న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్‌పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్‌లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది.
కేసు వివరాలు ఇవీ...
» నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్‌పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం.
» 2009లో ఆర్‌ఐఎల్‌తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్‌పీఎల్‌లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్‌ఐఎల్ నిర్ణయం తీసుకుంది.
» ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్‌పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్‌ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) సెగ్మెంట్‌లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్‌పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.
» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.
ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం.
» కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment