొదలైన వాటికి కేటాయించిన పాత క్షేత్రాలకు, రిలయన్స్ వంటి సంస్థలకు కేటాయించిన కొత్త క్షేత్రాలకు వేర్వేరు ఫార్ములాలను వర్తింపచేస్తుంది. -
గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్‌ల లెగసీ నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్‌కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్‌ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. -
ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి. నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. -
ఓఎన్జీసీ గ్యాస్‌పై ధరల పరిమితి
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల పరిమితిని తేల్చేందుకు ఏర్పాటైన కిరీట్ పారిఖ్ కమిటీ తన సిఫారసులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వరంగ సంస్థల పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజవాయువుపై ధరల పరిమితిని సూచించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీనివల్ల సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఉత్పత్తి పరంగా క్లిష్టమైన క్షేత్రాల విషయంలో ఎటువంటి మార్పుల్లేకుండా ప్రస్తుత ధరల విధానానికే మొగ్గు చూపించనుంది. అంతిమంగా వినియోగదారుడికి సహేతుక ధర ఉండేలా సిఫారసులు ఇవ్వాలని ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరడం గమనార్హం. పాత కాలం నాటి గ్యాస్ క్షేత్రాలను ఎక్కువగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించి వ్యయాలను ఇప్పటికే ఈ సంస్థలు రికవరీ చేసుకుని ఉంటాయన్న ఉద్దేశ్యంతో ధరల పరిమితికి కమిటీ మొగ్గు చూపించనుంది. అలాగే, కిరీట్ పారిఖ్ కమిటీ కనీస ధర, గరిష్ట ధరలను కూడా సిఫారసు చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా ధరలు ఉత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోకుండా చూడొచ్చన్నది ఉద్దేశ్యంగా ఉంది. గ్యాస్ ధరలు సుమారు 70 శాతం మేర పెరిగి మిలియన్ బ్రిటిష్ ధర్మ యూనిట్‌కు 8.57 డాలర్లకు చేరడం తెలిసిందే. -
కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.102 పెంపా?
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ధరల పెంపుగా ఆమె అభివర్ణించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుందని, మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీని భరించాల్సిన కేంద్రం, సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. ప్రజలు దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడేలా నిత్యావసరాల ధరలు పెరిగాయని కవిత అన్నారు. -
తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195
కొలంబో: ఏడాది కాలంగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు మీద శ్రీలంక ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడమే దీనికి ప్రధాన కారణం. గత శుక్రవారం వంట గ్యాస్ సిలిండర్ (12.5 కేజీలు) ధర రూ.1,400 ఉండగా ప్రస్తుతం రూ. 1,257 పెరిగి రూ. 2,657కు చేరుకుంది. ఒక కిలో పాలపొడి ధర వారం క్రితం రూ.250కాగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత గురువారం దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా నిత్యావసరాల సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చదవండి: (బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!) ఈ పరిస్థితికి కారణం ఏంటంటే.. ప్రభుత్వం నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. చదవండి: (వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు) -
ఇక పెయింట్లు, టైల్స్ బౌన్స్‌బ్యాక్!
కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఇటీవల హౌసింగ్ రంగం జోరందుకుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవాలన్న తపనకుతోడు.. కొన్నేళ్ల కనిష్టాలకు చేరిన వడ్డీ రేట్లు హౌసింగ్ రంగానికి బూస్ట్‌నిస్తున్నాయి. మరోపక్క పలు రంగాలు ఆన్లైన్ సేవలవైపు మళ్లడంతో ఐటీ, ఈకామర్స్ తదితర రంగాలు సైతం దూకుడు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై వాణిజ్య సముదాయాలకూ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలకు అవకాశాలను పెంచే వీలున్నట్లు చెబుతున్నారు. ముంబై: కరోనా మహమ్మారి పంజా విసరడంతో గత ఆర్థిక సంవత్సరం (2021–22) పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్త లాక్డౌన్లు, సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలసకూలీలు, నిలిచిపోయిన నిర్మాణం, ఉత్పత్తి తదితరాలు ప్రభావం చూపాయి. వీటికితోడు ముడివ్యయాలు పెరిగిపోయాయి. పెయింట్స్ పరిశ్రమలో ప్రధానంగా ముడిచమురు నుంచి లభించే ఉపఉత్పత్తులు(డెరివేటివ్స్) ముడిసరుకుగా వినియోగితమవుతుంటాయి. గ్యాస్ ధరలు బలపడటంతో సిరామిక్ టైల్స్ తయారీ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ఆధారిత ప్రొడక్టులు, వాటర్ ప్రూఫింగ్ తదితరాలను ప్రవేశపెట్టడం ద్వారా పెయింట్ల పరిశ్రమ రికవరీ బాట పట్టింది. సంఘటిత రంగంలోని లిస్టెడ్ కంపెనీలు ఇందుకు దారి చూపాయి. లీడింగ్ సిరామిక్ టైల్స్ కంపెనీలు సైతం పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ప్రొడక్టులను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే బాట పట్టాయి. వీటికి ఎగుమతి ఆర్డర్లు దన్నునిస్తున్నాయి. అధిక గ్యాస్ ధరలు అసంఘటిత రంగ కంపెనీలకు సవాళ్లు విసరడం వీటికి కలసి వస్తోంది. టైల్స్ తయారీ దిగ్గజాలు ఫాసెట్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ తదితర విభాగాలలోకి ప్రవేశించడం ద్వారా మరింత బలపడుతున్నాయి. ధరల పెంపు..: మార్జిన్లపై ఒత్తిళ్ల నేపథ్యంలో పలు కంపెనీలు కొంతకాలంగా ఉత్పత్తులకు ధరలు పెంచుతూ వస్తున్నాయి. గతేడాది కొద్ది నెలలపాటు ఉత్పత్తి నిలిచిపోవడం, అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల పెంటప్ డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా అమ్మకాల పరిమాణం పుంజుకోనుంది. అయితే దీర్ఘకాలానికి అందుబాటు ధరల్లో గృహ సముదాయాలపై ప్రభుత్వ విధానాలు, పట్టణీకరణ, పుంజుకుంటున్న గ్రామీణ ఆదాయాలు రియల్టీ రంగ వృద్ధికి దోహదపడనున్నాయి. మరోపక్క పారిశ్రామిక రంగ రికవరీ సైతం పెయింట్స్ పరిశ్రమకు ఆశలు కల్పిస్తోంది. ఆటో రంగం జోరందుకుంటే పెయింట్ పరిశ్రమ మరింత కళకళలాడేందుకు అవకాశముంటుంది. వెరసి రెండేళ్ల మందగమనం తదుపరి పెయింట్ కంపెనీలు భారీ లాభాల రంగులను అద్దుకునే వీలుంది. వృద్ధి అంచనాలు సిరామిక్ టైల్స్ వినియోగం ఊపందుకుంటున్న నేపథ్యంలో 2027కల్లా పరిశ్రమ రెట్టింపునకు జంప్చేయవచ్చని అంచనా. వెరసి లిస్టెడ్ కంపెనీల టర్నోవర్ ఐదారేళ్లలో రెట్టింపయ్యే అవకాశముంది. టైల్స్ పరిశ్రమ విలువ 2019లో 3.7 బిలియన్ డాలర్లు(రూ. 27,500 కోట్లు)గా నమోదైంది. వార్షికంగా 8.6 శాతం వృద్ధి నమోదైతే 2027కల్లా 7.14 బిలియన్ డాలర్ల(రూ. 53,120 కోట్లు)కు చేరుకునే వీలుంది. ఇక పెయింట్ల మార్కెట్ విలువ రూ. 50,000 కోట్లుకాగా.. రెండు, మూడేళ్లపాటు డిమాండ్ కొనసాగవచ్చని అంచనా. దీంతో భారీ సామర్థ్య వినియోగానికి మార్గమేర్పడనుంది. పలు అవకాశాలు పెయింట్స్ పరిశ్రమలో లిస్టెడ్ దిగ్గజాలు ఏషియన్ పెయింట్స్‌సహా, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్‌కు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ కౌంటర్లపట్ల నిపుణులు ఆశావహంగా స్పందిస్తున్నారు. గత మూడు నెలల్లో ఏషియన్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ 13% లాభపడ్డాయి. ఇక సిరామిక్ టైల్స్ విభాగంలో కజారియా, సెరా, హింద్ శానిటరీవేర్, సొమానీ సిరామిక్స్ తదితరాలు పెంటప్ డిమాండ్ నుంచి లబ్ధి పొందనున్నాయి. గత మూడు నెలల్లో కజారియా 25 శాతం జంప్‌చేయగా.. సొమానీ 24 శాతం ఎగసింది. -
మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరికి..
ముంబై సెంట్రల్: కరోనా ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయగా మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయి. దీంతో అనేక కుటుంబాల ఆర్థిక స్థితి దయనీయంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది రూ.640గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఈ ఏడాది జూలైలో రూ. 886.50గా ఉంది. 2014లో సిలిండర్ ధర రూ.410 ఉండగా ఏడేళ్లలో అదే సిలిండర్ ధర రెట్టింపవడం గమనార్హం. సిలిండర్ ధరల్ని భరించలేక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు తిరిగి కట్టెలు, బొగ్గులతో మండే పొయ్యిల వైపు మళ్లుతున్నారు. మహిళలు జీవితాంతం కట్టెల పొయ్యిలతో, పొగతో గడిపి, కొంత కాలం నుంచి గ్యాస్ సిలిండర్లపై వంటలు చేస్తూ కాస్త ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా వల్ల ఉపాధి పోగొట్టుకోవడం వల్ల సిలిండర్లు వాడే స్థోమత లేకుండా పోయింది. అందుకే మళ్లీ మేం కట్టెలు, బొగ్గులతో వంటిల్లును నడిపిస్తున్నామని ఓ మహిళా సంఘం సభ్యురాలు రుక్మిణి నాగ్పురే వాపోయారు. ఎట్లా బతికేది..? కరోనా వల్ల మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఒకవైపు లాక్డౌన్ వల్ల ఆర్థిక ఆదాయం తగ్గడం, మరోవైపు ధరలు పెరగడం, అత్యవసరమైన గ్యాస్ ధరలు కూడా పెంచడం వల్ల పలు కుటుంబాలు తిరోగమ న బాట పట్టి మట్టి పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రభుత్వం కనీసం గ్యాస్ సిలిండర్ ధరలపై కూడా దయ చూపకపోవడం వల్ల జీవితాలు నిత్యం కాలుతున్న కుంపటిలా తయారయ్యాయని హాత్కణంగ్లే తాలూకా హెర్లే గ్రామానికి చెందిన ఊర్మిళా కుర్ణే ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిన్నర నుంచి కుటుంబ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని చేసేందుకు పనే లేకుంటే డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయని కరాడ్‌కు చెందిన ప్రతిజ్ఞా పవార్ అన్నారు. కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయ ని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నచిన్న పనులు చేసుకొని బతుకుదామంటే వంట నూనె, పప్పులు, గ్యాస్ ధరలన్నీ బాగా పెరిగిపోవడంతో జీవితాలు ఘోరంగా తయారయ్యాయని, ఎట్లా బతికేదని బోరుమన్నారు. ఇంత కాలం గ్యాస్‌పై వండుకున్నామని, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యే శరణ్యమైందని ప్రతిజ్ఞా పవార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. బుల్డాణాకు చెందిన మహిళా మండలి ప్రతినిధి ఉషా నర్వాడే మాట్లాడుతూ.. ‘‘ఇంతకాలం మహిళల ఆరోగ్యం బాగుండాలని గ్యాస్ సిలిండర్లు వాడాలని మేం చెబుతూ వచ్చాం. కానీ, ఇప్పుడు చేసేందుకు పను లు లేవు. ఇంటికి చిల్లిగవ్వ రావడం లేదు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల కట్టెల పొయ్యిలే ఇప్పుడు దిక్కయ్యాయి. మళ్లీ కష్టాల రోజులు వచ్చాయి’’ అంటూ బాధపడ్డారు. -
దిగొచ్చిన గ్యాస్ ధర..!
సాక్షి, నాగారం (నల్గొండ) : పేద, సామన్య ప్రజలకు ఊరట. లాక్డౌన్ కారణంగా అధిక ధరలతో అవస్థలు పడుతున్న ప్రజలకు వంట గ్యాస్ ధర తగ్గడంతో కాస్త ఉపశమనం లభించింది. వంట గ్యాస్ ధరలు తగ్గడంతో జిల్లాలో 3,24,567 మందికి ప్రయోజనం చేకూరనుంది. తగ్గిన వంట గ్యాస్ ధరలు మే నెల నుంచే అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ నెలలో గృహ అవసరాల సిలిండర్ ధర రూ.818 ఉండగా ప్రస్తు తం రూ.214లు తగ్గి రూ.604లకు లభిస్తోంది. గతంలో కమర్షియల్ సిలిండర్ (నాన్‌డొమెస్టిక్) ధర రూ. 1,495 ఉండగా రూ.101 తగ్గి ఇప్పుడు రూ.1,394కు లభిస్తోంది. లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో గ్యాస్ ధరలు దిగొచ్చాయి. గ్యాస్ ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 3,24,567 గ్యాస్కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్ 1,90,508, డబుల్ సిలిండర్ 50,532, దీపం పథకం11,576, కార్పొరేషన్ రెస్పాన్స్‌బులిటి (సీఎస్ఆర్) 61,369, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 10,582 ఉన్నాయి. చార్జీల పేరిట దోపిడీ.... గ్యాస్ఏజన్సీల నిర్వాహకులు రవాణా చార్జీల పెరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 25 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలు ప్రతినెలా వినియోదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రవాణా చార్జీల పేరుతో ఒక్కోగ్యాస్ సిలిండర్‌పై అదనంగా రూ.30నుంచి రూ.60వరకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. గ్యాస్ ధర తగ్గింపుతో ఊరట కరోనా లాక్‌డౌన్‌తో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.214లు తగ్గించడంతో పేదలకు ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను తగ్గించడం పట్ల ఆనందంగా ఉంది. –మల్లెపాక వెంకన్న, ఆటోడ్రైవర్, లక్ష్మాపురం గ్యాస్‌రేటు తగ్గడం హర్షణీయం లాక్డౌన్ కారణంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు తగ్గించడం సామాన్యులకు ఎంతో మేలు. వంట గ్యాస్ ధరలు తగ్గించడం హర్షణీయం. –మామిడి ధనమ్మ, గృహిణి, పసునూర్ ఈనెల నుంచే అమలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. ఈ రేట్లు ఈనెల–1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. రూ.604లకే 14కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు లభిస్తోంది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా వస్తుంది. –విజయలక్ష్మి, డీఎస్ఓ, సూర్యాపేట -
గ్యాస్ ధరపై న్యాయపోరాట విరమణ!
రిలయన్స్, బీపీ నిర్ణయం న్యూఢిల్లీ: గ్యాస్ ధర సమీక్ష, నిర్ణయం అంశాలు ఆలస్యం అవుతుండడాన్ని సవాలుచేస్తూ, ప్రారంభించిన న్యాయపోరాటం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ– బ్రిటిష్ భాగస్వామి బీపీలు వెనక్కు తగ్గాయి. మూడేళ్ల క్రితం ఆయా అంశాలను సవాలు చేస్తూ, రెండు సంస్థలూ ఆర్బిటేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. రిలయన్స్ చీఫ్ ముఖేశ్ అంబానీ, బీపీ సీఈఓ బోబ్ డూడ్లేలు ఈ నెల 15 ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇంతక్రితమే రెండు సంస్థలూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ముందు తమ పిటిషన్ ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ వచ్చే కొద్ది వారాల్లో పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. ఫలితం ఇదీ... ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత రోజు ముఖేశ్ అంబానీ, బోబ్ డూడ్లేలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధి సముద్ర గర్భంలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాల అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. తాజా ఆర్బిట్రేషన్ ప్రక్రియ విరమణ వల్ల ఆయా కొత్త క్షేత్రాల నుంచి తాము ఉత్పత్తి చేసిన సహజ వాయువు గ్యాస్‌పై మార్కెటింగ్, ప్రైసింగ్ స్వేచ్ఛకు రెండు కంపెనీలకు వీలు కలుగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2015 జనవరిలో ఒకసారి మోడీతో బీపీ సీఈఓ సమాశమయ్యారు. సముద్ర గర్భం వంటి క్లిష్ట ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్యాస్ క్షేత్రాలకు గ్యాస్ ప్రైస్ ప్రీమియంను కొనసాగించాలని కోరారు. లేకపోతే తమ పెట్టుబడుల విషయలో పునఃసమీక్ష పరిస్థితి ఏర్పడుతుందనీ వివరించారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వ గ్యాస్ ధర విధానంపై ఎటువంటి న్యాయ పోరాటాన్నీ కొనసాగించరాదని ప్రభుత్వం షరతు పెట్టిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికి న్యాయపోరాటం ఉపసంహరణపై రెండు సంస్థల మధ్యా ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం. -
ఎరువుల ప్లాంట్లు అన్నిటికీ ఒకే స్థాయి గ్యాస్ ధర!
న్యూఢిల్లీ: ఎరువుల ప్లాంట్లన్నింటికీ ఒకే రేటుపై, అందుబాటు ధరలో గ్యాస్‌ను అందించే దిశగా కేంద్ర చమురు శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దేశీ సహజ వాయువు, దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రేట్ల సగటు ఆధారంగా గ్యాస్ ధరను నిర్ణయించాలని (పూలింగ్) ప్రతిపాదించింది. ఇందుకోసం గాను ఎరువుల ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీపై కస్టమ్స్ సుంకాన్ని, సర్వీస్ ట్యాక్స్ మొదలైన వాటి నుంచి మినహాయింపునివ్వాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని చమురు శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధర యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉంది. దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ధరలో ఇది మూడో వంతు స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఎరువుల ప్లాంట్లు ఉండగా.. వీటిలో 27 గ్యాస్ ఆధారితమైనవి, మూడూ నాఫ్తా ఆధారంగా పనిచేసేవి. దేశీయంగా ఏటా 30 మిలియన్ టన్నుల మేర యూరియా వినియోగమవుతుండగా 23 మిలియన్ టన్నుల దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. -
వచ్చేనెల నుంచే నగదు బదిలీ!
మెదక్ రూరల్: జిల్లాలో నగదు బదిలీ పథకం మళ్లీ అమలుకాబోతోంది. కాంగ్రెస్ హయాంలో అమల్లోకొచ్చిన ఈ పథకం ఆ తర్వాత పలు కారణాలతో నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న సర్కార్ తిరిగి ఈ పథకాన్ని జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సిద్ధమైంది. అధికారిక లెక్కల ప్రకారం..జిల్లాలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ కంపెనీల పరిధిలో 3,39,742 కనె క్షన్లుండగా, దీపం పథకానికి సంబంధించిన మరో 1,75,391 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 5,15,133 కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులూ తప్పకుండా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అంతా పారదర్శకత మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే గ్యాస్ వినియోగదారుడు అంతమొత్తాన్ని గ్యాస్ డీలర్‌కు చెల్లించి గ్యాస్‌బండను పొందాల్సి ఉంటుంది. ఇలా గ్యాస్‌ను పొందిన వినియోగదారుల జాబితాను సదరు గ్యాస్ డీలర్ సర్కార్‌కు పంపితే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుంది. గ్యాస్‌బుకింగ్, డెలివరీ, సబ్సిడీ మొత్తం జమ అంతా ఆన్లైన్లో జరగడంతో అక్రమాలకు అవకాశం ఉండదని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిలో సగం మంది కూడా గ్యాస్‌ను వాడడం లేదని, అయినప్పటికీ వారిపేరు మీద కొందరు డీలర్లు, ఇతరులు గ్యాస్‌ను బుక్ చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే సర్కార్ ప్రతి వినియోగదారుడూ తన ఆధార్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఖాతా ప్రతిని గ్యాస్ డీలర్‌కు ఇవ్వాలని చెబుతోంది. అప్పుడు ఎవరైనా వినియోగదారునికి తెలియకుండా గ్యాస్ బుక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని, అందువల్ల అక్రమాలకు తావే ఉండదని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులంతా గ్యాస్‌కు పూర్తి డబ్బులను చెల్లించాల్సి ఉంటుందని పదే, పదే లబ్ధిదారుల ఫోన్లకు గ్యాస్ ఏజెంట్లు సంక్షిప్త సమాచారాన్ని పంపుతున్నారు. దూరాన్ని బట్టి ధర ప్రసుత్తం గ్యాస్ ధరను దూరాన్నిబట్టి రవాణా ఖర్చులను కలుపుకుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం మెదక్‌లో సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.451 నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో జమ అవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది. -
పండుగ తర్వాత పసిడి పైపైకి!
పుత్తడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు...? దీపావళి తర్వాత పరిశీలిస్తామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: దీపావళి తర్వాత పసిడి ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుత్తడి దిగుమతులతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో దీపావళి తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, ఇవి ఏవిధంగా ఉండవచ్చన్నది చెప్పకుండా ఆయన దాటవేశారు. పసిడి దిగుమతులపై ఆంక్షలు మళ్లీ విధిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘పండుగ సీజన్ అయిపోనివ్వండి. తర్వాత చూడాల్సి ఉంటుంది’ అని జైట్లీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 682.5 మిలియన్ డాలర్లుగా ఉన్న పుత్తడి దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా 3.75 బిలియన్ డాలర్లకు ఎగిసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012-13లో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) రికార్డు స్థాయిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతానికి ఎగియడంతో అప్పట్లో పసిడి దిగుమతులపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ సుంకాన్ని 10 % పెంచడం, బంగారు నాణేలు మొదలైన వాటి దిగుమతిపై నిషేధం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. మరోవైపు, పసిడి దిగుమతుల మీద ఆంక్షల విధింపు అంశం గురించి చర్చించేందుకు దీపావళి తర్వాత ఆర్బీఐ అధికారులు, బులియన్ పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ సమావేశం కానున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశీ బులియన్ సంస్థల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రీమియం, స్టార్ ట్రేడింగ్ కంపెనీలు పసిడి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించే అంశాన్ని సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ కసరత్తులో ప్రభుత్వం.. ప్రస్తుతం ఆర్థిక శాఖ బడ్జెట్ తయారీలో నిమగ్నమైందని జైట్లీ చెప్పారు. క్రితంసారి తమకు కేవలం 40 రోజులు మాత్రమే లభించగా.. ఈసారి దాదాపు 5 నెలల సమయం లభించిందని చెప్పారు. రాబోయే మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక, ఆటోమొబైల్ రంగానికి ఇచ్చిన రాయితీల గడువు డిసెంబర్‌తో ముగిసిపోనున్న నేపథ్యంలో వీటిని పొడిగించే అంశంపై స్పందిస్తూ ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ చెప్పారు. పెంచిన గ్యాస్ ధరలతో కంపెనీలు లాభాలు మాత్రమే గడించేందుకు ఆస్కారం ఉంటుందే తప్ప అనూహ్య లాభాలు పొందే వీలు ఉండదన్నారు. చమురు, గ్యాస్ కంపెనీలు.. అటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. యూనిట్‌కు (ఎంబీటీయూ) 5.61 డాలర్ల రేటుతో సైతం కంపెనీలకు లాభాలు ఉండగలవన్నారు. -
ముందే వచ్చిన దీపావళి
* సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ * 26,430 వద్ద ముగింపు * మోదీ విజయాల ర్యాలీ * నిఫ్టీ 100 పాయింట్లు ప్లస్ డీజిల్‌పై నియంత్రణలు ఎత్తివేయడం, గ్యాస్ ధర పెంపు వంటి సంస్కరణలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీనికితోడు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. వెరసి రెండు రోజుల ముందే స్టాక్ మార్కెట్లలో లాభాల దీపావళి మెరిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీల ద్వారా బలం పెరగడంతో ఒక్కసారిగా మార్కెట్లలో పరిస్థితులు మెరుగయ్యాయ్. మోదీ అధ్యక్షతన పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. ఇప్పటికే డీజిల్‌ను డీరెగ్యులేట్ చేయడం ఇందుకు సహకరించింది. దీంతో ఉదయం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లుపైగా ఎగసింది. ఆపై 26,518 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 321 పాయింట్ల లాభంతో 26,430 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా సెంచరీ కొట్టి(100 పాయింట్లు ప్లస్) 7,879 వద్ద స్థిరపడింది. మరిన్ని విశేషాలివీ... * బీఎస్ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయ్. ప్రధానంగా ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 2% స్థాయిలో పుంజుకున్నాయి. * డీజిల్ ధరల డీరెగ్యులేషన్, గ్యాస్ ధర పెంపు నేపథ్యంలో ఆయిల్ షేర్లు హెచ్‌పీసీఎల్ 7.3% ఎగసింది. ఈ బాటలో ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఐవోసీ, పెట్రోనెట్, గెయిల్ 5.5-2.5% మధ్య పురోగమించాయి. * పండుగల సీజన్ కారణంగా ఆటో షేర్లు టీవీఎస్, టాటా మోటార్స్, మదర్సన్సుమీ, ఐషర్ మోటార్స్, మారుతీ, హీరోమోటో 7-2% మధ్య బలపడ్డాయి. * బ్యాంకింగ్ షేర్లలో పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఫెడరల్, యస్ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు షేర్లు ఏబీబీ, సీమెన్స్, హావెల్స్తోపాటు, బ్లూస్టార్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 4-2.5% మధ్య ఎగశాయి. * మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్అండ్టీ, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, సెసాస్టెరిలైట్ 3-2% మధ్య పుంజుకున్నాయి. * ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ 1.5-1% మధ్య నష్టపోయాయి. * ఇటీవల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్ఐఐలు మళ్లీ రూ. 1,040 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. * మిడ్ క్యాప్ షేర్లలో టొరంట్ పవర్, టీబీజెడ్, సింఫనీ, ఎస్కేఎస్, జిందాల్ సా, యునెటైడ్ స్పిరిట్స్, పీవీఆర్ 13-6% మధ్య జంప్‌చేశాయి. -
గ్యాస్ ధరలపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి(కేజీ) బేసిన్ నుంచి లభించే గ్యాస్‌కు ధరను నిర్ణయించడంలో ప్రణాళికలేమిటన్నది వివరించాల్సిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఈ విషయంలో గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలను అవలంబించనున్నారా లేక వీటిపై వాదనలకు తెరలేపనున్నారా అంటూ ప్రశ్నించింది. ఇదీ కాకుంటే ఇతర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా అన్న విషయాలను తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితిని వెల్లడించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. గ్యాస్ ధరల అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. గ్యాస్ ధరను రెట్టింపు చేయడంపై సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తాతోపాటు, ఎన్జీవో కామన్‌కాజ్ అనే సంస్థ 2013లో ప్రజోపయోగ వ్యాజ్యాన్ని(పీఐఎల్) దాఖలు చేశాయి. -
సహజవాయువు ధర పెంపు 50 శాతమే!
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల కొత్త విధానంపై ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నివేదికలో గ్యాస్ ధరను 50%మేర పెంచేందుకు వీలుగా సూచనలు చేసినట్లు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్యాస్ ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 8.4 డాలర్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో వెలువడ్డ నోటిఫికేషన్‌ను సవరించేందుకు ప్రభుత్వం గత నెలలో ఒక కమిటీని నియమించింది. దీనిలో ఆయిల్ శాఖలోని అదనపు కార్యదర్శితోపాటు విద్యుత్, ఎరువులు, వ్యయ కార్యకలాపాల కార్యదర్శులుసభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయిల్ శాఖ సమీక్షించాక క్యాబినెట్‌కు పంపనున్నట్లు ప్రభుత్వాధికారి చెప్పారు. నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, గ్యాస్ ధరను రెట్టింపు చేయకుండా 50% వరకూ పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం ఒక ఎంబీటీయూకి 4.2 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్‌కు సరఫరాకు మధ్య సమతుల్యాన్ని సాధించేలా కార్యదర్శుల కమిటీ గ్యాస్ ధరపై విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ రకాల క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై వ్యయాలనూ, విద్యుత్, ఎరువుల పరిశ్రమల డిమాండ్‌నూ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరికల్లా గ్యాస్ ధరను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గ్యాస్ ధరను ఒక ఎంబీటీయూకి 2 డాలర్ల చొప్పున పెంచితే యూరియా, విద్యుత్, సీఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వానికి మాత్రం పన్నులు, రాయల్టీ రూపంలో రూ.12,900 కోట్లు అదనంగా లభిస్తాయి. -
ఇంటి బడ్జెట్‌ను పెంచనున్న మోడీ ప్రభుత్వం
ఢిల్లీ: రైలు చార్జీలు పెంచిన ఎన్డిఏ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి బడ్జెట్‌ను పెంచనుంది. ఈ విషయంలో కేంద్రం పేదలను కూడా వదిలి పెట్టడంలేదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు వారు ఉపయోగించే వంట గ్యాస్ ధరలతోపాటు పేదలు ఉపయోగించే కిరోసిన్ ధరను కూడా పెంచే యోచనలో కేంద్రం ఉంది. కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వంట గ్యాస్‌కు సిలిండర్‌పై 5 రూపాయలు, కిరోసిన్‌పై లీటర్‌కు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉంది. దీంతో అన్ని వర్గాల ఇంటి బడ్జెట్ పెరిగిపోతుంది. -
జనం నెత్తినగ్యాస్‘బండ’
డెలివరీ పేరుతో అక్రమ వసూలు మొక్కుబడి జీతాలతో అక్రమాలకు ఆజ్యం పోస్తున్న కంపెనీలు లబోదిబోమంటున్న వినియోగదారులు నెలకు సగటున రూ.12 లక్షలు మింగేస్తున్న తీరు గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటికి గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలంతో పాటు, పెదపారుపూడి, నందివాడ, ముదినేపల్లి, ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రెండువేల గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1213 కాగా గుడివాడ పట్టణంలో డెలివరీ చేసినందుకు రూ.20 నుంచి రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం అయితే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పేరుతో నెలకు దాదాపు రూ.12 లక్షలకు పైగా వినియోగదారుల నెత్తినఅక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇవీ.. గ్యాస్ ఏజెన్సీలకు కంపెనీ నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.50 వరకు కమీషన్‌గా వస్తుంది. గ్యాస్ ఏజెన్సీ ఉన్న గుడివాడ పట్టణంలో డెలివరీకి ఎటువంటి చార్జీలూ వసూలు చేయకూడదు. గుడివాడ దాటి ఇతర గ్రామాల్లో సరఫరా చేసినందుకు ఒక్కో సిలిండర్‌కు రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ గుడివాడ పట్టణంలో ప్రస్తుతం గ్యాస్ ధరను బట్టి రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో సిలిండర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గ్యాస్ సిలెండర్ సరఫరా చేసే రిక్షా, ఆటో డ్రైవర్ తీసుకుంటాడు. డెలివరీ బాయిస్‌కు ఇచ్చే జీతం రూ.500లే.. ఈ విషయమై ‘సాక్షి’ పరిశీలన జరుపగా సిలిండర్ల సరఫరా కోసం గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులుగా పెట్టుకుంటుంది. వీరికి నిబంధనల ప్రకారం జీతం ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీకి గ్యాస్ కంపెనీ ఇచ్చే కమీషన్లోనే వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే గ్యాస్ సరఫరా చేసే వారికి ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే జీతం చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ఏలూరు రోడ్డులో ఉన్న ఒక ఏజెన్సీ డెలివరీ బాయిస్‌కు నెలకు రూ.500 ఇస్తుండగా మరో ఏజెన్సీ రూ.700 ఇస్తుంది. వీరందరినీ వినియోగ దారుల వద్ద అక్రమ వసూళ్లుచేసి బతకమని చెప్పేందుకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ ధరలు భరించలేని వినియోగ దారులు ఈ అక్రమ వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై గుడివాడ పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ గంధం డేవిడ్‌రాజును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ చేయాల్సింది ఇదీ... గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు తీసుకొచ్చే డెలివరీ బాయ్ దానితో పాటు కంపెనీ బిల్లును ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల లోపు డెలివరీ ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి సర్వీసు చార్జీ తీసుకోరాదు. గ్యాస్ సిలిండర్ వినియోగదారుడికి ఇచ్చేముందు దాని బరువు (తూకం) చూపించి ఇవ్వాలి. కానీ గ్యాస్ సిలిండర్లను తూకం వేసేందుకు డెలివరీ బాయిస్ వద్ద బరువు తూచే యంత్రాలు ఉండవు. గ్యాస్ సిలిండరును వినియోగదారు ఇంట్లో రెగ్యులేటర్‌కు బిగించి పొయ్యి వెలిగించి చూపించాలి. కానీ ఎక్కడా ఇటువంటి సేవలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వినియోగదారుల వద్ద డెలివరీ చార్జీల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్నారు. -
పండగ వేళ వండేదెలా!
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పండగ ముందు వంట కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు గ్యాస్ ధర పెరుగుతూంటే మరోవైపు దాన్ని తెచ్చుకునేందుకు సవాలక్ష కష్టాలు పడాల్సి వస్తోంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ సిబ్బందిని వేడుకుంటున్నా గ్యాస్ బండ ఇంటికి చేరడం లేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తున్నాం అని చెబుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు. గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలన్నీ ఆధార్ లింకేజ్ ఫారాల (కెవైసి) నింపే పనిలోను, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించే పనిలో మునిగిపోయారు. ఆధార్ లింకేజీతో బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నమోదు కాలేదనే ఫిర్యాదులను స్వీకరించడంతోనే సరిపోతోంది. దీంతో వినియోగదారులకు నిర్ణీత వ్యవధిలో గ్యాస్ అందటం లేదు. ఆధార్‌తో ప్రభుత్వ పథకాల లబ్ధికి లింక్ పెట్టొదని సుప్రీంకోర్టు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం, ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. ఏ నెలకు ఆ నెల ఆఖరంటూ చెబుతుండడంతో వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఆధార్‌తో కూడిన బ్యాంక్ ఖాతాలకు, సబ్సిడీ జమవుతున్న ఖాతాకు పొంతన కుదరకపోవడంతో వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలుండగా సుమారు 80 వేల డొమెస్టిక్, 500 పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. 50 శాతం వరకే ఆధార్ ఫారాల నమోదు జరిగింది. ఆధార్ ఉన్న వారు రూ.1310లు చెల్లిస్తే, ఆధార్ లేనివారు రూ.435లు చెల్లించి చక్కగా గ్యాస్ బండ తెచ్చుకుంటున్నారు. ఆధార్ ఉన్న వారికి రూ.50లు అదనంగా భారం మోపుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు 20 రోజులు దాటినా రాకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గ్యాస్ ఉన్న వారికి ఎలాగూ కిరోసిన్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ వేళ గ్యాస్ కష్టాలెలా తీరతాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: పెంచిన వం ట గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గిం చాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌లో ఆందోళన నిర్వహించా రు. ఖాళీ సిలిండర్‌తో ఆర్డీవో కార్యాల యం గేటు వద్ద నిరసన తెలి పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిం దని మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా ప్రభుత్వం గ్యాస్ ధర కూడా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పటి కిరణ్‌కుమార్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఇబ్బందులను అస్సలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆధార్‌కార్డుతో ప్రమేయం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నా రు. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని కోరారు. మైనార్టీ సెల్ నాయకులు జుబేర్, ఇర్షద్, అర్షద్, ఉమర్, ఎస్సీ సెల్ నాయకులు నిగులపు లింగన్న, యువజన విభాగం నాయకులు ఎం.ఎస్.రాజు, నరేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భగ్గుమన్న విపక్షాలు
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి భారంగా బతుకు బం డిని ఈడుస్తున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి అదన పు భారం మోపడంతో విపక్షా లు భగ్గుమన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం, ఇల్లెందు, భద్రాచలం ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలపై భారం మోపడమే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలను, ప్రజలకు భారంగా మారిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సరైన సమయంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. ఖమ్మంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్లో ఆందోళన నిర్వంచారు. పార్టీ కార్యాలయం నుంచి మహిళలు బయలుదేరి జడ్పీ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఎండీ ముస్తాఫా, మహిళా నాయకురాళ్లు కొత్తకొండ శ్రీలక్ష్మీ, పద్మజారెడ్డి, షకీనా తదితరులు పాల్గొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో సరిత క్లినిక్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బత్తుల హైమావతి, మచ్చా లక్ష్మి, అఫ్రోజ్షమీనా, గట్టు రమాదేవి, ఉమా మ హేశ్వరి, అమరావతి, రమ్య తదితరులు పా ల్గొన్నారు. సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎండీ సలాం ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య, శ్రీని వాస్, మంగతాయి, శిరోమణి పాల్గొన్నారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్యాస్ ధరలను తగ్గించేంత వరకూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గ్యాస్ ధర పెంపు పట్ల నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రేగలగడ్డ ముత్తయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరను వె ంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, గార్ల, బయ్యారం, కామేపల్లి మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇల్లెందులో జరిగిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, ఆయా మండలాల్లో మండల కార్యదర్శులు పాల్గొన్నారు. ఇల్లెందులో పార్టీ జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, డివిజన్ నాయకులు దేవులపల్లి యాకయ్య, బయ్యారంలో మండా రాజన్న, కామేపల్లిలో వింజం నాగభూషణం పాల్గొన్నారు. -
గ్యాస్ ధర పెంపుపై మండిపాటు
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడంపై గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏడాదిలో మూడోసారి ధర పెంచడా న్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రజా సంఘాలు, వి ద్యార్థి సంఘం ఆందోళనకు ఉపక్రమించాయి. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వైఫల్యం నిరుపేద ప్రజలకు ఆర్థిక భారంగా మారిందని ఐఆర్‌సీపీ రాష్ట్ర కో కన్వీనర్ జయరావు అన్నా రు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. ఆర్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మేకల శ్రీనివాస్, నాయకులు చాంద్, రాజేశ్, మధు, శ్రీనివాస్, తాజ్, మల్లేశ్, సదీ, లక్ష్మణ్, మల్లేశ్, లచ్చన్న, రమేశ్, సుజాత పాల్గొన్నారు. అలాగే గ్యాస్ ధరను తగ్గించాలని కోరుతూ పీడీఎస్ యూ (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం) ఆధ్వర్యంలో ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో జరిగింది. రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని నినాదాలు చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయూలని డి మాండ్ చేశారు. నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, రాజు, తిరుపతి, నగేశ్, సమ్మయ్య పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. మంచిర్యాల టౌన్ : సబ్సిడీ గ్యాస్ ధర పెంపుపై బీజేపీ మహిళా మోర్చ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని జేఏసీ దీక్షా శిబిరం వద్ద గ్యాస్ బండ భారమైందని తెలియజేసేలా కట్టెలతో వంటలు చేస్తూ నిరసన తెలిపారు. బీజేపీ మహిళా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బోకుంట ప్రభ మాట్లాడుతూ, కొత్త సంవత్సరం రోజునే కేంద్రం సబ్సిడీ గ్యాస్ ధరను పెంచుతూ వెంటనే అమలు చేయడం దారుణమన్నారు. పెంచిన సబ్సిడీ గ్యాస్ ధర తగ్గించే వరకు బీజేపీ మహిళలు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు వినోద, పట్టణ అధ్యక్షురాలు స్వరూప, 17వ వార్డు అధ్యక్షురాలు ఎస్.లక్ష్మి, నాయకులు అల్లాడి ప్రమీల, బింగి లక్ష్మి, సౌందర్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, కోశాధికారి బొలిశెట్టి శ్రీనివాస్, నాయకులు సౌళ్ల సంఇదీప్, బొద్దున మల్లేశ్, ప్రకాశ్‌శర్మ పాల్గొన్నారు.