న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు గత ఏడాదికాలంగా నెమ్మదించిన నేపథ్యంలో దేశీయంగా సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు రేటు కూడా వచ్చే నెల నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 12.12 డాలర్లుగా ఉన్న సంక్లిష్ట క్షేత్రాల గ్యాస్ రేటును ప్రభుత్వం 10.4 డాలర్లకు తగ్గించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం కేజీ–డీ6 క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే గ్యాస్ ధర సుమారు 14 శాతం తగ్గవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలను కేంద్రం ఏటా రెండుసార్లు (ఏప్రిల్ 1న ఒకసారి, అక్టోబర్ 1న మరోసారి) సవరిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా మొదలైన వాటికి కేటాయించిన పాత క్షేత్రాలకు, రిలయన్స్ వంటి సంస్థలకు కేటాయించిన కొత్త క్షేత్రాలకు వేర్వేరు ఫార్ములాలను వర్తింపచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment