Reliance Gas
-
అక్టోబర్ నుంచి తగ్గనున్న రిలయన్స్ గ్యాస్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు గత ఏడాదికాలంగా నెమ్మదించిన నేపథ్యంలో దేశీయంగా సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు రేటు కూడా వచ్చే నెల నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 12.12 డాలర్లుగా ఉన్న సంక్లిష్ట క్షేత్రాల గ్యాస్ రేటును ప్రభుత్వం 10.4 డాలర్లకు తగ్గించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం కేజీ–డీ6 క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే గ్యాస్ ధర సుమారు 14 శాతం తగ్గవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలను కేంద్రం ఏటా రెండుసార్లు (ఏప్రిల్ 1న ఒకసారి, అక్టోబర్ 1న మరోసారి) సవరిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా మొదలైన వాటికి కేటాయించిన పాత క్షేత్రాలకు, రిలయన్స్ వంటి సంస్థలకు కేటాయించిన కొత్త క్షేత్రాలకు వేర్వేరు ఫార్ములాలను వర్తింపచేస్తుంది. -
రిలయన్స్ గ్యాస్‌కు టాప్ బిడ్డరుగా ఐవోసీ
న్యూఢిల్లీ: కేజీ–డీ6 గ్యాస్ విక్రయానికి సంబంధించి రిలయన్స్–బీపీ నిర్వహించిన వేలంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) టాప్ బిడ్డరుగా నిల్చింది. మే నెలలో రోజుకు 5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేయగా 2.5 ఎంసీఎండీని దక్కించుకుంది. అంతకు ముందు ఏప్రిల్‌లో కూడా రిలయన్స్-బీపీ 6 ఎంసీఎండీ గ్యాస్‌ను వేలం వేయగా దాదాపు అందులో సగభాగాన్ని ఐవోసీ కొనుగోలు చేసింది. తాజాగా మూడేళ్ల పాటు సరఫరా కోసం గత నెల 19 నుంచి 23 వరకు కేజీ–డీ6 గ్యాస్ ఈ–వేలం నిర్వహించగా మొత్తం 16 సంస్థలు కొనుగోలు చేశాయి. యూనిట్ (ఎంబీటీయూ) ఒక్కింటికి సగటున దాదాపు 10 డాలర్ల చొప్పున రేటు పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
తగ్గిన భారత్ ముడి చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్‌లో భారత్ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నులుకాగా, 2022 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 2.47 మిలియన్ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వ రంగం దూకుడు.. కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తి 1.63 మిలియన్ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. సహజ వాయువు ఉత్పత్తి ఇలా... కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్‌కు నిలయమైన తూర్పు ఆఫ్‌షోర్ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్‌షోర్ అవుట్‌పుట్ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు. రిఫైనరీల పరిస్థితి ఇలా... డిమాండ్ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్‌లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్ టన్నులు గా ఉంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్ సెక్టార్ యూనిట్ల క్రూడ్ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్‌లో 22.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. కేంద్రం నజర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను చమురు, గ్యాస్ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లీజ్.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్ చీఫ్ -
వంటగ్యాస్.. ప్రైవేటు రూట్!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ) కూడా అతి త్వరలో ఓపెన్మారెక్ట్ (సబ్సిడీ రహిత) కానుందా..? కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే సామాన్యుడికి సైతం ఈ సందేహం రాకమానదు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. కానీ, సర్కారు సబ్సిడీ మాత్రం ఇదే కాలంలో రెండంకెల స్థాయికి దిగిపోయింది. వంటగ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రైవేటు సంస్థలైన గోగ్యాస్, ప్యూర్గ్యాస్, రిలయన్స్ గ్యాస్ తదితర కంపెనీలకు ఈ విభాగంలో ద్వారాలు తెరుచుకున్నట్టయింది. ఈ సంస్థలు ప్రధానంగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలకే ఇంతకాలం పరిమితం అయ్యాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు ప్రభుత్వరంగ చమురు/గ్యాస్ కంపెనీలకే ఎల్పీజీ విక్రయాలపై సబ్సిడీలను పరిమితం చేసింది. అంటే ఈ సబ్సిడీయే ప్రైవేటు సంస్థలకు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిందని చెప్పుకోవాలి. కానీ, ఈ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ సబ్సిడీ ఇస్తున్నా కానీ.. ఒక్కో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై ఇది రూ.40–50ను మించడం లేదు. వాస్తవానికి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కేంద్రం సబ్సిడీ కూడా పెరగాలి. కానీ, కేంద్ర సర్కారు తెలివిగా ఈ భారం మొత్తాన్ని క్రమంగా వినియోగదారుల నెత్తినే రుద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకోవాలి. ఇదీ పరిస్థితి.. ప్రస్తుతానికి ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884గా ఉంది. గత ప్రభుత్వాలు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500లోపే పరిమితం చేశాయి. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు.. డీజిల్, పెట్రోల్‌పై క్రమంగా సబ్సిడీని ఎత్తివేసిన తీరులోనే.. ఎల్పీజీ సబ్సిడీని గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కో సిలిండర్ (ఏడాదికి గరిష్టంగా ఒక వినియోదారుకు 12 సిలిండర్లకే సబ్సిడీ)కు ఇస్తున్న నామమాత్రపు రూ.40 సబ్సిడీని ఎత్తివేయడానికి ఎక్కువ సమయం పట్టేట్టు లేదు. ఓపెన్ మార్కెట్.. ప్రభుత్వ విధానం.. ప్రైవేటు సంస్థలకు వ్యాపార వరంగా మారనుంది. భారత్ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్పీజీ మార్కెట్లోకి దూకుడుగా వెళ్లే ప్రణాళికలతో ఉంది. ఈ సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో వంటగ్యాస్ కనెక్షన్ల విక్రయాలను చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనరీ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఈ రాష్ట్రాలకు సులభంగా సిలిండర్లను చేరవేయగలదు. అహ్మదాబాద్‌లో రిలయన్స్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 15 కిలోలు ధర ప్రస్తుతం రూ.1,200గా ఉంది. అంటే కిలో ధర రూ.80. ఏజిస్ లాజిస్టిక్స్‌కు చెందిన ప్యూర్గ్యాస్ ఒక్కో సిలిండర్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. అంటే కిలో ధర రూ.87. గోగ్యాస్ (కాన్ఫిడెన్స్ పెట్రోలియం) 15 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు రూ.1,200 వసూలు చేస్తోంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) విక్రయిస్తున్న సిలిండర్ ధరలు రూ.900 స్థాయిలో ఉన్నాయి. మా సేవలు చూడండి.. వేగవంతమైన సేవలకు మాది పూచీ.. ఇది ప్రైవేటు సంస్థలు చెబుతున్న మాట. కనెక్షన్‌ను వెంటనే జారీ చేయడం.. సిలిండర్‌ను 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కనెక్షన్‌కు రోజుల నుంచి వారాలు కూడా పట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటోంది. ‘‘ఓఎంసీలు కనెక్షన్ ఇచ్చే ముందు ఎంతో పరిశీలన చేస్తాయి. సబ్సిడీ గణనీయంగా తగ్గిపోయినా కానీ వారి విధానం మారలేదు’’ అంటూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఒకరు వాపోవడం గమనార్హం. పైగా గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు మళ్లకుండా ఓంఎసీలు ప్రయతి్నస్తుంటాయి. గృహ ఎల్పీజీపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉంటే.. వాణిజ్య ఎల్పీజీపై ఇది 18%గా ఉండడం గమనార్హం. ప్రైవేటుకు బాటలు.. పెట్రోలియం శాఖ సమాంతర మార్కెటింగ్ వ్యవస్థ (పీఎంఎస్) కింద కల్పించిన సరళీకరణలు ప్రైవేటు సంస్థలకు అనుకూలించాయి. పీఎంఎస్ కింద ఎల్పీజీ దిగుమతి, నిల్వ, రవాణా, బాట్లింగ్, మార్కెటింగ్, పంపిణీ, విక్రయాలకు అవకాశాలు పెరిగాయనేది క్రిసిల్ అంచనా. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రభుత్వ ఓఎంసీలకే సరఫరా చేయాలన్న 2014 నాటి ఆదేశాలను పెట్రోలియం శాఖ పక్కన పెట్టేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతీ నెలా 10,000 టన్నుల ఎల్పీజీని ప్రైవేటు సంస్థలకు విక్రయించుకునేందుకు 2015లో అను మతించింది. దీంతో ప్రైవేటు సంస్థలు రిలయన్స్ నుంచి గ్యాస్‌ను కొనుక్కునే అవకాశం ఏర్పడింది. ఇదొక్కటీ మారితే.. ఓఎంసీ సంస్థలతో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ మినహా మిగిలిన సంస్థలకు అంత సానుకూలతలు ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎందుకంటే అవి దేశీయ రిఫైనరీ సంస్థల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసుకోవడం లేదంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ‘ఓఎంసీలు విక్రయించే ఎల్పీజీని చమురు నుంచి ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో వాటిపై దిగుమతి సుంకం (5%) ఉండడం లేదు. ప్రైవే టు సంస్థలు రిఫైనరీలు లేకపోతే (ప్రైవేటులో రిలయన్స్‌కే రిఫైనరీలున్నాయి).. దిగుమతి చేసుకోవడం లేదంటే దేశీయ సంస్థల నుంచి కొనుగో లు చేసుకోవడం చేయాలి. దీంతో తయారీ వ్య యాలు పెరుగుతాయి. ఇది ధరలపై ప్రభా వం చూపిస్తోంది’ అని ఐవోసీ అధికారి చెప్పారు. -
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
-
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్‌లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్‌తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. -
రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో భారీ నిక్షేపాలు
నికో రిసోర్సెస్ వెల్లడి న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాక్‌లో ఇటీవల కనుగొన్న ఎంజే-1 నిక్షేపాల్లో సుమారు 1.4 ట్రిలియన్ ఘనపుటడుగుల (టీసీఎఫ్) మేర గ్యాస్ నిల్వలు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌లోని ప్రధాన గ్యాస్ క్షేత్రాల్లోని నిల్వలతో పోలిస్తే ఇది దాదాపు సగం. ఎంజే-1పై అంచనాలు నిజమైతే కేజీ-డీ6లో డీ1..డీ3, ఆర్-సిరీస్ తర్వాత అత్యంత భారీ గ్యాస్ క్షేత్రం ఇదే కాగలదని బ్లాక్‌లో భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ పేర్కొంది. -
'ఆ వాటా ఏపీకి దక్కాల్సిందే'
విజయవాడ: కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తరలించుకు పోతున్న గ్యాస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన వాటాను దక్కించుకుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలయన్స్ నుంచి వాటా రాబట్టలేక ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్, పెట్రోల్ ఛార్జీల పెంపుపై ఉద్యమించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరలను పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో బాబు రాగానే జాబు ఇస్తానన్న చంద్రబాబు ఉన్న జాబులను పీకేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని మధు విమర్శించారు. -
కేజీ-డీ6లో మళ్లీ తగ్గిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో రోజుకు 13.63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు పెరిగిన ఉత్పత్తి ఈ నెలలో 13.28 ఎంసీఎండీలకు తగ్గింది. చమురు శాఖకు సమర్పించిన స్థాయీ నివేదికలో నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరిలో తొలివారంలో కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాలతో పాటు ఎంఏ చమురు క్షేత్రం నుంచి 13.58 ఎంసీఎండీల గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసింది. ఆతర్వాత వారంలో ఇది 13.68 ఎంసీఎండీలకు పెరిగింది. అయితే, ఈ నెల 9తో ముగిసిన వారంలో గ్యాస్ ఉత్పత్తి 13.28 ఎంసీఎండీలకు తగ్గిందని డీజీహెచ్ తెలిపింది. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.17 ఎంసీఎండీలు, ఎంఏ చమురు క్షేత్రం నుంచి 5.11 ఎంసీఎండీల ఉత్పత్తి నమోదైంది. ఇంకా సగానికిపైగా బావుల మూత... అంతకంతకూ పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి పెంచే ప్రణాళికలో భాగంగా ఆర్ఐఎల్ జనవరిలో ఎంఏ చమురు క్షేత్రంలోని ఎంఏ-8 బావిలో మళ్లీ గ్యాస్ వెలికితీతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉత్పత్తి గత నెలలో 1.5 ఎంసీఎండీలు పెరిగి 5.33 ఎంసీఎండీలకు చేరింది. మూడేళ్లపాటు వరుస తగ్గుదలకు బ్రేక్‌పడింది. అయితే, మళ్లీ తాజాగా ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్కు 60 శాతం, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు 30 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పటిదాకా డీ1, డీ3 క్షేత్రాల్లో 22 బావులను తవ్విన ఆర్ఐఎల్ కేవలం 18 బావుల్లోనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం 8 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోందని, 10 బావులు మూతబడేఉన్నాయని డీజీహెచ్ తాజా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఎంఏ క్షేత్రాల్లో మొత్తం 7 బావులకుగాను 5 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఒక బావి(ఎంఏ-6హెచ్)లో మరమ్మతులు చేపడుతోందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2009 ఏప్రిల్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 2010 మార్చిలో గరిష్టంగా 69.43 ఎంసీఎంసీలను తాకింది. ఇప్పుడు 80 శాతం పైనే ఉత్పత్తి దిగజారినట్లు లెక్క. కాగా, వచ్చే నెల 1 నుంచి గ్యాస్ రేటు రెట్టింపు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 8 డాలర్లకు ఎగబాకనుంది. ధర పెరిగాక అనూహ్యంగా లాభాలు దండుకోవడగానికే రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌ను దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ గ్యాస్ ధర పెంపునకు పచ్చజెండా..
గ్యాస్ అక్రమ నిల్వ(హోర్డింగ్), ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే అంశాలకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పక్షంలో వచ్చే ఏప్రిల్ నుంచి సహజ వాయువు ధరను దాదాపు రెట్టింపు పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అనుమతించాలని సీసీఈఏ గురువారం నిర్ణయించింది. కొత్త ధర(యూనిట్‌కు 8.4 డాలర్లు-ప్రస్తుత ధర 4.2 డాలర్లు) ప్రకారం ఆర్ఐఎల్కు పెరిగే ఆదాయానికి సమాన స్థాయిలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కేజీ-డీ6 బ్లాకులోని డీ1, డీ3 క్షేత్రాల్లో 2010-11 నుంచి గ్యాస్‌ను హోర్డింగ్ చేశారని, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించారని రుజువైన పక్షంలో బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం నగదుగా మార్చుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్ఐఎల్ గ్యాస్ ధర పెంపును తిరస్కరించాలని చమురు శాఖ ముందుగా భావించింది. గత మూడేళ్లలో ఉత్పత్తి లోటును ఆర్ఐఎల్ భర్తీ చేసేవరకు లేదా ఉత్పత్తి లక్ష్యఛేదనలో వైఫల్యానికి తమ బాధ్యత ఏమీ లేదని సంస్థ రుజువు చేసేంతవరకు ధర పెంపును అంగీకరించకూడదని ప్రతిపాదించింది. అయితే, ఈ వివాద పరిష్కారానికి మధ్యేమార్గంగా బ్యాంకు గ్యారంటీని తెరపైకి తెచ్చారు. -
గాడిమొగ టెర్మినల్‌కు ముకేశ్
సాక్షి, కాకినాడ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సీఎండీ ముకేశ్ అంబానీ తూర్పుగోదావరి జిల్లా గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ టెర్మినల్‌ను మంగళవారం సందర్శించారు. 2002లో కేజీ బేసిన్‌లోని డీ-6 బావిలో ఆర్ఐఎల్ డ్రిల్లింగ్ ప్రారంభించగా 2009 ఏప్రిల్ ఒకటిన గాడిమొగ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించేందుకు మంగళవారం ముఖేశ్ ప్లాంట్‌కు వచ్చారని సమాచారం. ముకేశ్ మరో ముగ్గురు ఉన్నతాధికారులతో కలిసి ముంబై నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గాడిమొగకు వచ్చారు. దాదాపు గంటపాటు ప్లాంట్‌లో గడిపిన ముకేశ్ గ్యాస్ ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలపై ప్లాంట్ బాధ్యులతో కొద్దిసేపు చర్చించారని సమాచారం. అధికారుల అభినందన కార్యక్రమం జరిగిన తర్వాత వారితో కలిసి విందుచేసినట్లు తెలుస్తోంది. తొలుత ముకేశ్ ఆఫ్‌షోర్‌లోని కేజీ-డీ6 బావిని కూడా సందర్శించినట్టు తెలిసింది. ఆయన పర్యటన వివరాలను మాత్రం కంపెనీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు.