సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీతో ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొట్టినా, అసలు జరుగుతున్నది వేరు. దీని పేరు చెప్పి ప్రజలు ఎక్కువ భారం మోయాల్సి వస్తోంది. తాజాగా చమురు సంస్థలు సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పైగా చేశారు. ఒక్క సిలిండర్ తీసుకోవాలంటే 1024 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రంలో నగదు బదిలీ పథకం అమలయ్యే మొత్తం 12 జిల్లాల్లోనే తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలు అమల్లోకి రానున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటిలోనూ హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పెంపు తక్షణం అమల్లోకి వచ్చిందని, మిగిలిన కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో మూడు నెలల అనంతరమే ధరల పెంపు వర్తించనుందని ఆయన వివరించారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలతో నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే వినియోగదారులపై రూ. 7, ఆధార్ నమోదు కాని వారిపై రూ. 62 అదనపు భారం పడుతుందని వివరించారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 962.50 నుంచి రూ.1024.50 కు పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ కింద వినియోగదారుల బ్యాంకు అకౌంట్లలో జమచేసే సబ్సిడీని ఒక్కో సిలిండర్‌కు రూ. 498.76 నుంచి 553.70కు పెంచిందన్నారు.
ఫలితంగా ఈ పథకం వర్తించే వినియోగదారులకు సిలిండర్‌పై రూ. 7 అదనపు భారం పడుతుందని, ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారికి ఈ పెంపు రూ. 62గా ఉంటుందని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 24 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాలేదని, అందువల్ల వీరు ఒక్కో సిలిండర్‌ను రూ. 1024.50 చెల్లించి కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం వర్తించని 7 జిల్లాల్లో(కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, వైఎస్సార్, కర్నూలు) సిలిండర్ ధరల పెంపు తక్షణమే వర్తించదని అధికారి పేర్కొన్నారు.
‘నగదు బదిలీ’తో గ్యాస్ సిలిండర్ ధర తడిసి మోపెడు!
Published Wed, Sep 4 2013 10:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement